The road is bad condition రోడ్డు ‘తారు’మారు
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:05 AM
The road is bad condition - గిరిజనుల రాకపోకల కోసం నిర్మిస్తున్న రోడ్డు ఇది. ప్రతి మలుపు వద్ద కుంగిపోయింది. అడుగడుగునా బీటలు వారాయి. ఏమాత్రం వర్షంపడినా తారు కొట్టుకుపోతోంది. ఎక్కడికక్కడ గుంతలకు కొదవలేదు. వేపాడ మండలం మారిక గిరిజన గ్రామం రోడ్డు దుస్థితిది.
రోడ్డు ‘తారు’మారు
ఎక్కడికక్కడ కొట్టుకుపోతున్న తారు
ప్రతి మలుపు వద్ద కుంగుతున్న వైనం
అడుగడుగునా బీటలు
వేపాడ మండలం మారిక గిరిజన గ్రామ రోడ్డు దుస్థితిదీ
- గిరిజనుల రాకపోకల కోసం నిర్మిస్తున్న రోడ్డు ఇది. ప్రతి మలుపు వద్ద కుంగిపోయింది. అడుగడుగునా బీటలు వారాయి. ఏమాత్రం వర్షంపడినా తారు కొట్టుకుపోతోంది. ఎక్కడికక్కడ గుంతలకు కొదవలేదు. వేపాడ మండలం మారిక గిరిజన గ్రామం రోడ్డు దుస్థితిది.
శృంగవరపుకోట, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి):
వేపాడ మండలం కరకవలస పంచాయతీ శివారు మారిక గిరిజన గ్రామం కొండ శిఖరాన ఉంది. రహదారి సదుపాయం లేక బాహ్యప్రపంచంతో సంబంధాలు ఉండేవి కావు. విద్య, వైద్యం అందని ద్రాక్షగా మారాయి. ప్రభుత్వ పాఠశాల ఉన్నప్పటికీ అక్కడకెళ్లి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కరువయ్యారు. అత్యవసర వైద్యానికి 10.60 కిలోమీటర్ల దూరంలో వున్న మైదాన ప్రాంతానికి కాలినడకన కొండ దిగాల్సిందే. తమకు రహదారి సదుపాయం కావాలని గిరిజనులు కొన్నేళ్లగా అడుగుతుండడంతో 2012-2013 ఆర్థిక సంవత్సరంలో నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం నుంచి రూ.3.53 కోట్లు విడుదల చేసింది. 3.63 కిలోమీటర్ల దూరం తారు రోడ్డు, 0.37 కిలోమీటర్ల దూరం సిమెంటు రోడ్డు, మధ్యలో ఏడు కల్వర్టులు నిర్మించాల్సి ఉంది. అప్పట్లో కరకవలస పంచాయతీ నుంచి కొండ దిగవ ప్రాంతం వరకు రోడ్డు వేసి వదిలేసారు. మిగిలిన రోడ్డుకు అటవీ శాఖ అనుమతులు లేవని మధ్యలో ఆపేసారు. తిరిగి 2021 డిసెంబర్ 30న పనులు చేపట్టారు. 2022 డిసెంబర్ 30 నాటికి పనులు పూర్తిచేసేయాలి కానీ నిధులు చాలవని కాంట్రాక్టరు ఆపేసారు. దీనిపై సీపీఎం నాయకుడు చల్లా జగన్ ఆద్వర్యంలో గిరిజనులు వేపాడ మండల పరిషత్ కార్యాలయాన్ని ఆ మధ్య ముట్టడించారు. వంటా వార్పు చేసుకోని అక్కడే నిద్రించారు. దీంతో పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారుల్లో కదలిక వచ్చింది. నిధులు ఎంతవరకు వస్తే అంతవరకైనా పనులు చేపట్టాలని సూచించడంతో తిరిగి కొనసాగించారు. అప్పటికీ రోడ్డు నిర్మాణం పనులు పూర్తికానట్లు క్షేత్ర స్థాయి పరిస్థితులను బట్టి తెలుస్తోంది.
ఫ ఈ నాలుగు కిలోమీటర్లతో పాటు మిగిలిన రోడ్డును మూడు బిట్లుగా నిర్మించేందుకు ఉపాధి హామీ నిధుల నుంచి రూ.7కోట్లు కేటాయించారు. ఈ ఏడాది జనవరి 24న పనులకు భూమి పూజ చేశారు. ప్రస్తుతం 5.02 కిలోమీటర్ల రోడ్డు పనులు జరుగుతున్నాయి. రోడ్డు పనులకు సంబంధించిన సామగ్రిని తరలించే వాహనాలు పరిమితికి మించి ఉన్నాయి. దీంతో రోడ్డుంతా కుంగిపోతోంది. ఇదిలా వుంటే ఈ రోడ్డుకు ఇరువైపులా పెద్ద కొండలు ఉన్నాయి. పైన పడిన వర్షపు నీరు వరదలా రోడ్డుపైకి వస్తోంది. కల్వర్టుల నుంచి వరద నీరు పోయేందుకు ఎక్కడికక్కడ కాలువలు నిర్మించాలి. ఇవి చేపట్టకుండా మట్టిని తవ్వేసి కాలువలుగా తయారు చేసి వదిలేసారు. పైనుంచి వరద నీటితో కలిసి వచ్చిన మట్టితో ఇవి పూడికపోతున్నాయి. దీంతో కాలువల్లోనుంచి రోడ్డుపైకి వరద నీరు పారుతుండడంతో తారంతా కొట్టుకుపోతోంది. ఈ విధంగా రోడ్డంతా చిధ్రం అవుతోంది.
కాంట్రాక్టు కాల పరిమితి దాటాక పరిస్థితి ఏంటో?
రోడ్డు నిర్మాణ సమయంలో పూరైన రోడ్డు నిర్వహణకు ఐదేళ్ల పాటు కాంట్రాక్టర్ బాధ్యత వహించాలి. 2027 డిసెంబరు 29 వరకు కాలపరిమితి ఉండడంతో పాడైన రోడ్డును బాగు చేస్తున్నప్పటికీ వర్షాలు పడుతున్నప్పుడు తిరిగి పాడవుతోంది. కాలపరిమితి ఉన్నంతవరకు కాంట్రాక్టురు పనులు చేస్తారు. ఆ తరువాత పరిస్థితేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.