నీటి వనరులున్నా.. ఉపయోగం సున్నా
ABN , Publish Date - Jun 06 , 2025 | 12:16 AM
భామిని మండలంలో నీటి వనరులకు కొదవ లేదు. సింగిడి బ్యాలెన్సింగ్, భామిని కొండలోయగెడ్డ వంటి రిజర్వాయర్లు ఉన్నాయి.
- ముందుకు సాగని పనులు
- రైతులకు అందని సాగునీరు
- ఈ ఏడాది కూడా మారని పరిస్థితి
భామిని, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): భామిని మండలంలో నీటి వనరులకు కొదవ లేదు. సింగిడి బ్యాలెన్సింగ్, భామిని కొండలోయగెడ్డ వంటి రిజర్వాయర్లు ఉన్నాయి. కానీ, వాటివల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండడం లేదు. పనులు పూర్తికాకపోవడంతో సాగునీరు అందడం లేదు. వడ్డంగి, మనుమకొండ ఎత్తిపోతల పథకాలు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. దీంతో ఏటా వర్షాల కోసం రైతుల ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి నెలకొంది. గత ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ సర్కారు ఈ పనులపై తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇంకా ఆ జోలికి వెళ్లడం లేదు. దీంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఇదీ పరిస్థితి..
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు వంశధార ప్రాజెక్టు జీవనాడి. ఈ ప్రాజెక్టు విస్తరణలో భాగంగా వంశధార వరద నీటిని సద్వినియోగం చేసుకునేందుకు 2005లో ఫేజ్-2, స్టేజ్-2 పేరిట రూ.వెయ్యి కోట్లతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు చేపట్టింది. ఈ ప్రాజెక్టు విలువ ప్రస్తుతం రూ.2,400 కోట్లుకు పెరిగింది. కొన్ని పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆరేళ్లుగా పట్టించుకో కపోవడంతో అవి పూర్తి కావడం లేదు. దీనికి తోడు కాట్రగడ ఓపెన్‌హెడ్ చానల్ వద్ద వరద కాలువకు ముందు మట్టి, ఇసుక పేరుకుపోయింది. వాటిని తొలగించే ప్రయత్నం చేసినా ఫలితం లేదు. మిగిలిన వరద కాలువ పనులు పూర్తి చేసే దాత లేరు. సింగిడి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు పూర్తికాకపోవడంతో పాటు దీనికి సేకరించిన భూములకు సంబంధించి రైతులకు ఏళ్ల తరబడి పరిహారం అందివ్వడం లేదు. కాట్రగడ నుంచి కొరమ వరకు 20 కిలోమీటర్ల వరదకాలువ నిర్మించారు. దీంతో ఈ కాలువ గర్భంలో వివిధ గెడ్డలు, వాగులు, చెరువులు కలిసిపోయాయి. దీనివల్ల రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. కూటమి ప్రభుత్వం చొరవ చూపి సింగిడి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు చేపట్టి, పిల్ల కాలువల ద్వారా సాగునీరు అందించే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
వంశధార ఓపెన్‌హెడ్ చానెల్ ముఖ ద్వారం వద్ద పూర్తికాని లైనింగ్ పనులు
గొప్పలే మిగిలాయి..
వంశధార ప్రాజెక్టు పనులు 2022 నాటికే పూర్తి చేస్తామని గత వైసీపీ సర్కార్ గొప్పలు చెప్పింది. కానీ, ఐదేళ్లలో ఎక్కడా తట్టెడు మట్టి పనులు చేపట్టిన దాఖలాలు లేవు. జిల్లాల విభజనతో భామిని మండలం పార్వతీపురం మన్యం జిల్లాలో కలిసింది. ఈ మండల పరిధిలోనే వంశధార ప్రాజెక్టు ప్రధాన పనులు అధికంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనులు ప్రస్తుతం నత్తనడకన సాగుతున్నాయి. వంశధారకు వచ్చిన వరద నీటిని కాట్రగడ ఓపెన్‌హెడ్ చానల్ ద్వారా హిరమండలం వద్ద నిర్మించిన వంశధార రిజర్వాయర్‌కు మళ్లించేలా డిజైన్ రూపొందించారు. టీడీపీ ప్రభుత్వంలో 2018లో వరదల సమయంలో ఒక్కసారి మాత్రమే నీటిని మళ్లించారు. ఆ తరువాత ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు. గత రెండేళ్లుగా వంశధారలో ఆశించిన వరదలు లేకపోవడంతో నీరు మళ్లింపు నామమాత్రంగానే సాగింది. ఇప్పటికైనా సింగిడి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు గేట్లు ఏర్పాటు చేసి పిల్ల కాలువల ద్వారా నీరు మళ్లించే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. దీనివల్ల పసుకుడి, భామిని, లివిరి, దిమ్మిడిజోల, బాలేరు, ఘనసర తదితర గ్రామాలకు సాగునీటి కష్టాలు తీరుతాయి.
త్వరలో గేట్లు ఏర్పాటు చేస్తాం
వంశధార వరద కాలువలో లైనింగ్ పనులు చేపడుతున్నాం. పెండింగ్ పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించాం. సింగిడి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు త్వరలో గేట్లు అమర్చుతాం. రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తాం.
- భవానీ శంకర్, వంశధార డీఈ