Share News

Ineligible అనర్హుల ఏరివేతకు రంగం సిద్ధం

ABN , Publish Date - Aug 17 , 2025 | 11:40 PM

The stage is set for the removal of the ineligible ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద దివ్యాంగ పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హుల ఏరివేతకు రంగం సిద్ధమైంది జనవరి నుంచి ఇప్పటివరకు చేపట్టిన తనిఖీల్లో అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులు అందించనున్నారు. ఈ ప్రక్రియను ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు అందాయి.

 Ineligible అనర్హుల ఏరివేతకు  రంగం సిద్ధం

  • వాస్తవిక అర్హతను బట్టి మార్పులు చేపట్టిన ప్రభుత్వం

  • సచివాలయాల్లో జాబితాలు

  • 25 నాటికి నోటీసులు అందజేత

  • రద్దు అయితే అప్పిల్‌ చేసుకునేందుకు అవకాశం

పార్వతీపురం, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద దివ్యాంగ పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హుల ఏరివేతకు రంగం సిద్ధమైంది జనవరి నుంచి ఇప్పటివరకు చేపట్టిన తనిఖీల్లో అనర్హులుగా గుర్తించిన వారికి నోటీసులు అందించనున్నారు. ఈ ప్రక్రియను ఈ నెల 25 నాటికి పూర్తి చేయాలని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు అందాయి. సదరం ధ్రువీకరణ పత్రంలో 40 శాతం కన్నా తక్కువ వైకల్యం ఉన్నట్టు నమోదైన వారికి పింఛన్లు రద్దు చేయనున్నారు. అంత కంటే ఎక్కువ వైకల్యం ఉండి , తీవ్రమైన అనారోగ్యం లేకుండా ఉన్న వారికి పింఛన్‌ కేటగిరీని రూ.15 వేల నుంచి రూ.6 వేలకు మార్చనున్నారు. 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉండి వృద్ధుల కేటగిరీలోకి వచ్చే వారికి రూ.4 వేలు పింఛను అందించనున్నారు. దీనికి అనుగుణంగా కొత్త పథకం ధ్రువీకరణ పత్రాలను గ్రామ, వార్డు సచివాలయాలు ద్వారా ఉచితంగా జారీ చేయనున్నారు. వైకల్య శాతంలో ఏమైనా తేడాలున్నట్లు లబ్ధిదారులు గుర్తిస్తే తిరిగి అప్పీల్‌ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. రద్దు అయిన పింఛన్‌దారులు అర్హులమని అనుకుంటే పాత సదరం సర్టిఫికెట్‌, తాజాగా అందిన నోటీసును తీసుకుని ఆసుపత్రుల్లోని సంబంధిత వైద్యులతో పరీక్షించుకోవచ్చు. నిబంధనల ప్రకారం ఉన్న ప్రొఫార్మాలో మాన్యువల్‌ సర్టిఫికెట్‌ పొందాలి. నోటీసు అందుకున్నవారంతా 30 రోజుల్లోగా అప్పీల్‌ చేసుకోవాలి.

రద్దయిన పింఛన్లు ఇవీ..

