Share News

వారంతా బడి బయటే!

ABN , Publish Date - Jul 06 , 2025 | 11:47 PM

రాజాం నియోజకవర్గంలో సమగ్ర శిక్ష విభాగం ఇటీవల చేసిన సర్వేలో 227 మంది డ్రాపౌట్స్‌ను అధికారులు గుర్తించారు.

వారంతా బడి బయటే!

- రాజాం నియోజకవర్గంలో సమగ్ర శిక్ష విభాగం ఇటీవల చేసిన సర్వేలో 227 మంది డ్రాపౌట్స్‌ను అధికారులు గుర్తించారు. ఒకటి నుంచి 10వ తరగతి మధ్య వీరంతా వివిధ కారణాలతో చదువు ఆపేశారు. ఇందులో కొందరు వ్యవసాయ పనులు, మరికొందరు చిన్నచిన్న దుకాణాల్లో పనిచేస్తున్నట్టు గుర్తించారు. వారి వయసును బట్టి అధికారులు చదువుకు అవకాశం కల్పించనున్నారు.

రాజాం, జూలై 6(ఆంధ్రజ్యోతి):

జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు కలిపి 2,637 మంది పిల్లలు బడి బయట ఉన్నట్టు అధికారులు గుర్తించారు. సర్వశిక్ష అభియాన్‌ ఆధ్వర్యంలో చేసిన సర్వేలో ఈ విషయం తేలింది. తల్లిదండ్రులు వలస వెళ్లడం, ఎక్కువకాలం సెలవుల్లో ఉండడం, చదువు పట్ల ఆసక్తిలేకపోవడం తదితర కారణాలతో ఎక్కువ మంది బాలలు పాఠశాలకు దూరమైనట్టు స్పష్టమవుతోంది. అయితే నగరప్రాంతం ఎక్కువగా విస్తరించి ఉన్న విజయనగరం నియోజకవర్గంలో ఏకంగా 839 మంది పిల్లలు పాఠశాలకు దూరంగా ఉన్నట్టు తెలియడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని 27 మండలాల్లో ఓ ఆరు మండలాల్లో మాత్రం వంద మందికిపైగా డ్రాపౌట్స్‌ ఉన్నారు. అయితే ఈ ఏడాది ముందస్తుగానే అధికార యంత్రాంగం మేల్కొంది. పూర్వ ప్రాథమిక విద్యకోసం అంగన్‌వాడీలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వ ఉద్యోగులు, వలసలు వెళ్లే పిల్లల కోసం కేజీబీవీ సిబ్బంది రంగంలోకి దిగి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ 2,637 మందిని సైతం వారి స్థాయిని బట్టి పాఠశాలల్లో చేర్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. పదో తరగతి ఈడున్న విద్యార్థులు అయితే సార్వత్రిక విద్యాపీఠంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఓపెన్‌ స్కూల్‌ ద్వారా పదిలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇంటర్‌లో చేర్పిస్తారు.

తగ్గిన డ్రాపౌట్స్‌..
గత ఏడాదితో పోల్చుకుంటే డ్రాపౌట్స్‌ తగ్గడం విశేషం. గత ఏడాది ఉమ్మడి జిల్లాలో 6,259 మంది ఉన్నారు. ఈ ఏడాది ఆ సంఖ్య 2,637కు తగ్గింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యావ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. విలీనమైన పాఠశాలలను వెనక్కి తెప్పించారు. ఆదర్శ పాఠశాలలను ఏర్పాటుచేశారు. సుదూర ప్రాంతంలో పాఠశాలల్లో చదువుకుంటున్న వారికి రవాణా చార్జీలు కింద ఏడాదికి రూ.6 వేలు అందిస్తున్నారు. సన్నబియ్యంతో మంచి మెనూతో కూడిన మధ్యాహ్న భోజన పథకం అమలుచేస్తున్నారు. తల్లికి వందనం కింద విద్యార్థి తల్లిఖాతాలో రూ.13 వేలు ఎంతమంది ఉంటే అంతమందికి అందించారు. పాఠశాల నిర్వహణకు రూ.2 వేలు చొప్పున జమ చేశారు. దీంతో పాఠశాలల నిర్వహణకు సామగ్రి అంతా ఇటీవల విడుదలైంది. ప్రభుత్వ పాఠశాలల సంఖ్య కూడా పెరుగుతోందని ఉపాధ్యాయవర్గాలు చెబుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు మాత్రం పాఠశాల విద్యాను వెంటాడుతున్నాయి.

వైసీపీ హయాంలో ప్రయోగాలు
ఐదేళ్ల వైసీపీ పాలనలో పాఠశాల విద్యాశాఖపై ఎన్నోరకాల ప్రయోగాలు జరిగాయి. పాఠశాలల ఎత్తివేత, సమీప పాఠశాలలో సర్దుబాటు, ఉపాధ్యాయులను సమీప ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటు వంటి ప్రక్రియతో పాఠశాల విద్యాశాఖ అస్తవ్యస్తంగా మారింది. ఆ ప్రభావం విద్యార్థుల చదువుపై పడింది. చిన్న తరగతుల వారు కిలోమీటర్ల మేర నడిచి పాఠశాలలకు చేరుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఎదురైంది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం పాఠశాలలను కుదించింది. పరిసర పాఠశాలల్లో విలీనం చేసింది. అటు ఉపాధ్యాయులను సైతం సర్దుబాటు చేసింది. ఆన్‌లైన్‌ బోధనకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టి మాతృభాష, ప్రాంతీయ భాషలను నీరుగార్చినట్టు విమర్శలొచ్చాయి. బైజూస్‌ లాంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకొని ఉపాధ్యాయుల పాత్రను నిర్వీర్యం చేసింది. ఇవన్నీ పాఠశాల విద్యాబోధనపై ప్రభావం చూపాయి. డ్రాపౌట్స్‌ పెరిగిపోయారు. ఆ తప్పిదాలను సరిచేసే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది.

దృష్టి పెట్టాం
జిల్లాలో డ్రాపౌట్స్‌పై దృష్టిపెట్టాం. జూన్‌లోనే బడికిపోతాం ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాం. జిల్లా వ్యాప్తంగా ఇంకా బడికి దూరంగా 2,637 మంది ఉన్నారు. వారందర్నీ గుర్తించి సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. వీలైనంత వరకూ పాఠశాలల్లో చేర్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
- ఎ.రామారావు, సమగ్రశిక్ష ఏపీసీ, విజయనగరం

Updated Date - Jul 06 , 2025 | 11:47 PM