Share News

The river.. is a treasure for them నది.. వారికి నిధి

ABN , Publish Date - Aug 12 , 2025 | 12:21 AM

The river.. is a treasure for themప్రభుత్వం ఇసుక రవాణాకు సంబంధించి ఎన్ని విధానాలను అమల్లోకి తీసుకువచ్చినా అక్రమ రవాణాకు చెక్‌ పడడం లేదు. పైగా ఇదే అవకాశం అని ఆయా వ్యక్తులు అడ్డదారులు వెతుకుతూ టన్నులు టన్నులుగా తవ్వకాలు చేపట్టి ఎక్కడెక్కడికో తరలిస్తూ వ్యాపారం చేస్తున్నారు. కీలక నేతలు సహకరిస్తుండడంతో అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదు.

The river.. is a treasure for them నది.. వారికి నిధి
చంపావతిలో ఇసుక అక్రమ తవ్వకాలు సాగుతున్న దృశ్యం

నది.. వారికి నిధి

చంపావతి నదిని దోచేస్తున్న అక్రమార్కులు

టన్నుల కొద్దీ తవ్వకాలు

అడ్డదారిలో రవాణా

ఉచితం పేరుతో దోపిడీ

ఏడొంపుల గెడ్డలోనూ ఇదే తీరు

నేతలు ఒక్కటై సహకారం

ప్రభుత్వం ఇసుక రవాణాకు సంబంధించి ఎన్ని విధానాలను అమల్లోకి తీసుకువచ్చినా అక్రమ రవాణాకు చెక్‌ పడడం లేదు. పైగా ఇదే అవకాశం అని ఆయా వ్యక్తులు అడ్డదారులు వెతుకుతూ టన్నులు టన్నులుగా తవ్వకాలు చేపట్టి ఎక్కడెక్కడికో తరలిస్తూ వ్యాపారం చేస్తున్నారు. కీలక నేతలు సహకరిస్తుండడంతో అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదు. ప్రధానంగా చంపావతి నది పొడవునా పరిస్థితి దారుణంగా తయారైంది. నది రూపును మార్చేస్తున్నారు. కొన్నిచోట్ల చాలా లోతుగా తవ్వేశారు. వాటిని చూస్తున్న స్థానికులు భవిష్యత్‌లో ఎలాంటి ముప్పు వస్తుందోనని కలవరపడుతున్నారు.

గజపతినగరం/నెల్లిమర్ల, ఆగస్టు11(ఆంధ్రజ్యోతి):

చంపావతి, ఏడొంపులగెడ్డ నుంచి రోజూ అక్రమంగా ఇసుక తరలిపోతోంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకువచ్చింది. ఇది అధికార పార్టీనాయకులకు ఒక వరంగా మారింది. వారే స్వయంగా సహకారం అందిస్తున్నారు. ఏడొంపుల గెడ్డ, చంపావతి నదిలో నుంచి రాత్రీపగలు ఇసుకను తరలించుకుపోతున్నారు. గజపతినగరం నియోజకవర్గంలో కీలక నేత అండదండలతో ఎం.గుమడాం గ్రామం నుంచి రాత్రి సమయాల్లో యంత్రాలతో ఇసుకను తోడేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి నియోజకవర్గంలో ప్రభుత్వ .పనులకు సంబంధించి అవసరమైన ఇసుకను తరలిస్తున్నప్పటికీ ఇదే పేరుతో విజయనగరం, తగరపువలస, ఆనందపురం తదితర బయట ప్రాంతాలకు తరలుతోంది. ఇసుక రీచ్‌లకు అనుమతులు లేనప్పటికీ తవ్వకాలు ప్రారంభించారు. కళ్లెదుటే అక్రమంగా తరలిపోతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడంలేదు. సహకారం అందిస్తున్న మండల స్థాయి నాయకులను అధికారులు ఎదిరించి ముందుకు వెళ్లలేకపోతున్నారు. దీంతో ఇష్టారాజ్యంగా ఇసుక రవాణా జరుగుతోంది.

