Share News

నదీ గర్భాన్ని వదలట్లే!

ABN , Publish Date - Dec 18 , 2025 | 11:36 PM

మండలంలో వేగావతి నదీ గర్భం ఆక్రమణకు గురవుతోంది. పారాది, పెంట, అలజంగి, కారాడ తదితర తీర ప్రాంతాల్లో కొంతమంది నదీ గర్భాన్ని ఆక్రమించి పొలాలుగా మార్చేస్తోన్నారు.

 నదీ గర్భాన్ని వదలట్లే!
పారాది వద్ద వేగావతి నదీ గర్భంలో చదును చేసి పొలంగా మార్చిన దృశ్యం

- ఆక్రమణకు గురవుతున్న వేగావతి

- పొలాలుగా మార్చేస్తున్న వైనం

- మరొపక్క యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు

- తీర గ్రామాలకు పొంచి ఉన్న ముప్పు

బొబ్బిలి రూరల్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): మండలంలో వేగావతి నదీ గర్భం ఆక్రమణకు గురవుతోంది. పారాది, పెంట, అలజంగి, కారాడ తదితర తీర ప్రాంతాల్లో కొంతమంది నదీ గర్భాన్ని ఆక్రమించి పొలాలుగా మార్చేస్తోన్నారు. దీంతో వర్షాకాలంలో ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినప్పుడు నీటి ప్రవాహం పెరిగి తీరం కోతకు గురై పరిసర గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు, ఇరువైపులా ఆక్రమణల కారణంగా నది వెడల్పు 250 మీటర్ల నుంచి 70 మీటర్లకు తగ్గిపోయింది. ఇప్పటికీ యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు కొనసాగుతుండడంతో గోతులు ఏర్పడ్డాయి. దీంతో వరదలకు నీటి ప్రవాహం దిశ మారి కరకట్టలకు గండ్లు పడి పొలాలు ముంపునకు గురవుతున్నాయి. ఇటీవల వర్షాలకు వరదనీరు భారీగా రహదారులపై ప్రవహించింది. ఇసుక తవ్వకాల కారణంగా నదిలో ఊట బావులు కుంగిపోతున్నాయి. దీంతో వేసవిలో ప్రజలకు తాగునీరు అందని పరిస్థితి కనిపిస్తోంది. మండలంలో ఇప్పటికే పలు చెరువులు, కాలువలు, వాగులను ఆక్రమణకు గురికాగా ఇప్పుడు నదీ గర్భాలను కూడా వదలకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని నదీతీర గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్‌ ఎం.శ్రీనుని వివరణ కోరగా.. ‘వేగావతి పరివాహక ప్రాంతాల్లో సర్వే చేసి ఆక్రమణల తొలగింపుపై దృష్టి సారిస్తాం. నదీ గర్భాన్ని ఆక్రమించి పొలాలుగా మార్చిన వారికి నోటీసులు ఇస్తాం. ఎవరైనా ఆక్రమణలకు పాల్పడినట్లు తెలిస్తే మాకు సమాచారం ఇవ్వాలి.’ అని తెలిపారు.

Updated Date - Dec 18 , 2025 | 11:36 PM