There are funds.. there are no roads! నిధులున్నాయి.. రోడ్లే లేవు!
ABN , Publish Date - May 05 , 2025 | 11:31 PM
There are funds.. there are no roads! అవి కొండశిఖర గ్రామాలు. రోడ్డు సౌకర్యం కూడా లేదు. వారు పడుతున్న ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. అత్యవసరమైతే డోలీ కట్టాల్సిందే. క్షేమంగా ఇంటికొచ్చే వరకూ అనుమానమే. ఆసుపత్రిలో ఎవరైనా చనిపోతే.. మృతదేహాలను భుజంపై ఊరికి చేర్చాల్సిన దుస్థితి. ప్రజాప్రతినిధులేమో ఈ గ్రామాల రోడ్లకు నిధులు మంజూరు చేయించారు.
నిధులున్నాయి.. రోడ్లే లేవు!
నిర్మాణాలకు క్షేత్రస్థాయిలో అడ్డంకులు
అటవీశాఖ అభ్యంతరాలతో సాగని వైనం
గిరిజన గ్రామాల ప్రజలకు తప్పని ఇక్కట్లు
ఎస్.కోట మండలంలో తప్పని డోలీ మోతలు
అవి కొండశిఖర గ్రామాలు. రోడ్డు సౌకర్యం కూడా లేదు. వారు పడుతున్న ఇక్కట్లు అన్నీఇన్నీ కావు. అత్యవసరమైతే డోలీ కట్టాల్సిందే. క్షేమంగా ఇంటికొచ్చే వరకూ అనుమానమే. ఆసుపత్రిలో ఎవరైనా చనిపోతే.. మృతదేహాలను భుజంపై ఊరికి చేర్చాల్సిన దుస్థితి. ప్రజాప్రతినిధులేమో ఈ గ్రామాల రోడ్లకు నిధులు మంజూరు చేయించారు. ఆ తర్వాత ఆ పనులు ఎంతవరకు వచ్చాయోనని పట్టించుకోవడం లేదు. అటవీశాఖ అభ్యంతరం చెబుతోందని పీఆర్ అధికారులు చెబుతున్నారు. వీరేమో చొరవ తీసుకుని సమస్య పరిష్కారానికి కృషి చేయరు. దీంతో ఈ కష్టాలు ఎన్నేళ్లు పడాలని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శృంగవరపుకోట, మే 5(ఆంధ్రజ్యోతి):
- దబ్బగుంట నుంచి పల్లపు దుంగాడ గిరిజన గ్రామానికి 6.10 కి.మీ. రోడ్డుతో పాటు 34 కల్వర్టుల నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం నుంచి ప్రభుత్వం రూ.489.08 లక్షలు కేటాయించింది. 2021 జూన్ 21న పనులు ప్రారంభం అయ్యాయి. 2022 జూన్ 20 నాటికి పూర్తి కావాలి. ఇప్పటికీ ఈరోడ్డు నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. అటవీశాఖ అనుమతుల్లేవని ఆపేశారు. అటవీశాఖ నుంచి పొందిన భూమికి బదులు పేదఖండేపల్లి గ్రామపరిధిలో భూమిని కూడా అధికారులు అప్పగించారు. అయినా అటవీశాఖ అభ్యంతరం చెబుతోందని పంచాయతీరాజ్ అధికారులు చెబుతున్నారు. నాలుగు సంవత్సరాలుగా ఈ రోడ్డు సాగుతూనే ఉంది.
- విశాఖ-అరకు రోడ్డు నుంచి గూనపాడు (వయా మేట్లపాలెం శనగపాడు, చిట్టంపాడు) వరకు 10.40 కి.మీ. రోడ్డుకు 2024 అక్టోబరు 3న ప్రధాన మంత్రి జనజాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ (పీఎంజనమాన్) పథకం కింద రూ.1130.00 లక్షలు ప్రభుత్వం కేటాయించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ పరిపాలన అనుమతులు కూడా ఇచ్చింది. ఆరునెలలు గడుస్తున్నా ఈరోడ్డు నిర్మాణం ప్రారంభం కాలేదు. టెండర్ పూర్తయిందని అధికారులు చెబుతున్నారు.
