the stricture కర‘కట్టలేక’ కష్టాలు
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:33 AM
the stricture problem వంశధార నదికి వరదొస్తే చాలు.. భామిని మండల పరిధిలోని తీర గ్రామాల ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోవాల్సిన దుస్థితి. ఏటా ముంపు సమస్యతో పంటలను సైతం కోల్పోవల్సి వస్తోంది. రోజుల తరబడి వరద నీటిలోనే ఉండాల్సిన పరిస్థితి. దీర్ఘకాలికంగా వారు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. న

ఏటా ముంపు సమస్య
నదీ తీర ప్రాంతవాసుల తప్పని ఇబ్బందులు
ఒడిశా భూభాగంలో చురుగ్గా రాతికట్టల నిర్మాణం
పట్టించుకోని గత వైసీపీ సర్కారు
కూటమి ప్రభుత్వంపైనే ఆశలు
భామిని, మార్చి 10(ఆంధ్రజ్యోతి): వంశధార నదికి వరదొస్తే చాలు.. భామిని మండల పరిధిలోని తీర గ్రామాల ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోవాల్సిన దుస్థితి. ఏటా ముంపు సమస్యతో పంటలను సైతం కోల్పోవల్సి వస్తోంది. రోజుల తరబడి వరద నీటిలోనే ఉండాల్సిన పరిస్థితి. దీర్ఘకాలికంగా వారు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. నదికి ఇరువైపులా నీటి వినియోగం, ఇసుక తవ్వకాలు, కరకట్టల నిర్మాణం ఒకేలా ఉంటే ఎవరికి నష్టం ఉండేది కాదు. కానీ అందుకు భిన్న పరిస్థితి నెలకొంది. ఒడిశా ప్రభుత్వం వరదలను శాశ్వతంగా ఎదుర్కొనేందుకు నదీతీరం ఆవల వైపు ఆ రాష్ట్ర భూభాగంలో రాతితో కరకట్టలు నిర్మించింది. భామిని మండలం వైపు మాత్రం ఆ పనులు చేపట్టలేదు. దీంతో ఏటా వరదల సమయంలో ఈ ప్రాంతంలో భూములు కోతకు గురవుతున్నాయని, ముంపు సమస్యతో సతమతమవుతున్నామని భామిని మండల పరిధిలోని సుమారు పది నదీతీర ప్రాంత రైతులు గగ్గోలు పెడుతున్నారు.
ఇదీ పరిస్థితి..
- గతంలో నేరడి వద్ద బ్యారేజీ, వరద కాలువ నిర్మాణాలను ఒడిశా సర్కారుఅడ్డుకొని ఢిల్లీ న్యాయస్థానానికి వెళ్లింది. ఇప్పటికీ ఈ సమస్య కొలిక్కి రాకపోగా ఆ ప్రభుత్వం మాత్రం నదీ జలాలను యథేచ్ఛగా వినియోగిస్తోంది.
- 1980లో వంశధారకు భారీ వరదలు వచ్చాయి. అప్పట్లోనే ఒడిశా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. వంశధార నది ఆవల గ్రామాలైన ఒడిశాలోని గజపతి జిల్లా పరిధి సరా, బడిగాం, పురిటిగూడ, గౌరి, కిత్తంగి, బుదర, బొత్తవ, కాశీనగర్, ఈదుడి తదితర గ్రామాల్లో వీలున్న చోట్ల వ్యవసాయ బోర్లు, లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో రెండు సీజన్లలో పంటలు పండిస్తున్నారు. సాగునీటిని వినియోగానికి ఏ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంది.
- సరా, ఒడిగాం నుంచి కాశీనగరం వరకు గతంలో నిర్మించిన మట్టికట్టలు, గట్లు నదిలో కలిసిపోవడంతో రాతి కట్టల నిర్మాణాలను ఒడిశా చేపట్టింది. అయితే దీనివల్ల భామిని మండలానికి తీరని నష్టం వాటిల్లుతోంది. వంశధారకు వరదలు వచ్చే సమయంలో ఈ ప్రాంతంలో సాగు భూములు కోతకు గురై నదిలో కలిసిపోతున్నాయి.
- ఆంధ్రా వైపు కరకట్టల నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. తీరం నుంచి 200 మీటర్లు విడిచిపెట్టి భూసేకరణ కింద పంట భూములను స్వాధీనం చేసుకోవడంపై రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒడిశాలో నదీతీరంలోనే రాతికట్టలు నిర్మిస్తే ఆంధ్రా వైపు రైతు భూముల్లో రాతికట్టలు నిర్మించడమేనని వారు ప్రశ్నిస్తున్నారు.
