Sand Mafia ఆగని ఇసుక దందా
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:13 AM
The Unstoppable Sand Mafia జిల్లాలో ఇసుక దందా ఆగడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మాదిరిగానే ఇప్పుడు కూడా అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేపట్టి తరలించుకుపోతున్నారు. ముఖ్యంగా కొమరాడ, పాలకొండ మండలాల్లో భారీగా తవ్వకాలు జరుగుతున్నాయి. దీనివెనుక కొందరు టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
కొమరాడ, పాలకొండ మండలాల్లో భారీగా తవ్వకాలు
చోద్యంచూస్తున్న అధికారులు
పార్వతీపురం, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇసుక దందా ఆగడం లేదు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మాదిరిగానే ఇప్పుడు కూడా అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేపట్టి తరలించుకుపోతున్నారు. ముఖ్యంగా కొమరాడ, పాలకొండ మండలాల్లో భారీగా తవ్వకాలు జరుగుతున్నాయి. దీనివెనుక కొందరు టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తుండడంతో ఇసుకాసురులు మరింతగా రెచ్చిపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇసుకతో పాటు మట్టి అక్రమ రవాణా ఇష్టారాజ్యంగా జరిగేది. జిల్లాలోని నదులు, గెడ్డలు, చెరువులను అక్రమార్కులు గుల్ల చేసేవారు. ముఖ్యంగా కొమరాడ మండలంలోని కోనేరు రామభద్రపురం, పాలకొండ మండలం అంపిలి, అన్నవరం, గొట్టమంగళాపురం తదితర ప్రాంతాల నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేసేవారు. వైసీపీ నాయకులు ప్రకృతిని వదలడం లేదని, పంచభూతాలను దోచుకుంటున్నారని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళనలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇసుక దందాకు అడ్డుకట్ట పడుతుందని అంతా భావించారు. కానీ, టీడీపీకి చెందిన కొందరు ద్వితీయ శ్రేణి నాయకులే తెరవెనుక ఉండి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. కొమరాడ మండలంలోని కోనేరు రామభద్రపురం రీచ్ నుంచి ఇసుక తరలింపు కోసం వైసీపీ నాయకులకు టీడీపీ నేతలు పూర్తిస్థాయిలో సహకారాలు అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణాలో గత పాలకులకు తామేమీ తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. ఈ రీచ్ నుంచి ఈ నెల 18వ తేదీన 20 లారీల ఇసుకను అక్రమంగా తరలించినట్లు ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వచ్చింది. దీంతో తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ సిబ్బంది ఆ రీచ్‌ను పరిశీలించారు. అయితే, అక్కడ ఎలాంటి యంత్రాలు లేవని చెప్పి వారు తిరిగి వెళ్లిపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాలకొండ నియోజకవర్గంలో అంపిలి, అన్నవరం, గొట్టమంగళాపురం తదితర ప్రాంతాల్లో కూడా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు. దీనిపై పాలకొండ తహసీల్దార్ రాధాకృష్ణను వివరణ కోరగా.. ‘ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై ఫిర్యాదులు అందిన వెంటనే ర్యాంప్‌ల వద్దకు వెళ్లి పరిశీలిస్తున్నాం. ఆ ప్రాంతంలో ప్రత్యేకించి స్ర్టెంచ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకునేందుకు మా సిబ్బందిని అందుబాటులో ఉంచుతాం.’ అని తెలిపారు.