Share News

The rice scam that never stops!ఆగని బియ్యం దందా!

ABN , Publish Date - Sep 10 , 2025 | 12:02 AM

The rice scam that never stops! జిల్లాలో బియ్యం దందాకు చెక్‌పడడం లేదు. ఇదో లాభసాటి వ్యాపారంగా మలుచుకున్న వ్యక్తులు రేషన్‌ బియ్యాన్ని కొనడం, అమ్మడం కొనసాగిస్తున్నారు. వీధి వ్యాపారులు కమీషన్ల రూపంలో లాభపడుతుండగా.. మిల్లర్లు అదే బియ్యాన్ని లెవీగా చూపుతూ లక్షలు కొల్లగొడుతున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటోంది.

 The rice scam that never stops!ఆగని బియ్యం దందా!

ఆగని బియ్యం దందా!

అంతటా రేషన్‌ బియ్యం కొనుగోళ్లు... అమ్మకాలు

అడ్డుకట్ట వేయలేకపోతున్న యంత్రాంగం

ఇంకా పోనీ వైసీపీ వాసనలు

- జూలై 7న జామి మండలం భీమసింగి జంక్షన్‌ వద్ద రేషన్‌ బియ్యంతో ఆటో పట్టుబడింది. దాదాపు ఎనిమిదిన్నర క్వింటాళ్ల బియ్యం తరలిస్తుండగా విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఆ బియ్యం ధర రూ.40 వేలు ఉంటుంది. ఆటోను సీజ్‌ చేయడంతో పాటు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

- జూన్‌ 6న విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో రెండు రైస్‌మిల్లులను అక్కడి అధికారులు ఆకస్మికంగా పరిశీలించారు. 82.4 టన్నుల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అవి విజయనగరం పౌరసరఫరా గోదాముల నుంచి వచ్చిన సరుకుగా నిర్థారించారు. బియ్యం సంచులపై ఉన్న లేబుళ్ల బట్టి నిర్థారణకు వచ్చారు.

- జూన్‌ 5న బొండపల్లి మండలంలో టన్ను రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నారు. విజయనగరంలోని గుంకలాం నుంచి గొట్లాం బైపాస్‌ రోడ్డుమీదుగా ఆటోలో తరలిస్తుండగా పట్టుకున్నారు. పట్టుబడిన బియ్యం విలువ రూ.50 వేల వరకూ విలువ ఉంటుందని విజిలెన్స్‌ అధికారులు తెలిపారు. బియ్యంతో పాటు ఆటోను బొండపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

జిల్లాలో బియ్యం దందాకు చెక్‌పడడం లేదు. ఇదో లాభసాటి వ్యాపారంగా మలుచుకున్న వ్యక్తులు రేషన్‌ బియ్యాన్ని కొనడం, అమ్మడం కొనసాగిస్తున్నారు. వీధి వ్యాపారులు కమీషన్ల రూపంలో లాభపడుతుండగా.. మిల్లర్లు అదే బియ్యాన్ని లెవీగా చూపుతూ లక్షలు కొల్లగొడుతున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటోంది.

విజయనగరం, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో రేషన్‌ బియ్యం దందాను నియంత్రిస్తున్నట్టు యంత్రాంగం చెబుతోంది కానీ కేసులు, పట్టుబడిన సరుకును చూస్తే అది ఒట్టి మాటగా తేలిపోతోంది. విజిలెన్స్‌ గణాంకాలను పరిశీలిస్తే నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో 20 వరకూ కేసులు నమోదుచేసి 40 మంది వరకూ అరెస్టుచేశారు. రూ.46.38 లక్షల విలువైన 1,019.44 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నట్టు తేలింది. ఇప్పటికీ రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు అడ్డు లేకుండా పోతోంది. వైసీపీ హయాంలో జిల్లా నుంచి కాకినాడ పోర్టుకు బియ్యాన్ని అక్రమంగా తరలించేవారు. జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో దళారులు ఉన్నట్టు అప్పట్లో ప్రచారం నడిచింది. వీరికి వైసీపీ పెద్దలు అండగా నిలిచేవారన్న విమర్శలున్నాయి. వీరంతా గ్రామాల్లో మధ్యవర్తులను ఏర్పాటుచేసుకొని బియ్యాన్ని సేకరించేవారని, ప్రతినెలా వేల క్వింటాళ్లు తరలించేవారని వినికిడి. ఇప్పటికీ బియ్యం దందా అలానే కొనసాగుతోందన్న వార్తలు వస్తున్నాయి.