పార్వతీపురం నియోజకవర్గంలో 1044 పింఛన్లు రద్దయ్యాయి. వాటిల్లో బలిజిపేట మండలంలో 161, సీతానగరంలో 465, పార్వతీపురం మండలం 322, అర్బన్‌లో 96 ఉన్నాయి. కురుపాం నియోజకవర్గంలో 833 రద్దు కాగా, అందులో గరుగుబిల్లి 312, గుమ్మలక్ష్మీపురం 44, జియ్యమ్మవలస 222, కొమరాడ 157, కురుపాం మండలంలో 98 ఉన్నాయి. సాలూరు నియోజకవర్గంలో 611 రద్దు కాగా మక్కువలో 355, పాచిపెంటలో 101, సాలూరు మండలంలోలో 97, సాలూరు అర్బన్‌లో 58 ఉన్నాయి. పాలకొండ నియోజకవర్గంలో 293 పింఛన్లు రద్దయ్యాయి. ఇందులో భామినిలో 68, పాలకొండ మండలంలో 45, అర్బన్‌లో 62, సీతంపేటలో 2, వీరఘట్టంలో 86 ఉన్నాయి. మొత్తంగా జిల్లాలో 2,781 పింఛన్లు పూర్తిగా రద్దయ్యాయి. ఇదిలా ఉండగా పార్వతీపురం నియోజకవర్గంలో 148, కురుపాంలో 250, సాలూరులో 87, పాలకొండలో 48 పింఛన్లు కన్వర్షన్‌ అయినట్లు గుర్తించారు. ‘జిల్లాలో 2,781 పింఛన్లు రద్దయ్యాయి. మరో 533 పింఛన్లు కన్వర్షన్‌ అయినట్లు గుర్తించాం. వీటి జాబితా గ్రామ వార్డు, సచివాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాం.’ అని డీఆర్‌డీఏ పీడీ సుధారాణి తెలిపారు.

గతంలో ఇలా..

వైసీపీ ప్రభుత్వం అనర్హులకు మెడికల్‌, దివ్యాంగ పింఛన్‌లను అందించిందన్న ఆరోపణలు విస్తృతంగా వచ్చాయి. ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తల కుటుంబాలకు చెందిన వారంతా వీటిని దొడ్డిదారిలో పొందారని ఈ ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో కూటమి ప్రభుత్వం పింఛన్‌లను పునఃపరిశీలన చేయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులతో పరీక్షలు చేయించింది. ఇందుకు ముందుగా నోటీస్‌లు పంపించారు. ప్రత్యేక సదరం క్యాంపులను నిర్వహించారు. ప్రభుత్వం సూచించిన ఆసుపత్రికి వెళ్లి మెడికల్‌, వైకల్యం పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. అనర్హతతో పింఛన్‌ పొందుతున్న చాలా మంది ఈ సదరం క్యాంపులకు హాజరుకాలేదు. ఎంతోకొంత అంగవైకల్యం ఉన్న వారంతా ప్రభుత్వం చెప్పిన సదరం క్యాంపులకు వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. తనిఖీలు చేసిన వైద్యులు నేరుగా రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌)కు మెడికల్‌, దివ్యాంగ శాతం నిర్ధారణ వివరాలను పంపించారు. ఈమేరకు ప్రభుత్వం తొలగింపు నిర్ణయం తీసుకుంది.

పింఛన్లలో మార్పులు

- 85శాతం పైబడి దివ్యాంగత్వం ఉంచి మంచానికి పరిమితమైన వారికి రూ.15,000 పింఛన్‌

- 85శాతం కంటే తక్కువ ఉండి 40శాతం కంటే ఎక్కువ ఉంటే మెడికల్‌ పింఛన్‌ నుంచి రూ.6000 దివ్యాంగ పింఛన్‌కు మార్పు

- 40శాతం కంటే తక్కువగా దివ్యాంగత్వం ఉండి 60 సంవత్సరాల వయసు పైబడి ఉంటే రూ.4,000 వృద్ధాప్య పింఛన్‌కు బదిలీ చేస్తారు. 60 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉంటే పింఛన్‌ తొలగింపే

- 40శాతంకంటే ఎక్కువ దివ్యాంగత్వం ఉంటే రూ.6000 యథావిధిగా మంజూరు

- 40శాతం కంటే దివ్యాంగత్వం తక్కువగా ఉన్న పింఛన్‌దారుల్లో 60 సంవత్సరాలు పైబడితే రూ.4000 వృద్ధాప్య పింఛన్‌కు మార్పు. వయసు తక్కువ అయితే పింఛన్‌ రద్దు.

Updated Date - Aug 17 , 2025 | 11:40 PM