తెల్లారితే పెళ్లి.. అంతలోనే..
ABN , Publish Date - Dec 06 , 2025 | 12:23 AM
వారిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఒక్కటే సామాజిక వర్గం. ఇద్దరూ కలిసి చదువుకున్నారు.
యువకుడి ఆత్మహత్య
-చిన్నప్పటి నుంచి స్నేహితులు.. ప్రేమికులు
-మూఢం తరువాత పెళ్లి చేద్దామన్న పెద్దలు
-కుదరదు.. వెంటనే చేయాలన్న ప్రియురాలు
-సింహాచలం వెళ్లి దండలు మార్చుకోవాలని నిర్ణయం
-ఇంతలో ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు
విజయనగరం క్రైం, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): వారిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఒక్కటే సామాజిక వర్గం. ఇద్దరూ కలిసి చదువుకున్నారు. వారి స్నేహం ప్రేమగా మారింది. దీన్ని పెళ్లిపీటల వరకూ తీసుకువెళ్లాలనుకున్నారు. విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు చెప్పడంతో వారు కూడా అంగీకరించారు. ప్రస్తుతం మూఢమని, అది పూర్తయిన వెంటనే వచ్చే ఏడాది ఫిబ్రవరి 22 తరువాత పెళ్లి చేస్తామని పెద్దలు చెప్పారు. అంత విరామం వద్దని, వెంటనే పెళ్లి చేయాలని ప్రియురాలు పట్టుబట్టింది. దీనిపై వారం రోజులుగా ఇరు కుటుంబాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఇదే విషయమై ప్రియుడు, ప్రియురాలి మధ్య వివాదం కూడా నడిచింది. ఎంత చెప్పినా ప్రియురాలు వినకపోవడంతో ఇక చేసేదీ లేక శుక్రవారం ఉదయం సింహాచలం దేవస్థానానికి వెళ్లి అక్కడ దండలు మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో ఏమైందో.. ఏమో గానీ ప్రియుడు గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ఇంటివద్దే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన విజయనగరంలోని దాసన్నపేట యాదవవీధిలో చోటుచేసుకుంది. కోరాడ శ్రీను, దేశాలు దంపతులకు కుమారుడు వీరేంద్ర (25), ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరేంద్ర బీకాం పూర్తిచేసి ఓ కార్పొరేట్ సంస్థలో క్యాషియర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి శ్రీను అనారోగ్యం కారణంగా ఇంటివద్దే ఉంటున్నాడు. తల్లి దేశాలు కూలి పనులకు వెళ్తుంటుంది. వీరేంద్ర.. విజయనగరంలోని ఓ వీధికి చెందిన చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమయ్యాడు. మూఢం కారణంగా పెళ్లి ఆలస్యం కావడంతో ప్రియుడు, ప్రియురాలి మధ్య వివాదం చెలరేగింది. దీంతో వీరేంద్ర మనస్తాపానికి గురై, గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ఇంటిపై ఉన్న తన గదిలో ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున తండ్రి వెళ్లి చూసేపరికి కుమారుడు విగతజీవిగా పడి ఉండడంతో కన్నీరుమున్నీరయ్యాడు. వెంటనే తల్లి, చెల్లెళ్లు, చుట్టుపక్కల వారు చేరుకున్నారు. టూటౌన్ పోలీసులకు సమాచారం అందడంతో ఎస్‌ఐ కృష్ణమూర్తి, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.