ఆర్వో ప్లాంట్లు పనిచేయట్లే!
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:25 AM
గిరిజన విద్యార్థులకు అత్యుత్తమ విద్యతో పాటు అన్ని సదుపాయాలు కల్పించేందుకు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ద్వారా ప్రభుత్వం ఏటా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.
- మూలకు చేరిన పరికరాలు
- కానరాని మరమ్మతులు
- గిరిజన విద్యార్థులకు అందని శుద్ధ జలం
- జిల్లాలో 41 ఆశ్రమ పాఠశాలలు, కళాశాలల్లో ఇదే పరిస్థితి
జియ్యమ్మవలస, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): గిరిజన విద్యార్థులకు అత్యుత్తమ విద్యతో పాటు అన్ని సదుపాయాలు కల్పించేందుకు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ద్వారా ప్రభుత్వం ఏటా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ చాలా చోట్ల విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీరు కూడా అందని పరిస్థితి నెలకొంది. జిల్లాలోని పలు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు పని చేయడం లేదు. ఈ పరికరాలు మూలకు చేరి సంవత్సరాలు గడుస్తున్నా బాగుచేసే నాథుడు కరువయ్యాడు. దీంతో విద్యార్థులకు శుద్ధ జలం అందడం లేదు. వారు బోరు నీటిని తాగాల్సి వస్తోంది.
జిల్లాలో పరిస్థితి..
పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలోని 77 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో కొన్నాళ్ల కిందట లక్షలాది రూపాయల వ్యయంతో ఆర్వో ప్లాంట్లను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే కొన్నేళ్లకే అవికి మూలకు చేరాయి. జియ్యమ్మవలస మండలంలోని టీకేజమ్ము, పెద్దతోలు మండ, రావాడరామభద్రపురం, వనజ, జియ్యమ్మవలస తదితర ఆశ్రమ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు పని చేయడం లేదు. జిల్లా వ్యాప్తంగా 41 ఆశ్రమ పాఠశాలలు, కళాశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వం ఈ ఆర్వో ప్లాంట్లను కనీసం పట్టించుకోలేదు. వసతి గృహ సంక్షేమాధికారులు పలుమార్లు వారి సొంత డబ్బులతో మరమ్మతులు చేయించినా ఫలితం అంతగా కనిపించలేదు. దీంతో ఆయా పాఠశాలలు, కళాశాలల్లో ఉన్న బోర్ల నీటినే విద్యార్థులు తాగుతున్నారు. ఆ నీటినే వంటలు చేసేందుకు వినియోగిస్తున్నారు. ఆ నీరు అంత సురక్షితం కానందువల్ల విద్యార్థులు సీజనల్ వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలకు గురై ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ ఐటీడీఏ అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి ఆర్వో ప్లాంట్లను బాగు చేయాలని కోరుతున్నారు.
రూ. 2 కోట్లతో ప్రతిపాదనలు
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, కళాశాలల్లో ఆర్వో ప్లాంట్ల పరిస్థితిపై ఇప్పటికే ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు సమీక్షలు నిర్వహించి పరిస్థితిని తెలుసుకున్నారు. మరమ్మతులు కాకుండా నూతన ఆర్వో ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి రూ. 2 కోట్లతో జిల్లా ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపించారు.
-కె.చంద్రబాబు, ఏటీడబ్ల్యూవో, కురుపాం