జిల్లాలో ఎరువుల కొరత లేదు
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:20 AM
‘జిల్లాలో ఎరువుల కొరత లేదు. అవసరమైన నిల్వలు ఉన్నాయి. వాటిని పక్కదారి పట్టించినా.. ఎరువులతో పాటు ఇతర సరుకులు కొనాలని రైతులను ఇబ్బందులు పెట్టినా సంబంధిత దుకాణదారు లపై కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ హెచ్చరించారు.
వాటిని పక్కదారి పట్టిస్తే చర్యలు
రైతులను ఇబ్బంది పెట్టవద్దు
కలెక్టర్ అంబేడ్కర్
విజయనగరం కలెక్టరేట్, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): ‘జిల్లాలో ఎరువుల కొరత లేదు. అవసరమైన నిల్వలు ఉన్నాయి. వాటిని పక్కదారి పట్టించినా.. ఎరువులతో పాటు ఇతర సరుకులు కొనాలని రైతులను ఇబ్బందులు పెట్టినా సంబంధిత దుకాణదారు లపై కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ హెచ్చరించారు. శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితర ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ అంబేడ్కర్ మాట్లాడుతూ.. తహసీల్దార్లు, సేష్టన్ హౌస్ ఆఫీసర్లు , సివిల్ సప్లయ్ అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, మండలాల్లో ఉన్న ఎరువులు షాపులు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, రైతు సేవా కేంద్రాలను తనిఖీ చేయిస్తున్నట్లు తెలిపారు. ఆయా షాపుల్లో ఎరువుల నిల్వ, పంపిణీపై వారం రోజుల్లో నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ‘ఈ ఖరీప్ సీజన్‌లో జిల్లాలో ఇప్పటి వరకూ 84,998 హెక్టార్లలో వివిధ పంటలు సాగు జరిగింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఇప్పటి వరకు 11 శాతం అధికంగా సాగు అయింది. గత సంవత్సరంలో ఇదే సమయానికి వివిధ పంటల సాగు 71,684 హెక్టార్లతో జరిగింది. ఈ ఏడాది 13,314 హెక్టార్లలో అదనంగా సాగు అవుతుంది. ప్రసుత్తం ఉన్న పంటలకు గాను 36,740 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ఇప్పటి వరకు 25,605 మెట్రిక్ టన్నులు సరఫరా జరిగింది. 2,339 మెట్రిక్ టన్నుల యూరియా, 1330 మెట్రిక్ టన్నుల డీఏపీ రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు వ్యాపారులు వద్ద అందుబాటులో ఉన్నాయి. ఈ నెలాఖరుకు 3 వేల టన్నుల యూరియా అవసరం ఉంటుంది.’ అని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జేసీ సేతు మాధవన్, వ్యవసాయ శాఖ జేడీ రామారావ, మార్క్‌ఫెడ్ డీఎం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేయాలి
జిల్లాలో ఉన్న స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేయాలని కలెక్టర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పీసీపీఎన్‌డీటీ చట్టం అమలుపై తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. నెలవారిగా జరుగుతున్న స్కానింగ్‌లు, ప్రసవాలు, అనధికారింగా ఆసుపత్రుల్లో జరుగుతున్న గర్భస్రావవాలపై కలెక్టర్ ప్రశ్నించారు. గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని, ఇలా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అనుమతులు లేకుండా కొత్తగా స్కానింగ్ సెంటర్లను ఏర్పాటు చేయకూడదన్నారు. ప్రతీ స్కానింగ్ సెంటర్‌లో తప్పనిసరిగా ధరలు పట్టికతో పాటు లింగ నిర్ధారణ చేయడం నేరమని అనే బోర్డు ఉండాలన్నారు. సరోగసి కేంద్రాలకు కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరి అన్నారు. జిల్లాలోని స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసేందుకు డివిజన్ వారిగా ఆర్డీవో, డీఎస్పీ, డిప్యూటీ డీఎంహెచ్‌తో కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ బృందాలు స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసి నివేదిక అందజేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి జీవనరాణి, డీసీహెచ్‌ఎస్ పద్మశ్రీరాణి తదితరులు పాల్గొన్నారు.