Share News

అడుగడుగునా గోతులే..

ABN , Publish Date - Jun 29 , 2025 | 11:29 PM

మండలంలోని పలు గ్రామాల రహదారులు అడుగడుగునా గోతులతో దర్శనమిస్తున్నాయి.

 అడుగడుగునా గోతులే..

  • అధ్వానంగా గ్రామీణ రహదారులు

  • వర్షాలతో మరింత దారుణంగా తయారైన వైనం

  • తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనచోదకులు

పార్వతీపురం రూరల్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాల రహదారులు అడుగడుగునా గోతులతో దర్శనమిస్తున్నాయి. దీనికితోడు వర్షాలు కురుస్తుండడంతో మరింత అధ్వానంగా తయారవుతున్నాయి. దీనివల్ల ప్రజలు రాకపోకలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సంక్రాంతి నాటికే గ్రామీణ ప్రాంతాల రహదారులను పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. కానీ మండలంలో అత్యధిక రహదారులు ఇప్పటికీ మరమ్మతులకు నోచుకోలేదు. వెంకంపేట గోలీల నుంచి ఎంఆర్‌నగరం వరకు వెళ్లే రహదారి గోతులు మయంగా ఉండడంతో ద్విచక్ర వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారులు మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం

రహదారులు పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. మా గ్రామ చివర ప్రాంతంలో ఉన్న వంతెనపై రహదారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పెద్ద పెద్ద గోతులు ఏర్పడడంతో ద్విచక్ర వాహనదారులతో పాటు నాలుగు చక్రాల వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు స్పందించి రహదారులకు మరమ్మతులు చేపట్టాలి.

- అప్పలనాయుడు, చిన్నబొండపల్లి

నిధులు వచ్చిన వెంటనే మరమ్మతులు చేస్తాం

నిధులు వచ్చిన వెంటనే మరమ్మతులు పూర్తి చేస్తాం. పార్వతీపురం నుంచి కొరాపుట్‌ వెళ్లే రహదారికి సంబంధించి గతంలో చేపట్టిన పనులకు బిల్లులు మంజూరు కాలేదు. ఈ పనులను గుత్తేదారులు మధ్యలో నిలిపివేశారు. పనుల్లో భాగంగా చిన్న బొండపల్లి వద్ద పాడైన రహదారి పనులు చేపట్టాల్సి ఉంది.

- అప్పాజీ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌

Updated Date - Jun 29 , 2025 | 11:29 PM