- పుణ్యగిరి కొండ మెట్ల మార్గం వరకు ఉన్న జడ్పీ రోడ్డు నుంచి రేగపుణ్యగిరి వరకు 3.05 కి.మీ. రోడ్డు నిర్మాణానికి కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద రూ.400.00 లక్షలు కేటాయించారు. 2025 జనవరి 24న పనులు ప్రారంభించారు. 1.99 కి.మీ. మేర రోడ్డు స్థలం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని అటవీశాఖ ఆధీనంలో ఉంది. అక్కడి అధికారుల నుంచి అనుమతులు లేకపోవడంతో రోడ్డుపనులు ఆగిపోయాయి.
- రేగ పుణ్యగిరి గిరిశిఖర గ్రామానికి చెందిన ఫాంగి సీతమ్మకు ఈనెల 1న పురిటి నొప్పులు వచ్చాయి. ఈ గ్రామానికి రోడ్డు సదుపాయం లేదు. దీంతో భర్త నర్సింగరావు తోటి గిరిజనులతో కలిసి డోలీ కట్టి నాలుగు కిలోమీటర్ల దిగువన ఉన్న ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకుని వెళ్తుండగా మార్గమధ్యంలోనే సీతమ్మ కాన్పు అయి అడబిడ్డకు జన్మనించింది. పచ్చి బాలింతను, శిశువును పుణ్యగిరి కొండ కింద భాగాన ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్దకు తీసుకుని వచ్చారు. అక్కడి నుంచి 108 వాహనంలో ఆసుపత్రిలో చేర్చారు.
- ఏప్రిల్ నెల 7న చిట్టంపాడుకు చెందిన సోముల బోడమ్మకు పురిటి నొప్పులు రావడంతో గిరిజనులు డోలీ కట్టారు. పది కిలోమీటర్ల దూరం మోసుకుని వచ్చారు. మైదాన ప్రాంతానికి వచ్చిన తరువాత 108 వాహనంలో ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. డోలీలో ఉన్నంతసేపు బోడమ్మ పడిన వేదనను చూసి బంధువులంతా తల్లడిల్లి పోయారు.
- ఏప్రిల్ 30న వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. దారపర్తి పంచాయతీ శివారు పోర్లు గ్రామానికి చెందిన కిరణ్ అనే బాలుడు చనిపోయారు. ఈ కొండ శిఖర గ్రామానికి రోడ్డు లేదు. ఎస్.కోట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం బాలుడి శవాన్ని గిరిజనులు కాలినడకన మోసుకెళ్లారు.
శృంగవరపుకోట మండలంలోని గిరిశిఖర గ్రామాల రోడ్లకు నిఽఽధులు విడుదలైనా.. నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులే. అటవీశాఖ అనుమతులు ఇవ్వడం లేదంటూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖాధికారులు చెబుతున్నారు. దీంతో అత్యవసరమైతే గిరిశిఖర గ్రామాల ప్రజలకు డోలీ కష్టాలు తప్పడం లేదు. పురిటి నొప్పులతో ఆసుపత్రికి వెళ్లే వెళ్లే గర్భిణి.. బిడ్డతో కలిసి ఇంటికి వచ్చేవరకు అనుమానమే. అనారోగ్యంతో మంచానపడ్డ గిరిజనుడిని ఆసుపత్రికి తీసుకెళ్లే వరకూ ఆందోళనే. చివరకు చనిపోయిన వారిని ఊరికి తీసుకెళ్లాలన్నా ప్రయాస తప్పడం లేదు. రోడ్లకు నిధులు రాబట్టడంతోనే సరి అన్నట్లుగా ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. ఆతర్వాత పర్యవేక్షణ కొరవడడంతో అధికారులూ నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దారపర్తి గిరిజన పంచాయతీ పరిధిలో 11 ఆవాసాలు ఉన్నాయి. మూలబొడ్డవర పంచాయతీ పరిధిలో 8 ఆవాసాలు ఉన్నాయి. శృంగవరపుకోట పంచాయతీ శివారులో రెండు గిరిజన ఆవాసాలు ఉన్నాయి. ఇవన్నీ కొండ శిఖరాన ఉండడంతో రోడ్డు సదుపాయం లేదు. దీంతో ఈ గ్రామాల గిరిజనులు విద్య, వైద్యానికి దూరమవుతున్నారు.
