దివ్యాంగుల్లోనే ఎంతో ప్రతిభ
ABN , Publish Date - Dec 06 , 2025 | 12:22 AM
అన్ని అవయవాలు ఉన్న వారికంటే, అవయవ లోపం ఉన్నవారిలోనే ఎంతో ప్రతిభ ఉంటుందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
- హోంశాఖ మంత్రి అనిత
కొత్తవలస, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): అన్ని అవయవాలు ఉన్న వారికంటే, అవయవ లోపం ఉన్నవారిలోనే ఎంతో ప్రతిభ ఉంటుందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. మండలంలోని గురుదేవ చారిటబుల్ ట్రస్టును ఆమె శుక్రవారం సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. శరీరంలో ఏదో ఒక అవయవం లేని వారు దివ్యాంగులు కాదని, అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కనీసం మానవత్వం లేకుండా ఎదుటివారిపై కుట్రలు, కుతంత్రాలు, దుర్బుద్ధి కలినిగిన వారే నిజమైన మానసిక వికలాంగులని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు దివ్యాంగులకు కూడా నామినేటెడ్ పదవులను ఇస్తున్నారని అన్నారు. దివ్యాంగులను మూడు కేటగిరీలుగా విభజించి వారికి రూ.6 వేలు, రూ.10 వేలు రూ.15 వేలు చొప్పున ప్రతి నెలా ఒకటో తేదీన వారి ఇంటికి తీసుకెళ్లి పింఛన్లు అందిస్తున్నట్లు చెప్పారు. గురుదేవ చారిటబుల్ ట్రస్టు ద్వారా ఎన్టీఆర్ వైద్య సేవలు అందించే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు. సుమారు రూ.12 కోట్లతో ఉప్పలపాటి విజయశ్రీ పేరుతో 100 పడకల క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేశామన్నారు. ఈసందర్భంగా విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురంమన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గం నుంచి వచ్చిన దివ్యాంగుల కృత్రిమ అవయవాలను ఆమె పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామి, శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, దాసరి కార్పొరేషన్ చైర్మన్ పీవీ రత్నాజీ, టీడీపీ మండల అధ్యక్షుడు కోళ్ల వెంకటరమణ, విశాఖపట్నం డిప్యూటీ మేయర్ గోవిందరావు, ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.