Share News

నిరీక్షణ ఫలించింది!

ABN , Publish Date - Dec 17 , 2025 | 12:12 AM

మూడేళ్ల నిరీక్షణ ఫలించింది. కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులు నియామకపత్రాలు అందుకున్నారు.

నిరీక్షణ ఫలించింది!
యువ కానిస్టేబుళ్లు

-అమరావతిలో నియామకపత్రాలు అందుకున్న కానిస్టేబుళ్లు

-అభ్యర్థులతో పాటు కుటుంబ సభ్యుల్లో ఆనందం

-ఈ నెల 22 నుంచి శిక్షణ

-ప్రత్యేక ఏర్పాట్లు చేసిన జిల్లా పోలీస్‌ శాఖ

పార్వతీపురం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి)

మూడేళ్ల నిరీక్షణ ఫలించింది. కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులు నియామకపత్రాలు అందుకున్నారు. అమరావతిలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో జిల్లా నుంచి కానిస్టేబుళ్లుగా ఎంపికైన 180 మంది నియామకపత్రాలను అందుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు 1న పోలీస్‌ శాఖ కానిస్టేబుళ్ల ఎంపిక పరీక్ష ఫలితాలను ప్రకటించింది. ఎట్టకేలకు నియామకపత్రాలు అందించింది. ఈ నెల 22 నుంచి వీరికి శిక్షణ ప్రారంభంకానుంది. రెండు దశల్లో తొమ్మిది నెలల పాటు శిక్షణ ఉంటుంది. మొదటి దశ శిక్షణ తరువాత వారం రోజుల పాటు సెలవులు ఇస్తారు. మళ్లీ రెండో దశ శిక్షణ ప్రారంభిస్తారు. ఈ శిక్షణ తరువాత వారందరికీ పోస్టింగులు ఇస్తారు.

ఫకానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ జాప్యం పాపం వైసీపీదే. ఏటా జాబ్‌ కాలెండర్‌ అంటూ 2019 ఎన్నికల్లో ఆర్భాటం చేశారు. కానీ జాబ్‌ కాలెండర్‌ ఒకసారి కూడా విడుదల చేయలేకపోయారు. 2022 నవంబరులో రాష్ట్ర వ్యాప్తంగా 6100 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి పోలీస్‌ శాఖ నోటిఫికేషన్‌ ఇచ్చింది. అందులో జిల్లాకు 180 పోస్టులు కేటాయించారు. అయితే ప్రాథమిక రాత పరీక్షను నిర్వహించిన వైసీపీ ప్రభుత్వం తరువాత చేతులెత్తేసింది. అభ్యర్థులు విన్నపాలు చేసినా కుంటిసాకులు చెబుతూ తప్పించుకుంది. ఈ తరుణంలో కూటమి అధికారంలోకి రావడంతో కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించిన న్యాయ చిక్కుముడులను పరిష్కరించి ఈవెంట్స్‌తో పాటు తుది రాత పరీక్ష నిర్వహించింది. ఫలితాలు ప్రకటించి తాజాగా నియామకపత్రాలను అందించింది. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నుంచి నియామకపత్రాలు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, నీతి, నిజాయితీగా విధులు నిర్వహిస్తామని తెలిపారు.

సేవ చేయడమే ధ్యేయం

కానిస్టేబుల్‌ ఉద్యోగం కోసం ఎంతో కష్టపడ్డాను. కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. ఉద్యోగం రావడం ఎంతో ఆనందంగా ఉంది. నీతి, నిజాయితీగా విధులు నిర్వహిస్తా. సామాన్యులకు సేవ చేయడమే ధ్యేయంగా పని చేస్తా.

-మానాపురం శ్రీనివాసరావు, పార్వతీపురం

ఆనందంగా ఉంది

నిరుద్యోగంతో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఆ సమయంలో కానిస్టేబుల్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. దీన్ని ఒక చాలెంజ్‌గా భావించాను. ప్రత్యేక కృషితో సాధించిన ఈ ఉద్యోడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.

- రేవళ్ల శంకరరావు, పెద్దబుడ్డిడి, జియ్యమ్మవలస మండలం

నిజాయితీగా పని చేస్తా..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా కానిస్టేబుల్‌ నియామకపత్రం అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. మారుమూల గిరిజన గ్రామానికి చెందిన నాకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగం వచ్చింది. నిజాయితీగా పని చేసి పోలీసు శాఖకు పేరు తీసుకువస్తా.

-రామకృష్ణ, ఎరగడవలస, సాలూరు మండలం

ఎంత శ్రమైనా పడతా..

కానిస్టేబుల్‌గా ఎంపికైనప్పుడు పొందిన ఆనందంకంటే ఇప్పుడు నియామకపత్రం అందుకున్నప్పుడే చాలా సంతోషం కలిగింది. నీతి, నిజాయితీతో పనిచేస్తా. ప్రజల కోసం విధులు నిర్వహించేందుకు ఎంత శ్రమ అయినా చాలా సంతోషంగా పడతాను.

-మణికంఠ, బంగారమ్మకాలనీ, సాలూరు పట్టణం

Updated Date - Dec 17 , 2025 | 12:12 AM