జిల్లాలో 5.81 లక్షల మంది కార్డుదారులున్నారు. 9,159 టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం జిల్లాకు కేటాయిస్తోంది. ఇందులో అంత్యోదయ అన్నయోజన కార్డులు 37,687 ఉన్నాయి. వీరికి 35 కిలోల చొప్పున ఉచితంగా 1319.5 టన్నుల బియ్యం అందిస్తున్నారు. అయితే రేషన్‌కార్డుదారులు తీసుకుంటున్న వారిలో 25 శాతం మంది బియ్యాన్ని విక్రయిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. కిలో రూ.13 నుంచి రూ.15 వరకూ కొనుగోలు చేస్తున్న మధ్యవర్తులు వాటిని రూ.20లకు అమ్ముతున్నట్టు తెలుస్తోంది. అయితే గతం మాదిరిగా కాకినాడ పోర్టుకు తరలించలేకపోతున్నారు. పోలీస్‌ నిఘా పెరగడంతో అక్రమార్కులు రూటుమార్చారు. అందుకే స్థానిక మిల్లులకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అటు మిల్లర్లు సైతం వాటినే లెవీగా చూపుతున్నారు.

కొంతకాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగానే రేషన్‌ అందిస్తున్నాయి. కొవిడ్‌ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్‌ బియ్యం అందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆ పథకం కొనసాగుతునే ఉంది. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సైతం రూపాయికి కిలో బియ్యాన్ని అందిస్తోంది. ఇలా ఇస్తున్న బియ్యాన్ని రైతు కుటుంబాలతో పాటు ఎగువ మధ్య తరగతి వారు ఎక్కువగా విక్రయిస్తున్నారు. గతంలో నేరుగా లబ్ధిదారుల నుంచి డీలర్లే కొనుగోలు చేసేవారు. ఇప్పుడు చిరు వ్యాపారులు సైతం ఇదో వృత్తిగా పెట్టుకున్నారు. గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ కిలో బియ్యాన్ని రూ.13 నుంచి రూ.15 వరకూ కొనుగోలు చేస్తున్నారు. వాటినే మిల్లర్లకు అప్పగించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంకొందరు వ్యక్తులు మిల్లర్లు ఇచ్చిన సొమ్ముతోనే బియ్యం కొనుగోలు చేస్తున్నారు. వారు కిలో దగ్గర రూ.5 నుంచి రూ.10 వరకూ కమీషన్‌ తీసుకుంటారు. ఇదే బియ్యాన్ని మిల్లర్లు లెవీకి చూపించి సొమ్ము చేసుకుంటున్నారు.

సన్నబియ్యంలోనూ మాయ

సన్నబియ్యం అమ్మకాల్లోనూ అదే మాయ కొనసాగిస్తున్నారు. రేషన్‌ బియ్యాన్ని రీ సైక్లింగ్‌ చేసి సన్నబియ్యంగా కొందరు మిల్లర్లు చూపుతున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసే రేషన్‌ బియ్యాన్ని సాంబమసూరి వంటి బ్రాండెడ్‌ బియ్యంలో కలిపి విక్రయిస్తున్నారు. సన్నంగా మరపట్టడంతో వినియోగదారులు సైతం గుర్తించలేక మోసపోతున్నారు. అటు తూకం దగ్గర సైతం ఇదే పరిస్థితి. 25 కిలోలు ఉండే ప్యాకెట్‌లో ఉండేది 23 కిలోలే. రెండు కిలోలు తరుగును చూపిస్తున్నారు. ఇటు బియ్యం నకిలీతో పాటు తూకంలో సైతం వినియోగదారుడు నష్టపోవాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా అటు పౌరసరఫరాల శాఖ అధికారులు కానీ.. ఇటు తూనికలు కొలతలు శాఖ అధికారులు కానీ చూడడం లేదు.

సీఎస్‌డీటీలతో తనిఖీ చేయిస్తాం

జిల్లాలో నిత్యావసర సరుకుల పంపిణీపై నిరంతరం నిఘా ఉంటుంది. డిపోల్లో సీఎస్‌డీటీలు తనిఖీ చేస్తారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌ అధికారులు కూడా ఎప్పటికప్పడు తనిఖీలు చేస్తున్నారు. బియ్యం పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకుంటున్నాం. కార్డుదారులు నిత్యావసర సరుకులు విక్రయించినట్లు తెలిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం.

- మురళీధర్‌, ఇన్‌చార్జీ డీఎస్‌వో

=========

Updated Date - Sep 10 , 2025 | 12:02 AM