చోరీ సొత్తు రూ.5కోట్లు పైనే
ABN , Publish Date - May 31 , 2025 | 12:10 AM
మండలంలోని మంగళపాలెం గ్రామంలోని గురుదేవ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్‌బాబు ఇంట్లో మంగళవారం రాత్రి చోరీ జరిగిన విషయం తెలిసిందే.
-మంగళపాలెంలో ఎస్పీ విచారణ
- బాధిత కుటుంబం నుంచి వివరాల సేకరణ
- కేసు దర్యాప్తుపై పోలీసులకు దిశానిర్దేశం
కొత్తవలస, మే 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మంగళపాలెం గ్రామంలోని గురుదేవ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్‌బాబు ఇంట్లో మంగళవారం రాత్రి చోరీ జరిగిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఎప్పీ వకుల్ జిందాల్ శుక్రవారం సాయంత్రం మంగళపాలెం వెళ్లి విచారణ చేపట్టారు. చోరీ జరిగిన పూజా మందిరాలను చూసిన ఆయన ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. మూడు పూజామందిరాల్లో ఏ వస్తువులు ఉండేవో జగదీష్ కుటుంబ సభ్యులు ఎస్పీకి వివరించారు. రాజరాజేశ్వరి దేవి బంగారు విగ్రహంతో పాటు అమ్మవారికి సంబంధించిన ఆభరణాలు, మరికొన్ని బంగారు విగ్రహాలు చోరీకి గురైనట్టు చెప్పారు. ఈ లెక్క ప్రకారం చోరీకి గురైన బంగారం నాలుగు కేజీలకంటే ఎక్కువే ఉంటుందని, వాటి విలువ సుమారు రూ.4కోట్లు నుంచి రూ.5 కోట్లు వరకు ఉంటుందని పోలీసులు అంచనాకు వచ్చారు. ఓ పూజామందిరంలో వెండి కంచాలు, బిందెలు, పళ్లాలు గుట్టలుగా ఉన్నా దుండగులు ఆ జోలికి వెళ్లలేదు. అలాగే, కొన్ని బంగారు వస్తువులను కూడా వదిలేయడాన్ని ఎస్పీ గుర్తించారు. ఇంట్లోకి దొంగలు ఎలా చొరబడ్డారు.. మళ్లీ ఏమార్గం ద్వారా బయటకు వెళ్లారు అనే విషయాలను పరిశీలించారు. చోరీ చేసిన తరువాత దొంగలు బయటకు వచ్చి జగదీష్ ఇంటి పక్కనే ఉన్న బంధువుల ఇంటి ముందు ఆగినట్లు, అక్కడ ఉన్న పైనాపిల్ చెట్ల నుంచి ఓ పైనాపిల్ కోసుకుని తిని తరువాత వెళ్లినట్టు గుర్తించారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి రెండు గంటల మధ్యలో చోరీ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. జగదీష్ ఇంటి వైపు ఉన్న సీసీ కెమెరా పనిచేయకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాలను అమర్చిన వ్యక్తిని పిలిచి అవి ఎందుకు పనిచేయడం లేదని ప్రశ్నించారు. రెండు మూడురోజులు రెక్కీ నిర్వహించిన తరువాతనే చోరీకి పాల్పడినట్టు ఎస్పీ ఒక అంచనాకు వచ్చారు. అనంతరం కొత్తవలస, శృంగవరపుకోట సీఐలు షణ్ముఖరావు, వేచలపు నారాయణమూర్తి, వేపాడ, లక్కవరపుకోట ఎస్‌ఐలు సుదర్శనరావు, నవీన్ పడాల్‌తోపాటు బాధితుడు రాపర్తి జగదీష్‌బాబుతో ఎస్పీ చర్చించారు. దర్యాప్తును ఎలా చేయాలనే విషయాలపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా చోరీ జరిగిన ప్రాంతానికి 300 మీటర్ల పరిధిలోని డంప్‌కాల్స్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిందితులను త్వరలో పట్టుకుంటామని తెలిపారు.