The pond is like that.. the canal is like this. చెరువు అలా.. కాలువ ఇలా
ABN , Publish Date - Sep 10 , 2025 | 12:04 AM
The pond is like that.. the canal is like this. తోటపల్లి ప్రధాన కాలువకు అనుసంధానంగా చేపట్టిన బ్రాంచి కెనాల్ నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయి చీపురుపల్లి రైతులకు రెండు విధాలా నష్టం జరిగింది. చెరువును చీల్చి కాలువ పనులు చేపట్టడంతో చెరువు నీరు దక్కక... కాలువ నిర్మాణం ఆగిపోయి తోటపల్లి నీరూ అందక రైతులు అయోమయంలో పడ్డారు. 150 ఎకరాలకు సాగు నీరు ప్రశ్నార్థకమైంది. ఇప్పట్లో కాలువ పనులు పూర్తిచేసే అవకాశం కనిపించడం లేదు.
చెరువు అలా.. కాలువ ఇలా
చీపురుపల్లి రైతులకు ఉపయోగం లేని తోటపల్లి బ్రాంచి కాలువ
చెరువు మధ్యలో నుంచి నిర్మాణం
కొన్నేళ్లుగా ఆగిన పనులు
150 ఎకరాలకు సాగు నీరు ప్రశ్నార్థకం
తోటపల్లి ప్రధాన కాలువకు అనుసంధానంగా చేపట్టిన బ్రాంచి కెనాల్ నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయి చీపురుపల్లి రైతులకు రెండు విధాలా నష్టం జరిగింది. చెరువును చీల్చి కాలువ పనులు చేపట్టడంతో చెరువు నీరు దక్కక... కాలువ నిర్మాణం ఆగిపోయి తోటపల్లి నీరూ అందక రైతులు అయోమయంలో పడ్డారు. 150 ఎకరాలకు సాగు నీరు ప్రశ్నార్థకమైంది. ఇప్పట్లో కాలువ పనులు పూర్తిచేసే అవకాశం కనిపించడం లేదు.
చీపురుపల్లి, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి):
తోటపల్లి బ్రాంచి కెనాల్ చీపురుపల్లి రైతుల్ని నిండా ముంచింది. సుమారు 150 ఎకరాల ఆయకట్టుకు ప్రధాన నీటి వనరుగా ఉన్న నారప్ప చెరువు ఈ కాలువ తవ్వకం కారణంగా రెండు ముక్కలైంది. దాదాపు 12 ఎకరాల విస్తీర్ణం కలిగిన చెరువులో నాలుగెకరాలు కాలువలో కలిసిపోయాయి. కిందనున్న ఆయకట్టుదారులకు సాగునీరు కరువైంది. చెరువు మధ్య నుంచి నిర్మించాలనుకున్న తోటపల్లి బ్రాంచి కెనాల్ పనులు కూడా వైసీపీ హయాంలోనే అర్ధాంతరంగా ఆగిపోయాయి. దీనివల్ల వివిధ మండలాల్లోని కెనాల్ ఆయకట్టు రైతులకు కూడా లబ్ధి చేకూరలేదు.
అసలేం జరిగింది
చీపురుపల్లి మీదుగా తోటపల్లి కుడి ప్రధాన కాలువ నిర్మాణం జరుగుతున్న సమయంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి మంత్రి బొత్స సత్యన్నారాయణ కొత్త ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. ప్రధాన కాలువకు అనుసంధానంగా చీపురుపల్లి అమ్మవారి ఆలయం వద్ద బ్రాంచి కెనాల్ నిర్మించి గజపతినగరం నియోజకవర్గంలోని మరిన్ని ప్రాంతాలకు సాగునీరందించాలని సూచించారు. ఈ ప్రతిపాదన డీపీఆర్‌లో లేనప్పటికీ అప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదల చేయించారు. ఈ మేరకు చీపురుపల్లి సమీపంలో తోటపల్లి కుడి ప్రధాన కాలువకు లాకులు ఏర్పాటు చేసి బ్రాంచి కెనాల్ పనులు ప్రారంభించారు. అయితే వివిధ కారణాల వల్ల ఈ పనులు కొద్దిరోజులకే నిలిచిపోయాయి. బ్రాంచి కెనాల్ తవ్వకంలో భాగంగా నారప్ప చెరువు భూములు కాలువకు అవసరమయ్యాయి. చెరువు మధ్య నుంచి కాలువ తవ్వడంతో చెరువు గర్భంలోని సుమారు నాలుగు ఎకరాలు కాలువలో కలిసిపోయాయి. చెరువు రెండుగా చీలిపోయింది. ఒక భాగానికి నీరు చేరక సుమారు 150 ఎకరాల్లో వరి సాగుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే అర్ధాంతరంగా ఆగిపోయిన బ్రాంచి కెనాల్‌లో ప్రధాన కాలువలోని నీటి నిల్వల వల్ల ఊట నీరు చేరేది. దానినే మోటార్లను ఏర్పాటు చేసుకుని పొలాలకు నీరందించేవారు. అయితే ఆ కాలువలో కూడా పొదలు పెరిగిపోవడంతో చుక్క నీరు రాని దుస్థితి నెలకొంది. చెరువును కోల్పోయిన తమకు కనీసం బ్రాంచి కెనాల్‌లో పూడిక తీయిస్తే సాగు నీటి సమస్యలు తాత్కాలికంగా తొలగుతాయని స్థానిక రైతులు లెంక చిన్నారావు, పడాల దాలినాయుడు తదితర రైతులంటున్నారు. ఆయకట్టుదారులంతా ఇటీవల చీపురుపల్లిలో ఎమ్మెల్యే కళావెంకటరావును కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.
భూములు పోయినా సాగు నీరు దక్కలేదు
నారప్ప చెరువు కింద నాకు 4 ఎకరాల పొలం ఉంది. ఒక ఎకరా పొలం కాలువ నిర్మాణంలో పోయింది. చెరువు మధ్య నుంచి బ్రాంచి కెనాల్ తవ్విన కారణంగా మిగిలిన మూడెకరాల పొలానికి సాగు నీరు అందడం లేదు. మా పొలాలు పండాలంటే కనీసం ఆగిపోయిన బ్రాంచి కెనాల్‌లో పూడిక తీయించాలి.
- పిల్ల సూర్యనారాయణ, రైతు, పిల్లపేట, చీపురుపల్లి.
ప్రజాప్రతినిధులు స్పందించాలి
నారప్ప చెరువు కింద ఆయకట్టుదారులకు సాగు నీరు లేకుండా పోయింది. మా భూములు పోయినా, బ్రాంచి కెనాల్ పనులు జరగలేదు. అటు భూములు లేక, ఇటు కాలువ నిర్మాణం జరగక అన్యాయమైపోయాం. కనీసం గజపతినగరం బ్రాంచి కెనాల్‌లో పూడిక తీయిస్తే, మోటార్లతోనైనా పొలాలకు నీరందిస్తాం. ఆ దిశగా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలి.
- రుంకాన రమణ, పిల్లపేట, చీపురుపల్లి.