There are cases against you.. మీపై కేసులున్నాయ్..
ABN , Publish Date - Nov 06 , 2025 | 12:19 AM
There are cases against you.. ‘మీపై ముంబై, ఢిల్లీలో సీబీఐ కేసులు నమోదయ్యాయి... ఫైన్ కట్టాల్సి ఉంటుంది.. తప్పు లేకుంటే డబ్బులు రిఫండ్ చేస్తాం’ అంటూ బొబ్బిలి పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి సైబర్ నేరగాళ్లు ఉచ్చు పన్నారు. రిజర్వుబ్యాంకు రాజముద్రతో రశీదు కూడా పంపడంతో ఆయన నిజమేనని నమ్మేశాడు. వారు చెప్పిన అకౌంట్‌లకు ఆరు విడతల్లో రూ.22 లక్షలు చెల్లించాడు. చివరిగా ఆ ముష్కరులు ఫోన్ చేసి స్వారీ మిమ్మల్ని మోసం చేశాం అని చెప్పడంతో ఉపాధ్యాయుడు ఖంగుతిన్నాడు.
మీపై కేసులున్నాయ్..
డబ్బులు ఇవ్వండి.. తప్పు లేకుంటే రీఫండ్ చేస్తాం
ఉపాధ్యాయుడ్ని ఉచ్చులోకి దించిన సైబర్ నేరగాళ్లు
రూ.22 లక్షలు వసూలు
చివరకు సారీ చెప్పి.. మోసం చేశామన్న దుండగలు
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
‘మీపై ముంబై, ఢిల్లీలో సీబీఐ కేసులు నమోదయ్యాయి... ఫైన్ కట్టాల్సి ఉంటుంది.. తప్పు లేకుంటే డబ్బులు రిఫండ్ చేస్తాం’ అంటూ బొబ్బిలి పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి సైబర్ నేరగాళ్లు ఉచ్చు పన్నారు. రిజర్వుబ్యాంకు రాజముద్రతో రశీదు కూడా పంపడంతో ఆయన నిజమేనని నమ్మేశాడు. వారు చెప్పిన అకౌంట్‌లకు ఆరు విడతల్లో రూ.22 లక్షలు చెల్లించాడు. చివరిగా ఆ ముష్కరులు ఫోన్ చేసి స్వారీ మిమ్మల్ని మోసం చేశాం అని చెప్పడంతో ఉపాధ్యాయుడు ఖంగుతిన్నాడు. వివరాల్లోకి వెళితే..
బొబ్బిలి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి):
బొబ్బిలికి చెందిన ఉపాధ్యాయుడికి సెప్టెంబరు 16న పాఠశాలలో విధులు ముగిసిన సమయంలో ఫోన్ కాల్ వచ్చింది. ‘మీరు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని, మహిళల అక్రమ రవాణాకు (ఉమెన్ ట్రాఫికింగ్) పాల్పడుతున్నారని అభియోగంతో ముంబై, ఢిల్లీలో సీబీఐ కేసులు నమోదయ్యాయని’ గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. ఆపై వీడియో కాల్ చేసి పోలీసు దుస్తులతో సీబీఐ అధికారులు ఉన్నట్టు చూపించి కోర్టు దృశ్యాలను కూడా చూపి భయపెట్టారు. దీంతో ఆందోళన చెందిన ఆ మాస్టారును ఎలాగైనా దారికి తెచ్చుకోవాలనుకున్న సైబర్ నేరగాళ్లు దాదాపు 21 రోజుల పాటు వివిధ రూపాల్లో నమ్మించారు. ఫైన్ కింద డబ్బులు చెల్లించాలని, తప్పు లేకపోతే మళ్లీ డబ్బులు రిఫండ్ వస్తుందని చెప్పడంతో పాటు రిజర్వుబ్యాంకు రాజముద్రతో రశీదు పంపడంతో ఆయన మరింత బలంగా నమ్మేశాడు. ఆపై దశల వారీగా రూ.22లక్షలను చెల్లించాడు. తాము చెబుతున్న విషయాలను ఎవరికీ చెప్పకూడదని, ఇది జాతీయ భద్రత-రహస్య చట్టాలకు సంబంధించిన అంశం అని ముష్కరులు చెప్పడంతో నిజమేననుకుని ఆయన తన బాధను ఎవరికీ చెప్పుకోలేదు. బంగారాన్ని బ్యాంకులో కుదువపెట్టి కొంతమొత్తాన్ని, స్నేహితుల దగ్గర నుంచి మరికొంత మొత్తాన్ని అప్పుగా తీసుకొని రూ.22 లక్షలను ఆరు విడతలుగా నేరగాళ్లకు ముట్టజెప్పాడు. ఇన్ని రోజులకు మోసం గ్రహించిన ఆయన బుధవారం స్థానిక విలేకరులకు జరిగిన విషయాన్ని తెలిపాడు.
‘మిమ్మల్ని మోసం చేశాం క్షమించాలి’
సుమారు 21 రోజుల పాటు బాధిత టీచరుతో ఆటలాడుకొని వారికి కావాల్సిన మొత్తాన్ని దోచుకున్న తరువాత ఆఖరి రోజున నేరగాళ్లు బాధితునితో అన్నమాటలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ‘మాస్టారు.. మీరు చాలా అమాయకులు. మేము తప్పు చేశాం. మీ నుంచి డబ్బును దోచుకున్నాం. మేము ఇంతవరకు మీతో చేసేదంతా ఓ పెద్ద నాటకం. మేము చేసిన తప్పుకు భగవంతుడు మాకు కచ్చితంగా శిక్ష వేస్తాడు. మేమంతా చాలా చిన్న వయస్కులం. మీకు ఫోన్‌లో కనిపించినట్లుగా పెద్ద వయస్సువారం కాదు. మమ్మల్ని క్షమించాలి’ అని కోరారు. అంతటితో ఆగకుండా బాధిత మాస్టారు భార్యకు ఫోన్ ఇమ్మని చెబుతూ ఆమెకు కూడా ఇదే మాట చెప్పారు. ‘మీ భర్త మంచి వారు. మేము మోసం చేశాము. ఆయనను ఏమీ అనవద్దు’ అని చెప్పడంతో ఆమె హతాశురాలైంది. జరిగిన మోసాన్ని తలచుకుంటూ లబోదిబోమన్నది. మోసానికి గురైన తన భర్త ఏదైనా అఘాయిత్యానికి పాల్పడతాడేమోనని ఆయనను వారించడం మొదలు పెట్టింది. కుమారుడు, కోడలు, కుమార్తె, అల్లుడు సైతం గట్టి భరోసా ఇస్తూ ఆయనకు ధైర్యాన్ని నూరిపోశారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. నేరగాళ్ల అకౌంట్ల నుంచి కొద్ది మొత్తాన్ని ఫ్రీజింగ్ చేసినట్లు బాధిత ఉపాధ్యాయుడు వివరించారు.
-----------------