- వైసీపీ హయాంలోనూ ఇదే జరిగింది. చంపావతి నదికి ఆనుకొని ఉన్న అనేక ప్రాంతాల నుంచి తవ్వుకుని పోయేవారు. దీనికి నిరసనగా అప్పట్లో పలువురు రైతులు పెద్దఎత్తున ఆందోళన చేశారు. టీడీపీ నాయకులు కూడా ఆ దందాను ప్రశ్నించారు. ప్రభుత్వం మారినా తవ్వకాల తీరు మారలేదు. నాయకులు మరారు కానీ దందాకు చెక్‌ పడలేదు. తుమ్మికాపల్లి, ఎం.గుమడాం, కొత్తశ్రీరంగరాజపురం, కెంగువ తదితర గ్రామాలకు చెందిన సుమారు 120 ట్రాక్టర్లలో ప్రతిరోజూ ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయి. వాహనదారులకు కొంతసొమ్ము ముట్టజెప్పేవిధంగా నేతలు సిండికేటై అక్రమ రవాణా జరుపుతున్నట్లు సమాచారం.

వాహనాలు పట్టుబడితే సీజ్‌

అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాలు పట్టుబడితే సీజ్‌ చేస్తాం. ఇప్పటికే ఏడొంపులగెడ్డ, చంపావతి నదీపరివాహక ప్రాంతాల వద్ద గ్రామ రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ ఉంది. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నదీ పరివాహక ప్రాంతాల వద్ద వాహనాలు దిగకుండా ట్రెంచ్‌ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటాం. పట్టుబడిన ఇసుక ట్రాక్టర్‌కు రూ.10వేలు జరిమానా విధిస్తున్నాం.

- బి.రత్నకుమార్‌, తహసీల్దార్‌, గజపతినగరం

తాగునీటి పథకాలు.. వంతెనలకు గండం

నెల్లిమర్ల పరిధిలో చంపావతి నది నుంచి ఇసుక రవాణాకు అదుపే లేదు. ఆంక్షలు విధించినా, అధికారులు దాడులు చేస్తున్నా అక్రమార్కులకు చీమకుట్టినట్లు కూడా లేకుండాపోతోంది. నెల్లిమర్ల రామతీర్థం జంక్షన్‌ సమీపంలోని రామతీర్థం రోడ్డు వంతెన వద్ద సారిపల్లి ప్రాంతంలో చంపావతి నదిలో భారీగా తవ్వకాలు జరుపుతున్నారు. అలాగే కొండపేట వద్ద, జరజాపుపేట శ్మశానానికి దగ్గర్లోనూ ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. రక్షిత నీటి పథకాల వద్ద, వంతెన స్తంభాల వద్ద నుంచి సుమారు 200 మీటర్ల దూరం వరకు ఇసుక తవ్వకూడదన్న ప్రభుత్వ ఉత్తర్వులున్నా బేఖాతరు చేస్తున్నారు. నెల్లిమర్ల శివారు ప్రాంతాల్లో సొంత స్థలాల్లోను, కళ్లాళ్లోనూ, తోటల్లోనూ గుట్టలుగా నిల్వ చేస్తున్నారు. ప్రధానంగా చంపావతినదిపై ఆధారపడిన తాగునీటి పథకాలకు గండంగా మారుతోంది. నదీగర్భంలో స్తంభాలు అమర్చిన చోట, రక్షిత నీటి బావులు ఉన్నచోట లోతుగా తవ్వేస్తున్నారు. గ్రామీణ నీటిసరఫరా విభాగం అధికారులు పదేపదే చెబుతున్నా అక్రమార్కుల్లోగానీ, అధికారుల్లోగానీ మార్పురావడం లేదు.

- చంపావతి నదిపై ఆధారపడిన నెల్లిమర్ల, జరజాపుపేట, పూతికపేట, మొయిదతోపాటు మండలంలోని 40 గ్రామాలకు తాగునీటి సరఫరా చేసే రామతీర్థం మెగా రక్షిత నీటి పథకం కూడా తవ్వకాలకు సమీపంలో ఉంది. ఇసుకు నిల్వలు శాతం తగ్గిపోతే ఈ గ్రామాల వారికి తాగునీరు అందించడం భవిష్యత్తులో కష్టమే.

Updated Date - Aug 12 , 2025 | 12:21 AM