Then 40 feet, now only 4 feet అప్పుడు 40 అడుగులు ఇప్పుడు 4 అడుగులే
ABN , Publish Date - Sep 06 , 2025 | 11:58 PM
Then 40 feet, now only 4 feet విజయనగరం మున్సిపాలిటీ నగరపాలక సంస్థగా మారిన తరువాత నుంచి నగరం చుట్టుపక్కలతో పాటు విజయనగరం మండల పరిధిలోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో భూ బకాసురులు తయారయ్యారు. పెద్దఎత్తున ప్రభుత్వ భూములను, గెడ్డపోరంబోకు స్థలాలు, కాలువలను ఆక్రమించి రూ.కోట్లు కూడబెట్టుకుంటు న్నారు. విజయనగరం మండలం పడాలపేట పెట్రోల్ బంకు నుంచి కుమిలి గ్రామానికి వెళ్లే మార్గంలో గెడ్డ కాలువ ఆక్రమణ ఇందుకో ఉదాహరణ.
అప్పుడు 40 అడుగులు
ఇప్పుడు 4 అడుగులే
పడాలపేటలో గెడ్డకాలువ ఆక్రమణ
పిల్ల కాలువగా మారిన పంట కాలువ
విజయనగరం, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): విజయనగరం మున్సిపాలిటీ నగరపాలక సంస్థగా మారిన తరువాత నుంచి నగరం చుట్టుపక్కలతో పాటు విజయనగరం మండల పరిధిలోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో భూ బకాసురులు తయారయ్యారు. పెద్దఎత్తున ప్రభుత్వ భూములను, గెడ్డపోరంబోకు స్థలాలు, కాలువలను ఆక్రమించి రూ.కోట్లు కూడబెట్టుకుంటు న్నారు. విజయనగరం మండలం పడాలపేట పెట్రోల్ బంకు నుంచి కుమిలి గ్రామానికి వెళ్లే మార్గంలో గెడ్డ కాలువ ఆక్రమణ ఇందుకో ఉదాహరణ. గెడ్డను ఆక్రమించి ఏకంగా రియల్ ఎస్టేట్ వెంచర్‌కు రోడ్డు వేసేశారు. దీంతో 40 అడుగుల వెడల్పు ఉండే కాలువ 4 అడుగులకు తగ్గిపోయింది. పడాలపేట పంచాయతీ సర్వేనెంబరు 125లోని గెడ్డకాలువను 62 సెంట్ల విస్తీర్ణంలో కప్పేసి వెనుకున్న వెంచర్‌కు రోడ్డు వేస్తున్నారని ఈనెల 1వ తేదీన కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో పడాలపేటకు చెందిన ప్రజలు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ సిబ్బందిని పంపిస్తామని కలెక్టెకర్ కార్యాలయ సిబ్బంది చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్క అధికారి కూడా అక్కడకు రాలేదని స్థానికులు తెలిపారు. ఆనపాము చెరువునుంచి నారాయణపురం గంపబంద చెరువు వరకు ఈ కాలువ ద్వారా నీరు వెళ్తుంది. వందలాది ఎకరాలకు నీరు అందించే ఈ కాలువ చాలా వరకు కుచించుకుపోయిందని గ్రామస్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాలువ ఎక్కువ భాగం కబ్జా అయిపోవడంతో వర్షాకాలంలో చెరువు నిండిపోయాక ప్రవాహానికి స్థలం చాలక గ్రామంలోని కొంతప్రాంతం ముంపునకు గురవుతోందని గ్రామస్థులు తెలిపారు. ఆక్రమణదారులకు నేతల సహకారం ఉన్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
పరిరక్షిస్తాం
పడాలపేటలో పంటకాలువ మీదుగా రోడ్డు నిర్మించారనే విషయం ఇప్పటివరకు మా దృష్టికి రాలేదు. ఆరోపణలు వచ్చిన ఆనపాము చెరువు నుంచి గంపబందకు వెళ్లే కాలువను పరిశీలిస్తాం. ఆక్రమణకు గురైనట్లు నిర్థారణ అయితే కాలువను పరిరక్షించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం.
- కూర్మనాథ్, తహసీల్దార్ విజయనగరం
======