Share News

The Splendor of Diwali దీపావళి శోభ

ABN , Publish Date - Oct 20 , 2025 | 12:10 AM

The Splendor of Diwali జిల్లాలో దీపావళి శోభ ఉట్టిపడింది. యువకులు, పెద్దలు బాణసంచా దుకాణాలకు బారులు తీరారు. సమయం లేకపోవడంతో ఆదివారం భారీ స్థాయిలో మందుగుండును కొనుగోలు చేశారు. మార్కెట్‌లో కొత్తగా దిగిన మతాబులు, బాంబులు, తారాజువ్వలను కొనడం కనిపించింది. ప్రధాన మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి.

 The Splendor of Diwali దీపావళి శోభ
సాలూరులో బాణసంచా షాపు వద్ద ప్రజలు ఇలా..

  • వర్షంతో కొనుగోలుకు ఆటంకాలు

పార్వతీపురం/ పార్వతీపురం టౌన్‌/పాలకొండ/సాలూరు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో దీపావళి శోభ ఉట్టిపడింది. యువకులు, పెద్దలు బాణసంచా దుకాణాలకు బారులు తీరారు. సమయం లేకపోవడంతో ఆదివారం భారీ స్థాయిలో మందుగుండును కొనుగోలు చేశారు. మార్కెట్‌లో కొత్తగా దిగిన మతాబులు, బాంబులు, తారాజువ్వలను కొనడం కనిపించింది. ప్రధాన మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. తాత్కాలిక బాణాసంచా దుకాణాలు కూడా భారీగా ఏర్పాటయ్యాయి. అయితే వర్షం కారణంగా ప్రజలు కాస్త ఇబ్బంది పడ్డారు. కొన్ని చోట్ల తడుస్తూనే పూజా సామ్రగి, బాణ సంచాను కొనుగోలు చేశారు. పార్వతీపురం పట్టణంలో పండుగ సందడి కనిపించలేదు. దీపావళి పర్వదినం ముందు రోజు జిల్లా కేంద్రం పండుగ సందడి కనిపించలేదు. వర్షం కారణంగా పెద్దగా ఎవరూ బయటకు రాలేదు. మరోవైపు పూజా సామగ్రి ధరలు అమాంతం పెరిగిపోయాయి. కొబ్బరికాయలు, అరటిపండ్ల సైజును బట్టి ఽవ్యాపారులు ధర నిర్ణయించడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోయారు. నిన్న మొన్నటి వరకు అన్ని రకాల పండ్లు కిలో వంద రూపాయలు నుంచి రూ.150 పలకగా, ఆదివారం రూ.200 నుంచి రూ.250కు విక్రయించయారు. బంతి, చామంతి, గులాబీ తదితర పూలను కిలో రూ.600 నుంచి రూ.800 వరకు విక్రయించారు. ఇక బాణసంచాపై జీఎస్టీ తగ్గించకపోవడంతో దానిని సాకుగా చూపి వ్యాపారులు అధిక ధరలకు విక్రయించారు. లైసెన్స్‌ నంబర్‌, టిన్‌ నంబర్‌తో ఉన్న రశీదుపై బిల్లులు ఇవ్వలేదు. కానీ తెల్ల కాగితంపై రాసి ఇచ్చి పంపారు. కాగా ఆదివారం మధ్యాహ్నం నుంచి ముసురు వాతావరణం నెలకొనడంతో వినియోగదారులు బాణాసంచా దుకాణాల వద్దకు వెళ్లలేకపోయారు. దీంతో షాపులు వెలవెలబోయాయి. సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొనడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీపావళికి బాణసంచా కాల్చడం ఆనవాయితీ కావడంతో చివరి నిమిషంలోనైనా సరుకులు అమ్ముకోగలమని మరికొంతమంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దీపావళి సందర్భంగా సోమవారం లక్ష్మీదేవిని పూజించుకునేందుకు జిల్లావాసులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Updated Date - Oct 20 , 2025 | 12:10 AM