రోడ్లు ఛిద్రం.. ప్రయాణం నరకం
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:10 AM
డివిజన్ కేంద్రం పాలకొండలోని ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారులు తరచూ ఛిద్రమవుతున్నాయి.
- రహదారులపై నిలిచిపోతున్న సాగునీరు
- దానివల్ల తరచూ గోతులు ఏర్పడుతున్న వైనం
పాలకొండ, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): డివిజన్ కేంద్రం పాలకొండలోని ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారులు తరచూ ఛిద్రమవుతున్నాయి. మండలంలోని శివారు భూములకు సాగునీరు అందించేందుకు నీటిపారుదల శాఖాధికారులు తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేస్తుంటారు. అయితే, పాలకొండ వద్ద కాలువ ఆక్రమణ కారణంగా కొన్నిసార్లు నీటి ప్రవాహం ఎక్కువై ఆ నీరు పక్కనే ఉన్న పాలకొండ-సీతంపేట ప్రధాన రహదారిపైకి చేరుతుంటుంది. రోజుల తరబడి నీరు నిల్వ ఉండడం, వాటిపై వాహనాలు రాకపోకలు సాగిస్తుండడం కారణంగా రహదారిపై రాళ్లు తేలి గోతులు ఏర్పడుతున్నాయి. మూడు నెలల కిందటే పాలకొండ-సీతంపేట రహదారిపై ఉన్న గోతులను అధికారులు పూడ్చారు. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాలువలో నీటి ప్రవాహం ఎక్కువై ఆ వరద ప్రధాన రహదారిపైకి చేరడంతో మళ్లీ గోతులు ఏర్పడ్డాయి. స్థానిక ఏలాం జంక్షన్ వద్ద ఉన్న అండర్ టన్నెల్‌కు రంధ్రం పడింది. ఈ రంధ్రం గుండా 15 రోజులుగా వరదనీరు ప్రవహిస్తుండడంతో పాలకొండ-సీతంపేట, పాలకొండ-శ్రీకాకుళం రోడ్లు గుంతలమయంగా మారాయి. ఏలాం జంక్షన్ నుంచి కోర్టు ప్రాంగణం వరకు వరద చేరి బురదమయంగా మారింది. దీంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై ఇప్పటివరకు నీటిపారుదలశాఖ అధికారులు స్పందించిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు.