Share News

తీగ లాగితే డొంక కదులుతోంది

ABN , Publish Date - May 27 , 2025 | 12:12 AM

తీగ లాగితే డొంకంతా కదులుతోంది.

 తీగ లాగితే డొంక కదులుతోంది

-స్థానికుల సహకారం ఉన్నట్టు అనుమానం?

-పెరుగుతున్న నిందితుల జాబితా

చీపురుపల్లి, మే 26 (ఆంధ్రజ్యోతి): తీగ లాగితే డొంకంతా కదులుతోంది. చీపురుపల్లి చోరీ ఘటనకు సంబంధించి పోలీసులు జరుపుతున్న దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నట్టు సమాచారం. చోరీకి పాల్పడిన బృందంలో ఎక్కువ మంది సభ్యులు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే గుంటూరు జిల్లా తెనాలిలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ బృందంలో ఎక్కువ మంది సభ్యులు ఉన్నట్టు భావిస్తున్నారు. తెనాలి వెళ్లిన పోలీసు అధికారుల తమ వెంట ఐదుగురిని తీసుకుని వచ్చినట్టు తెలిసింది. ఇంకా, మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్టు సమాచారం. దొంగతనానికి కొద్ది రోజుల ముందు స్థానికంగా రెక్కీ నిర్వహించి దొంగలకు సమాచారం ఇచ్చిన మహిళ ఎవరన్నది పోలీ సులు ఆరా తీస్తున్నారు. కాగా, పట్టణంలో ధనికుల సమాచారం తెలుసు కోవడం కోసం దోపిడీ దొంగలు స్థానికులపై ఆధార పడినట్టు తెలిసింది. చీపురుపల్లి మండలంలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి, సమాచారం ఇవ్వడంలో దొంగలకు పరోక్షంగా సహకరించినట్టు పోలీసులకు సమాచారం అందింది. ఆ దిశగా కూడా పోలీసులు తమ దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, దొంగల దాడిలో గాయాలపాలైన ఇద్దరు మహిళలు విశాఖ పట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు.

Updated Date - May 27 , 2025 | 12:12 AM