- గత కొన్నేళ్లుగా వంశధారకు భారీ వరదలు లేవు. దీంతో ఆంధ్రా భూభాగంలో ఉన్న కోసలి, కీసర, సొలికిరి, లివిరి, బిల్లుమడ, పసుకుడి తదితర నదీతర గ్రామ రైతులు ఊపిరిపీల్చుకున్నారు.
- బత్తిలి నుంచి కీసర , కోసలి వరకు 30 కిలోమీటర్ల మేర వంశధార నది ప్రవహిస్తున్నా.. లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు చుక్క నీటిని వినియోగించుకోలేకపోతున్నారు. సొలికిరి అవతల ఒడిశాలోని ఈదుడి వద్ద కొద్దికాలంగా రాతికట్టల నిర్మాణం చేపడుతున్నారు. దీంతో వరదలు వస్తే బాలేరు, సొలికిరి గ్రామాల్లో పంట పొలాలు నీట మునుగుతున్నాయి. అదేవిధంగా తాలాడ, కోసలి, కీసర గ్రామాలకు ముంపునకు గురవుతున్నాయి. దీనిపై కూటమి ప్రభుత్వం స్పందించాలని, కరకట్టలు, ఎత్తిపోతల పథకాలు, ఇసుకరీచ్, నదీజలాల వినియోగం, వరద ముంపుపై తగు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు
ఆంధ్రా వైపు ఉన్న ఒడిశా భూముల్లో ఇసుక తరలింపునకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో కొన్నాళ్లుగా నదీ తీరంలో తవ్వకాలు జరుపుతున్నారు. అయితే భామిని మండలం దిమ్మిడిజోల సమీపంలోని ఇసుక తరలిస్తుండడంతో ఈ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూములపై ఆ ప్రభావం పడుతోంది. ఏటా వరదల సమయంలో అవి ముంపునకు గురువుతున్నాయి. మరోవైపు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భామినికి చెందిన కొంతమంది మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు మద్దతు ఇవ్వడంతో ఒడిశా వాసులు యథేచ్ఛగా తమ దందా కొనసాగించారు. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక తవ్వకాలను అడ్డుకుంది. ఉచిత ఇసుక విధానం అమలు చేయడంతో ఒడిశా అనుమతులతో మండలంలోని తాలాడ, బిల్లుమడ, సింగిడి, నేరడి వద్ద ఇసుక అడ్డగోలు తవ్వకాలకు బ్రేక్ పడింది.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో..
భామిని మండలం బత్తిలి నుంచి కొత్తూరు మండలం ఆకులతంపర వరకు 56 కిలోమీటర్ల మేర నదికి ఇరువైపులా ఆంధ్రా భూభాగంలో కరకట్టల నిర్మాణానికి 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రూ.316 కోట్లతో సాయిలక్ష్మి కంపెనీ పనులు ప్రారంభించింది. అయితే ఏడు శాతం పనులే అయ్యాయి. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని నిలిపేసింది.
వెంటనే నిర్మించాలి..
దిమ్మిడిజోల వంశధార రేవులో ఒడిశా వైపు రాతికట్టలు ఉన్నాయి. మరోవైపు ఆ రాష్ట్ర అనుమతులతో ఆంధ్రా వైపు ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల భారీ వరదల సమయంలో ఈ ప్రాంతంలో సాగు భూములు ఏటా ముంపునకు గురవుతున్నాయి. దీంతో ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒడిశా మాదిరిగా నదీతీరంలో ఆంరఽధా భూభాగంలో వెంటనే కరకట్టలు నిర్మించాలి.
- వలరౌతు ఉమాపతినాయుడు, రైతు సంఘం అధ్యక్షుడు, దిమ్మిడిజోల
==================================================
రక్షణ కల్పించాలి
వంశధార వరదల వల్ల ఏటా కీసర, కోసలి, ఘనసరలో పంటలను నష్టపోవాల్సి వస్తోంది. గత వైసీపీ సర్కారు నిలుపుదల చేసిన కరకట్టల పనులను కూటమి ప్రభుత్వం పూర్తిచేయాలి. మా పంటలకు రక్షణ కల్పించాలి.
- కె.లక్షుంనాయుడు, రైతు, కోసలి
=============================
ప్రతిపాదనలు పంపించాం..
భామిని మండలం వంశధార నది పరిధిలో కరకట్టల నిర్మాణం కోసం మరోసారి ప్రతిపాదనలు పంపించాం. ఒడిశా వైపు కరకట్టల నిర్మాణంతో ఆంధ్రా వైపు భూములు కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం. అనుమతులు ఇచ్చిన వెంటనే పనులు చేపడతాం.
-బాబ్జీ, డీఈ, ఉమ్మడి జిల్లా