Share News

ఇసుకను తోడేస్తున్నారు..

ABN , Publish Date - Dec 12 , 2025 | 12:26 AM

పార్వతీపురం, విజయనగరం జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న నాగావళి నదిలోని ఇసుకను అక్రమార్కులు తోడేస్తున్నారు.

 ఇసుకను తోడేస్తున్నారు..
పాలకొండ మండలం గోపాలపురం వద్ద నాగావళి నదిలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపడుతున్న దృశ్యం

- నాగావళి నదిలో అక్రమ తవ్వకాలు

- ఎక్కడికక్కడే గోతులతో నీటి ప్రవాహంలో మార్పు

- రక్షిత పథకాలకు పొంచిఉన్న ప్రమాదం

- సమీప గ్రామాలకు కూడా..

- చోద్యం చూస్తున్న యంత్రాంగం

పాలకొండ, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం, విజయనగరం జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న నాగావళి నదిలోని ఇసుకను అక్రమార్కులు తోడేస్తున్నారు. రాత్రి, పగలూ తేడా లేకుండా యంత్రాలతో ఎడాపెడా తవ్వేస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడే భారీగా గోతులు ఏర్పడుతున్నాయి. ఇసుకాసురుల ధాటికి నదిలో నీటి ప్రవాహ గమనమే మారిపోతుంది. దీంతో రక్షిత పథకాలకు, సమీప తీర గ్రామాలకు ప్రమాదం పొంచి ఉంది. మన్యం జిల్లా పరిధిలోని గరుగుబిల్లి, జియ్మమ్మవలస, వీరఘట్టం, పాలకొండ మండలాల్లో అనధికార ఇసుక ర్యాంపులను నిర్వహిస్తున్నారు. యంత్రాల సాయంతో తవ్వకాలు చేపట్టి భారీ వాహనాలు, ట్రాక్టర్లకు లోడు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. భామిని, కొమరాడ, వంగర, రేగిడి మండలంలోని తునివాడ, రేగిడి, సంకిలి పంచాయతీ పరిధిలోని బొడ్డవలస తదితర గ్రామాల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. నదిలో అడ్డంగా ప్రత్యేక ర్యాంప్‌లను ఏర్పాటు చేస్తున్నారు. భారీ వాహనాలు కూడా నదిలోకి వెళ్లేందుకు వీలుగా రహదారులను నిర్మించి విశాఖపట్నం, విజయనగరం తదితర సుదూర ప్రాంతాలకు ఇసుకను రవాణా చేస్తున్నారు. పోలీస్‌, రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు అడపాదడపా దాడులు చేస్తున్నా ఇసుక తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. రాజకీయ నాయకుల పైరవీలతో ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరుగుతోంది.

తాగునీటి పథకాలకు ముప్పు

జిల్లాలోని మంగళాపురం, గోపాలపురం గ్రామాల మధ్య నాగావళి నదిలో ఇన్‌ఫిల్టర్‌ బావులు ఉన్నాయి. వీటి ద్వారానే పాలకొండ పట్టణానికి తాగునీరు అందుతుంది. ఈ బావుల చెంతనే ఇసుకను తోడేస్తుండడంతో భవిష్యత్తులో రక్షిత మంచినీటి పథకాలపై ప్రభావం చూపే అవకాశం అధికంగా ఉంది. నాగావళి నదికి అవతల వైపు బొడ్డవలస సమీపంలోని ప్రధాన ఇన్‌ఫిల్టర్‌ బావులు ఉన్నాయి. వీటిద్వారా చీపురుపల్లి, రాజాం నియోజకవర్గంలోని పలు మండలాలకు తాగునీరు సరఫరా అవుతుంది. ఈ బావుల సమీపంలోనే గోపాలపురం, మరోపక్క బొడ్డవలస గ్రామాల మధ్య ఎదురెదురుగా ఇసుక ర్యాంప్‌లు ఏర్పాటు చేసి పోటాపోటీగా అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. దీంతో ఆయా రక్షిత పథకాలకు ప్రమాదం పొంచి ఉందని నీటిపారుదలశాఖ విభాగం అధికారులు ఆందోళన చెందుతున్నారు. అదే విధంగా మంగళాపురం, సంకిలి గ్రామాల మధ్య నాగావళి నదిపై ఉన్న వంతెనకు వంద మీటర్ల లోపు ఇసుకను తవ్వేస్తుండడంతో వంతెనకు ముప్పు వాటిల్లుతుందని ఆర్‌అండ్‌బీ అధికారులు పేర్కొంటున్నారు.

గ్రామాలకు వరదముప్పు...

నదీ తీరంలోని గ్రామాల సమీపంలోనే ఇసుక తవ్వకాలు చేపడుతుండడంతో నీటి ప్రవాహ గమనం మారుతోంది. దీనివల్ల నదికి వరదలు వస్తే ఆయా గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. స్థానిక ప్రజలు స్నానాలు ఆచరించేందుకు నదిలోకి దిగే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల అన్నవరం నదీతీరంలో ఓ వ్యక్తి ఇలాగే నీటిలో దిగి మృతి చెందాడు. వీటిని దృష్టిలో ఉంచుకొని అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కఠిన చర్యలు చేపడతాం..

నాగావళి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇసుక తవ్వకాలపై నిఘా పెట్టాం. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే యంత్రాలను, వాహనాలను సీజ్‌ చేస్తాం.

- రాధాకృష్ణ, అధికారి

Updated Date - Dec 12 , 2025 | 12:26 AM