There is no worry in those roads ఆ రహదారుల్లో చింత ఉండదిక
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:20 AM
There is no worry in those roads
ఆ రహదారుల్లో చింత ఉండదిక
జిల్లాలో 67 గ్రామీణ రహదారుల నిర్మాణానికి నిధులు
133 కిలోమీటర్ల పరిధిలో రూ.84.62కోట్లతో పునఃనిర్మాణం
పరిపాలన అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం
వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక ఏర్పడిన భారీ గుంతలు
అది వేపాడ మండలం బొద్దాం కూడలి (విశాఖ-అరకు రోడ్డు) నుంచి లక్కవరపుకోట మండలం కల్లేంపూడి వరకు ఉన్న రహదారి. అడుగుకో గొయ్యి ఉండడంతో ఈ రోడ్డులో ప్రయాణించాలంటే నరకమే. వర్షం వస్తే నడిచేందుకు కూడా వీలుకాని పరిస్థితిలో ఉన్న ఈ రోడ్డును పునఃనిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు అనేకమార్లు గత ప్రభుత్వాన్ని కోరారు. పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ దృష్టిలో పెట్టారు. 3.16 కిలోమీటర్ల పొడవునా ఈరోడ్డును తిరిగి నిర్మించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంగళవారం రూ.1.74 కోట్లు మంజూరు చేయడంతో పాటు పరిపాలన అనుమతులు ఇచ్చేసింది. ఇన్నాళ్లకు ఈ రోడ్డులో ప్రయాణించే వారి కష్టాలు తీరనున్నాయి.
శృంగవరపుకోట, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి):
జిల్లా వ్యాప్తంగా శృంగవరపుకోటతో పాటు బొబ్బిలి, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, రాజాం, విజయనగరం నియోజకవర్గాల్లో ప్రధానమైన 67 గ్రామీణ రోడ్లును పునః నిర్మించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముందుకు వచ్చింది. 133 కిలోమీటర్ల పొడవున రోడ్లను బాగు చేసేందుకు రూ.84.62 కోట్లు వెచ్చించింది. ఆ శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పరిపాలన అనుమతులు ఇచ్చేశారు. ఇక ఆ రహదారులన్నింటికీ మహర్దశ పట్ట నుంది. ఇంతవరకు గుంతల్లో ప్రయాణం చేస్తున్నవారికి త్వరలోనే ఉపశమనం దొరకనుంది.
గత వైసీపీ ప్రభుత్వం రహదారుల అభివృద్ధిని పూర్తిగా విస్మరించింది. గ్రామీ ణ ప్రాంత రోడ్లకు ఒక్క రూపాయి కేటాయించలేదు. జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులకు అనుసంధానంగా ఉన్న పల్లె రోడ్లన్నింటినీ నిర్లక్ష్యం చేసింది. దీంతో ఎక్కడికక్కడ గుంతలు పడ్డాయి. అడుగుకో గొయ్యి ఏర్పడడంతో ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కింద పడేవారు. ప్రమాదాల బారిన పడి ఎంతోమంది ఆసుపత్రి పాలయ్యారు. అత్యధిక గ్రామాలకు అనుసంధానంగా వున్న ప్రధాన రహదారులను కూడా బాగు చేసేందుకు ఆలోచన చేయలేదు. ఏడాదిన్నర క్రితం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చింది. ఈ రోడ్లను బాగు చేయాలని నిర్ణయం తీసుకుంది. బాగా పాడైన రోడ్లను తొలుత మార్చా లని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సహ కారం తీసుకుంటోంది. స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ కేపిటల్ ఇన్వెస్టిమెంట్ (సాస్కి) కింద నాబార్డ్ ఈ నిధులను కేటాయించింది. రోడ్లును బాగు చేయనుండడంతో ఆయా గ్రామాల ప్రజల నుంచి అనందం వ్యక్తమవుతోంది.
రోడ్లు బాగుంటేనే అభివృద్ధి..
ఈ ప్రభుత్వం అభివృద్ధితో కూడిన సంక్షేమం అందిస్తోంది. ప్రతి పల్లెకు రోడ్డు అవసరాన్ని గుర్తించింది. రోడ్లు బాగుంటేనే అభివృద్ధి ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వం రోడ్లు నిర్మించకుండానిర్లక్ష్యం చేసింది. దీంతో ఏ రోడ్డు చూసిన గుంతలే. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చొరవతో ఇక మంచి రోజులు వస్తున్నాయి. నా నియోజకవర్గంలో వేపాడ మండల పరిధిలో మూడు, కొత్తవలస మండల పరిధిలో మూడు, శృంగవరపుకోట మండల పరిధిలో ఒకటి కలిపి ఏడు రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. వీటిని త్వరగా పూర్తి చేయిస్తాను. -కోళ్ల లలితకుమారి, ఎమ్మెల్యే, ఎస్.కోట
నియోజకవర్గం కిలోమీటర్లు నిధులు
(రూ.కోట్లలో)
బొబ్బిలి 19.46 రూ.10.21
చీపురుపల్లి 18.86 రూ. 9.70
గజపతినగరం 18.29 రూ.23.06
నెల్లిమర్ల 25.15 రూ.13.24
రాజాం 14.71 రూ.9.10
శృంగవరపుకోట 16.69 రూ. 9.28
విజయనగరం 20.54 రూ.10.03
-------------------------