Gopinath Temple లివిరి గోపీనాథ ఆలయంలో చోరీ
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:22 PM
Theft at Liviri Gopinath Temple భామిని మండలంలో పేరొందిన పుణ్యక్షేత్రం.. లివిరి గ్రామంలోని గోపీనాథ రాధారాణి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు.
రూ.15వేల నగదు కూడా..
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
భామిని, డిసెంబరు9(ఆంధ్రజ్యోతి): భామిని మండలంలో పేరొందిన పుణ్యక్షేత్రం.. లివిరి గ్రామంలోని గోపీనాథ రాధారాణి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున అర్చకుడు గోపీ నాఽథ్‌చౌదరి ఆలయానికి వెళ్లారు. అప్పటికే తలుపులు తెరిచి ఉన్నాయి. తాళాలు పగులకొట్టి ఉండడాన్ని గమ నించి వెంటనే ఆలయ సేవ కమిటీ సభ్యులు, మిగతా అర్చకులు సమాచారం అందించారు. వారితో పాటు గ్రామస్థులందరూ అక్కడకు చేరుకొని బత్తిలి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ జి.అప్పారావు, తన సిబ్బంది హుటాహుటిన ఆలయానికి చేరుకున్నారు. అర్చకుడితో మాట్లాడి వివరాలు సేకరించారు. ఆలయంలో పరిస్థితి, సీసీ కెమెరాలు వంటి అంశాలపై ఆరా తీశారు. కాగా సీసీ కెమెరాలకు సంబంధించిన వీవీఆర్‌ను ఎత్తుకుపోవడంతో పాటు వైర్లు కత్తిరించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం పాలకొండ డీఎస్పీ రాంబాబు, క్లూస్‌టీం సైతం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మూలవిరాట్‌కు చెందిన అర తులం బంగారు ఆభరణాలు, 56 తులాల వెండి ఆభరణాలు, రూ.15వేల నగదును దొంగలు అపహరించినట్లు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు పోలీసులకు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ వెల్లడించారు. ఇదిలా ఉండగా చోరీ ఘటనతో భక్తులు మనస్తాపానికి గురయ్యారు. వేకువజామున పూజలకు చేరుకున్న పొందల కాలనీకి చెందిన సుకుమారి అనే వృద్ధురాలతో మరికొందరు ఈ విషయం తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.