Share News

ఇల్లులు లేవు.. బిల్లులు రావు

ABN , Publish Date - Dec 28 , 2025 | 11:01 PM

సీతంపేట మన్యంలోని మారుమూల గ్రామం పొంగలంగూడకు చెందిన ఆదివాసీలు పక్కా గృహాలకు నోచుకోవడం లేదు.

ఇల్లులు లేవు.. బిల్లులు రావు
పొంగలంగూడలో రేకులు, మట్టి గోడలతో ఉన్న ఇళ్లు

-రేకులషెడ్లు, మట్టిగోడల మధ్యే నివాసం

- పొంగలంగూడ ఆదివాసీలకు తప్పని ఇబ్బందులు

- పక్కా గృహాలకు నోచుకోని పీవీటీజీలు

సీతంపేట రూరల్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): సీతంపేట మన్యంలోని మారుమూల గ్రామం పొంగలంగూడకు చెందిన ఆదివాసీలు పక్కా గృహాలకు నోచుకోవడం లేదు. తాడిపాయి పంచాయతీ పరిధిలో ఉన్న ఈ గ్రామంలో 21 పీవీటీజీ (పర్టిక్యులర్లి వల్నరబుల్‌ ట్రైబల్‌ గ్రూప్స్‌) గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023-24ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం పీఎం జన్‌మన్‌ పథకం కింద ఈ గ్రామానికి చెందిన కూరంగి అంజయ్య, బి.సరస్వతి, బి.పూర్ణమ్మ అనే లబ్ధిదారులకు గృహాలు మంజూరయ్యాయి. బిల్లులు చెల్లిస్తాం నిర్మాణాలు చేపట్టండని అప్పట్లో అధికారులు చెప్పడంతో గిరిజనులు ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేశారు. అయితే, గృహాలు శ్లాబు లెవెల్‌కి చేరేసరికి బిల్లులు చెల్లించడంలో జాప్యం జరిగింది. దీంతో సొంత నిధులను లబ్ధిదారులు సమకూర్చుకొని నిర్మాణాలు పూర్తి చేశారు. ఇది జరిగి సుమారు రెండేళ్లు కావస్తున్నా నేటికీ లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు జరగలేదు. ఎన్నిసార్లు ఐటీడీఏ, హౌసింగ్‌ అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి చెందిన మరికొందరికి ఇంతవరకు గృహాలు మంజూరు కాలేదని బి.అప్పలనాయుడు, కైలాస్‌ తదితర గిరిజనులు వాపోతున్నారు.

రేకుల షెడ్డులే గతి..

పీవీటీజీ గ్రామాల్లో నివసిస్తున్న ఆదివాసీల సొంతింటి కలను నిజం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం జన్‌మన్‌, పీఎంఏవై వంటి పథకాలను అమలు చేస్తోంది. అయితే సీతంపేట మన్యంలోని గిరిశిఖర గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులకు ఈ పథకాలు పూర్తిస్థాయిలో అందడం లేదు. పొంగలంగూడలో పీవీటీజీ గిరిజనులు నేటికీ రేకులషెడ్డులు, మట్టిగోడల మధ్య నివాసం ఉంటున్నారు. గ్రామంలో 22ఆదివాసీ గిరిజన కుటుంబాలు నివాసం ఉండగా వీరిలో అతితక్కువ మందికి మాత్రమే గతంలో గృహాలు మంజూరయ్యాయి. మిగిలిన వారు నేటికీ మట్టి ఇళ్లల్లోనే మగ్గిపోతున్నారు.

ఇదీ పరిస్థితి

మండలంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023-24ఏడాదిలో పీఎం జన్‌మన్‌ పథకం కింద 1,749గృహాలు మంజూరయ్యాయి. వీటిలో 346 నిర్మాణాలు నేటికీ ప్రారంభం కాలేదు. మిగిలిన 561 ఇళ్లు పునాది దశలో, 435 గృహాలు శ్లాబు స్థాయిలో, 328 గృహాలు శ్లాబు పూర్తయి ఉన్నాయి. కేవలం 79 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే ఇంతవరకు పూర్తయ్యాయి. పీఎంఏవై పథకం కింద 2021-22ఏడాదిలో సీతంపేట ఏజెన్సీలో మొత్తం 1,109 గృహాలు మంజూరు కాగా వీటిలో 75 పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు. 189 గృహాలు బేస్‌మెంట్‌ లెవెల్‌లో, 209 పునాదులు దశలో, 205 శ్లాబు ఎత్తులో, 102 వరకు శ్లాబు పూర్తి చేసి ఉన్నాయి. 329 గృహాలు ఇప్పటివరకు పూర్తయినట్లు హౌసింగ్‌ నివేదికలు చెబుతున్నాయి. 2008-09లో మంజూరైన ఇందిరమ్మ గృహాలు కూడా ఇప్పటికీ అనేక గ్రామాల్లో మొండిగోడలతో దర్శనమిస్తున్నాయి.

బిల్లులు చెల్లించాలి

పీఎం జన్‌మన్‌ పథకం కింద 2023-24లో నాకు ఇల్లు మంజూరైంది. అధికారుల మాటలు నమ్మి అప్పు చేసి ఇంటి నిర్మాణం చేపట్టా. శ్లాబు పూర్తిచేసి నేటికి ఏడాదిన్నర కావస్తున్నా ఇంత వరకు బిల్లులు చెల్లించలేదు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. అప్పు చేసి ఇంటి నిర్మాణం చేపట్టడంతో ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి బిల్లులు చెల్లించాలి.

-కూరంగి అంజయ్య, పొంగలంగూడ, సీతంపేట

మట్టి ఇంటిలో నివసిస్తున్నా..

ఎన్నో ఏళ్లుగా మట్టి ఇంటిలో నివసిస్తున్నా. అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. వర్షాకాలంలో బిక్కుబిక్కుమంటూ మట్లి ఇంటిలో జీవిస్తున్నా. ప్రభుత్వం స్పందించి పక్కా గృహం మంజూరు చేయాలి.

-కూరంగి గౌరి, పొంగలంగూడ, సీతంపేట

త్వరలో చెల్లిస్తాం

పొంగలంగూడలో ఇటీవల సర్వే నిర్వహించాం. ప్రధాన మంత్రి ఆవాస యోజన 2.0 కింద ఆరు గృహాల మంజూరుకు ప్రతిపాదనలు చేశాం. పెండింగ్‌ బిల్లులు కూడా కొద్ది రోజుల్లో లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాకు జమ చేస్తాం.

-వెంకటేష్‌, ఏఈ, హౌసింగ్‌

Updated Date - Dec 28 , 2025 | 11:01 PM