Share News

The target is those who are in villages ఊరవతల ఉన్నవే టార్గెట్‌

ABN , Publish Date - Dec 29 , 2025 | 12:00 AM

The target is those who are in villages - వేపాడ మండలం బానాదిలో ఈ నెల 13న అర్ధరాత్రి దాటిన తరువాత ఒకే రోజు ఐదు దేవాలయాల్లో దొంగలు పడ్డారు. ఊరి పొలిమేరల్లో ఉన్న శివాలయం, వినాయక మందిరం, ఆంజనేయ స్వామిగుడి, మరిడిమాంబ, పరదేశమ్మ ఆలయాల్లో హుండీలు పగులగొట్టి డబ్బులు ఎత్తుకుపోయారు. ఒకేసారి ఐదు ఆలయాల్లో చోరీ జరగడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.

The target is those who are in villages ఊరవతల ఉన్నవే టార్గెట్‌
చోరికి గురైన బానాది శివాలయం (ఫైల్‌)

ఊరవతల ఉన్నవే టార్గెట్‌

ఆలయాల్లో వరుస దొంగతనాలు

సీసీ కెమెరాలు ఉన్నా తగ్గని వైనం

విజయనగరం, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి):

ఆలయాల్లో చోరీలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. చలికాలం కావడంతో సాయంత్రం 6 గంటలకే రహదారులు నిర్మానుష్యం అవుతున్నాయి. వీధులు సైతం వెలవెలబోతున్నాయి. దీనిని దొంగలు అనుకూలంగా మలుచుకుంటున్నారు. గ్రామ పొలిమేరల్లో ఉండే ఆలయాలను టార్గెట్‌ చేసుకుంటున్నారు. జన సామ్మర్థం లేకపోవడంతో తాళాలు పగులగొట్టి మరీ చోరీలకు పాల్పడుతున్నారు. దేవుని గుళ్లు అని చూడకుండా గుల్ల చేస్తున్నారు. విగ్రహాలపై ఉన్న బంగారం, వెండి ఆభరణాలను దోచుకుపోతున్నారు. హుండీలను పగులగొట్టి నగదుతో పరారవుతున్నారు.

జిల్లాలో పురాతన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. భక్తులు ఎంతో నమ్మకంతో, భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. ఇటువంటి చోట్ల నేడు భద్రత కరువైంది. గ్రామాలకు దూరంగా, నిర్మానుష్య ప్రాంతాల్లో ఉండే ఆలయాలనే దొంగలు టార్గెట్‌ చేసుకుంటున్నారు. అర్ధరాత్రి తరువాత గేట్లు, తలుపులు, హుండీలు పగులకొడుతున్నారు. కొన్నిచోట్ల హుండీలను ఎత్తుకెళ్లి దూరంగా ఉన్న పొలాలు, తోటల్లో పడేస్తున్నారు. దేవదాయ, పోలీస్‌ శాఖలు సంయుక్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటుచేసినా.. వాటిని సైతం ధ్వంసం చేస్తున్నారు.

నాటి ఘటనతో..

వైసీపీ హయాంలో రామతీర్థం దేవస్థానంలో విగ్రహాల ధ్వంసం జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఘటనతో ఆలయాల భద్రత ప్రశ్నార్థకమైంది. ముప్పేట విమర్శలు రావడంతో అప్పట్లో పోలీస్‌ శాఖ అప్రమత్తమైంది. ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలతో పాటు స్థానికుల ఆధీనంలో ఉండే ఆలయాల్లో సైతం ఏర్పాటుచేయాలని పోలీసులు సూచించారు. అయితే అప్పట్లో కొన్నిచోట్ల మాత్రమే ఏర్పాటుచేశారు. మిగతా చోట్ల ఏర్పాటులో జాప్యం జరుగుతూ వచ్చింది. జిల్లాలో దేవాదాయ శాఖ పరిధిలో సుమారుగా 772 దేవాలయాలు ఉన్నట్లు సమాచారం. ఈవోల పర్యవేక్షణ ఉన్న దేవాలయాలు 88. మరో 139 ఆలయాలకు దేవదాయ శాఖ దీపదూప నైవేద్యాలను అందిస్తోంది. అయితే స్థానికుల చేతిలో నడుస్తున్న చాలా దేవాలయాల్లో సీసీ కెమెరాలు అమర్చలేదు. ముఖ్యంగా ఊరికి దూరంగా ఉండే అమ్మవారి ఆలయాలను, కొండపై ఉండే ఆలయాలను దొంగలు టార్గెట్‌ చేస్తుండడం గమనార్హం.

ఇవి చేయడం మంచిది..

- చలికాలం కావడంతో కాస్తా అప్రమత్తంగా ఉండాలి

- గ్రామ కమిటీల వారు ఆలయాలపై దృష్టిపెట్టాలి

- గ్రామ యువత అర్ధరాత్రి సమయంలో వచ్చి ఆలయాల పరిస్థితిని చూస్తుండాలి.

- తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డ్సును నియమించుకోవాలి

- ఆలయాలను మూసివేసినప్పుడు తాళాలు సక్రమంగా వేశారో లేదో చూసుకోవాలి.

- నిఘా కెమెరాలు ఏర్పాటు చేయాలి. రాత్రి లైట్లు వేసుకొని ఉంచాలి.

- పోలీసుల బీట్‌ బుక్‌ను ఏర్పాటుచేయించుకోవాలి.

- ఆలయాల్లో శబ్దాలు వస్తే వెంటనే అప్రమత్తం కావాలి.

- అవసరమైతే పెంపుడు జంతువులు కుక్కలను పెంచుకుంటే చాలా మంచిది.

Updated Date - Dec 29 , 2025 | 12:00 AM