The Same Exploitation ఇప్పుడూ.. అదే దోపిడీ!
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:34 AM
The Same Exploitation Continues Even Now! జిల్లాలో కొమరాడ మండలం ఇసుకాసురలకు అడ్డాగా మారింది. కోనేరు రామభద్రపురం గ్రామ సమీపంలోని నాగావళి నది వద్ద మళ్లీ ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ రవాణా సాగించిన వారే ఈ దందా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఉన్నట్లు సమాచారం.
ఏమాత్రం వెనక్కి తగ్గని అక్రమార్కులు
తెర వెనుక కొంతమంది అధికార పార్టీ నాయకులున్నట్లు ఆరోపణలు
చోద్యం చూస్తున్న స్థానిక అధికార యంత్రాంగం
పార్వతీపురం, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొమరాడ మండలం ఇసుకాసురలకు అడ్డాగా మారింది. కోనేరు రామభద్రపురం గ్రామ సమీపంలోని నాగావళి నది వద్ద మళ్లీ ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ రవాణా సాగించిన వారే ఈ దందా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఉన్నట్లు సమాచారం. కాగా దీనిపై క్షేత్రస్థాయి అధికార యంత్రాంగం కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోనేరు రామభద్రపురంలోని నాగావళి నది వద్ద చేపడుతున్న ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణాపై ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై అధికారులు స్పందించారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా ఆ ప్రాంతంలో స్ర్టెంచ్‌లు కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇవేవీ తమకు అడ్డుకావన్నట్లుగా ఇసుకాసురులు వ్యవహరిస్తున్నారు. ఆ ప్రాంతం నుంచి మళ్లీ ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
గత వైసీపీ ప్రభుత్వం కాలంలో జరిగిన ఇసుక అక్రమ రవాణాపై అధికార యంత్రాంగం కన్నెత్తి చూడలేదు. ఒక తహసీల్దార్ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే.. అప్పట్లో కొంతమంది వైసీపీ పాలకులు జోక్యం చేసుకుని.. ఆయన్ని వేరే ప్రాంతానికి బదిలీ చేయించారు. కాగా గత వైసీపీ ప్రభుత్వ కాలంలో ఏ విధంగా ఇసుక దోపిడీ జరిగిందో, కూటమి పాలనలోనూ అదేవిధంగా ఇసుక అక్రమ దందా సాగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కోనేరు రామభద్రపురం ప్రాంతంలో నాగావళి నది వద్ద మళ్లీ ఇసుక తవ్వకాలు చేపడుతుండడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. అయితే అధికార పార్టీ సహకారం లేనిదే ఇసుక తరలింపు సాధ్యం కాదు. దీనివెనుక కచ్చితంగా కొంతమంది అధికార పార్టీ నాయకులు ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఇసుక దందా విషయంలో పార్టీలు వేరేనా.. అధికార, ప్రతిపక్షాలకు చెందిన కొంతమంది నాయకులు ఒకే ఆలోచనతో ముందుకు సాగుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
స్థానిక అధికారుల తీరుపై అనుమానాలు...
గతంలో కోనేరు రామభద్రపురం ప్రాంతంలో జరిగిన ఇసుక తవ్వకాలను అడ్డుకున్న అధికారులు.. అక్కడున్న ఇసుక గుట్టలను ఎందుకు అలానే ఉంచేశారో వారికే తెలియాలి. వాస్తవంగా ఇసుక గుట్టలను పూర్తిగా నదిలో కలపాలి. లేదా ప్రభుత్వం అవసరాలకు వినియో గించాలి. కానీ అలా చేయకపోడంపై వారు తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక అక్రమార్కులకు కొంతమంది స్థానిక అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై జిల్లా మైనింగ్ అధికారి శ్రీనివాసరావును వివరణ కోరగా... కొంతమంది ఇసుక అక్రమ రవాణాకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం వచ్చింది. దీనిని అడ్డుకుంటాం. ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణా జరగకుండా చూస్తాం. దాడులు నిర్వహించేందుకు సిద్ధం ఉన్నాం.’ అని తెలిపారు.
ఇసుక రీచ్‌పై మెరుపు దాడి
కొమరాడ మండలం కేఆర్‌బీ పురం ఇసుక రీచ్‌పై శనివారం రాత్రి జిల్లా మైనింగ్ అధికారులు మెరుపు దాడి చేశారు. ఇసుక లోడింగ్ అవుతున్న రెండు లారీలతో పాటు ఎక్స్‌కవేటర్‌ను పట్టుకుని సీజ్ చేశారు. దీనిపై జిల్లా మైనింగ్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ‘ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు మాకు సమాచారం వచ్చిన వెంటనే దాడులు నిర్వహించాం. రెండు లారీలతో పాటు ఎక్స్‌కవేటర్‌ను పట్టుకున్నాం. సీజ్ చేసిన వాహనాలను కొమరాడ పోలీస్ స్టేషన్‌కు తరలించాం.’ అని తెలిపారు.
తెర వెనుక మాజీ ప్రజాప్రతినిధి అనుచరుడు
ఇసుక అక్రమ తరలింపులో విశాఖపట్నంకు చెందిన వైసీపీ మాజీ ప్రజాప్రతినిధి అనుచరుడు కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ అనుచరుడితో కొమరాడ మండలంలోని కొంతమంది టీడీపీ, వైసీపీ నాయకులకు స్నేహం ఉంది. ఇది ఇసుక అక్రమ వ్యాపారానికి దారితీసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన మాదిరిగానే కూటమి ప్రభుత్వంలో కూడా ఇసుక దందా నిర్వహించాలని ఇరు పార్టీలకు చెందిన నాయకులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అక్రమ రవాణాకు తెరతీసినట్లు సమాచారం. టీడీపీకి, కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలని వైసీపీ నాయకుల ఆలోచన. దీనికి కొంత మంది కూటమి నాయకులు కూడా తెరవెనుక సహకారం అందిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.