Share News

తుఫాన్‌ మిగిల్చిన విషాదం

ABN , Publish Date - Nov 01 , 2025 | 12:27 AM

విజయనగరం 38వ డివిజన్‌ గోకపేటకు చెందిన రెయ్యి సన్యాసమ్మ (74) అనే వృద్ధురాలు ఇంటి గోడ కూలిన ఘటనలో మృతి చెందింది.

తుఫాన్‌ మిగిల్చిన విషాదం
సన్యాసమ్మ (ఫైల్‌)

- గోడ కూలి వృద్ధురాలి మృతి

విజయనగరం క్రైం, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): విజయనగరం 38వ డివిజన్‌ గోకపేటకు చెందిన రెయ్యి సన్యాసమ్మ (74) అనే వృద్ధురాలు ఇంటి గోడ కూలిన ఘటనలో మృతి చెందింది. తుఫాన్‌ ప్రభావంతో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో ఇళ్ల గోడలు బాగా తడిసిపోయాయి. తుఫాన్‌ ప్రభావం తగ్గి ఎండలు కాస్తున్నా ఇంకా గోడల్లో పదును తగ్గలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో గోకపేటకు చెందిన సన్యాసమ్మ బహిర్భూమికి వెళ్లి తిరిగి ఇంటికొస్తుండగా, పక్కనే ఉన్న దుక్క శ్యామలత ఇంటి గోడ కూలి సన్యాసమ్మపై పడిపోయింది. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. విగతజీవిగా పడి ఉన్న సన్యాసమ్మను పారిశుధ్య సిబ్బంది చూసి కుటంబ సభ్యులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ లక్ష్ముంనాయుడు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం కోసం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. సన్యాసమ్మ కుమార్తె వెంకటపద్మజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

సన్యాసమ్మకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భర్త ఇప్పటికే మృతి చెందాడు. పిల్లలందరికీ వివాహాలు జరిపించింది. ప్రస్తుతం ఆమె కుమారుడు కాళీప్రసాద్‌తో కలిసి ఉంటుంది. కుమారుడు కొద్దిగా అమాయకుడు. సన్యాసమ్మకి వస్తున్న పింఛన్‌తోనే కుటుంబాన్ని నడిపిస్తోంది. ఇంటికి ఆఽధారమైన ఆమె చనిపోవడంతో కుమారుడు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు.. సన్యాసమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని తెలిపారు.

Updated Date - Nov 01 , 2025 | 12:27 AM