ఈగ్రామల్లో చదువుకున్న కొంతమంది యువకులు రవాణా సదుపాయం కోసం దశాబ్దకాలంగా ఉద్యమిస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ దారపర్తి పంచాయతీ శివారు గ్రామం పల్లపు దుంగాడ వరకు రోడ్డు నిర్మాణానికి అప్పటి, ఇప్పటి ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి నిధులు రాబట్టారు. అటవీప్రాంతం కావడంతో ఆ శాఖ అనుమతులు ఇవ్వలేదు. భూమికి భూమి ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఈ పక్రియ జరుగుతుండగానే ప్రభుత్వం మారిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వ ప్రజాప్రతినిధులపై గిరిజనులు ఒత్తిడి తేవడంతో పనులు ప్రారంభించారు. అటవీశాఖకు ఇవ్వాల్సిన స్థలం అప్పగించక పోవడంతో అడ్డుంకులు ఏర్పడ్డాయి. కొన్నిచోట్ల అటవీశాఖకు రెవెన్యూ అధికారులు భూమిని అప్పగించినా పనులు సాగడం లేదు. ఇప్పటికీ అటవీశాఖ అభ్యంతరాలు ఉన్నాయంటూ అధికారులు తప్పించుకుంటున్నారు. రోడ్డు నిర్మాణానికి పునాది పడలేదు. ఎస్.కోట పంచాయతీ శివారు రేగ పుణ్యగిరి గిరిశిఖర గ్రామానికి రోడ్డు నిర్మించేందుకు నిధులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్‌ను ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కోరారు. దీంతో కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. గిరిజనులకు రోడ్డు అవసరాన్ని గుర్తించారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద నిధులు కేటాయించారు. దగ్గరుండి రోడ్డు పనులు చేపట్టారు. అటవీశాఖ అధికారుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన భూభాగం కావడంతో అక్కడి కలెక్టర్‌కు సమస్యను వివరించారు. అయినా పనులు జరగడం లేదు. ఈ మండల పరిధిలోని గిరిజన గ్రామాలన్నీ అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలానికి ఆనుకుని ఉన్నాయి. దీంతో ఈ గ్రామాల రోడ్ల నిర్మాణానికి ఈ జిల్లాకు చెందిన అటవీశాఖ భూబాగం తప్పనిసరి. ఈ విషయం అధికారులకు తెలుసు. రోడ్డు నిర్మాణం ప్రారంభించినప్పుడే అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారుల ద్వారా అటవీశాఖ అనుమతులు పోందేలా చర్యలు తీసుకుని ఉంటే ఈపాటికి పూర్తయ్యేవి.
ఆరు నెలలు గడుస్తున్నా..
వైసీపీ హయాంలో మూలబొడ్డవర పంచాయతీ శివారు చిట్టంపాడు గ్రామానికి చెందిన బాలుడు విశాఖలో మరణించాడు. శవాన్ని తరలించేందుకు వాహనాన్ని సమకూర్చలేదు. రవాణా సదుపాయం ఉన్నవరకు ఏదోలా తీసుకుని వచ్చిన బంధువులు గ్రామానికి భుజంపై ఎత్తుకుని వెళ్లారు. అప్పట్లో ఈ ఘటన సంచలనమైంది. ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్, స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి కొండ ఎక్కారు. తాము అధికారంలోకి వస్తే రోడ్డును నిర్మిస్తామని మాట ఇచ్చారు. అధికారంలోకి రాగానే రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. అయితే ఆరు నెలలు గడుస్తునా ఆ నిధులు కాగితాల్లోనే ఉన్నాయి.
అటవీశాఖ అభ్యంతరాలు ఉన్నాయి
దబ్బగుంట నుంచి పల్లపు దుంగాడ, పుణ్యగిరి జడ్పీ రోడ్డు నుంచి రేగ పుణ్యగిరి రోడ్ల నిర్మాణానికి అటవీశాఖ అభ్యంతరాలు ఉన్నాయి. జిల్లా స్థాయిలో అధికారులు చర్చలు జరుపుతున్నారు. లిఖిత పూర్వకంగా ఆదేశాలు రావాల్సి ఉంది. చిట్టంపాడు రోడ్డు నిర్మాణం టెండర్ పక్రియ పూర్తయింది.
- ఐశ్వర్య, సహాయ కార్యనిర్వాహక ఇంజనీరు, పంచాయతీరాజ్‌శాఖ, కొత్తవలస