The permit has arrived! పర్మిట్ వచ్చేసింది!
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:39 PM
The permit has arrived!జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూములకు అనుమతులు వచ్చేశాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలివ్వడంతో మద్యం దుకాణదారులు పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆగస్టు 13నే ప్రభుత్వం ప్రకటించింది అయితే తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. వాస్తవానికి అనధికారికంగా ఇప్పటికే కొందరు పర్మిట్ రూమ్‌లను ఏర్పాటు చేసేశారు. కార్పొరేషన్ పరిధిలో రూ.7.50 లక్షలు, మిగతా ప్రాంతాల్లో రూ.5 లక్షలకు పర్మిట్ రూములకు అనుమతి ఇస్తోంది.
పర్మిట్ వచ్చేసింది!
మద్యం షాపుల వద్ద ప్రత్యేక గదులు
అనుమతిచ్చిన ప్రభుత్వం
మందుబాబులు అక్కడే తాగేందుకు అవకాశం
రాజాం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి):
జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూములకు అనుమతులు వచ్చేశాయి. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలివ్వడంతో మద్యం దుకాణదారులు పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆగస్టు 13నే ప్రభుత్వం ప్రకటించింది అయితే తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. వాస్తవానికి అనధికారికంగా ఇప్పటికే కొందరు పర్మిట్ రూమ్‌లను ఏర్పాటు చేసేశారు. కార్పొరేషన్ పరిధిలో రూ.7.50 లక్షలు, మిగతా ప్రాంతాల్లో రూ.5 లక్షలకు పర్మిట్ రూములకు అనుమతి ఇస్తోంది.
జిల్లా వ్యాప్తంగా గత ఏడాది అక్టోబరులో 153 మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. జనాభా ప్రాతిపదికన వాటి నుంచి లైసెన్స్ ఫీజు కింద రూ.55 లక్షలు వసూలు చేశారు. విజయనగరం నగరపాలక సంస్థలో రూ.65 లక్షలు వసూలు చేశారు. అయితే వైసీపీ హయాంలో ప్రకటించిన బారు పాలసీ ఈ ఏడాది ఆగస్టు వరకూ కొనసాగడంతో పర్మిట్ రూమ్‌లకు అనుమతించడం కుదరలేదు. ఇటీవల మద్యం దుకాణదారులు ఎక్కడికక్కడే అనధికార పర్మిట్ రూమ్‌లు ఏర్పాటుచేసి కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు.
- మద్యం షాపుల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యత ఎక్సైజ్ శాఖదే. కానీ ఆ శాఖ నిద్ధరోడుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం మద్యం షాపుల నిర్వహణ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశించింది. అందుకే వైసీపీ హయాంలో ఏర్పాటైన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను రద్దుచేసింది. అయితే ఎక్సైజ్ శాఖ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపడం లేదన్న విమర్శలున్నాయి.
అదే అడ్డంకి..
వాస్తవానికి ప్రైవేటు మద్యం దుకాణాలు ఏర్పాటుచేసిన సమయంలోనే పర్మిట్ రూమ్‌లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావించింది కానీ వైసీపీ హయాంలో తెచ్చిన బార్ పాలసీ ఇంకా అమలులో ఉంది. దీంతో మద్యం దుకాణాల వద్ద పర్మిట్ రూమ్‌లకు అనుమతిస్తే బార్లలో మద్యం విక్రయాలు పడిపోతాయి. నిబంధనల ప్రకారం బార్ పాలసీ ఆగస్టు నెలాఖరు వరకూ ఉండడంతో అప్పటి వరకూ పర్మిట్ రూమ్‌లకు కుదరలేదు. అయితే జిల్లాలో దాదాపు అన్నిచోట్లా అనధికారికంగా రూమ్‌లు ఉన్నాయి. ఇక నుంచి మందుబాబులు అక్కడే తాగవచ్చు. అయితే అక్కడ వాటర్ బాటిళ్లు, చిన్న స్నాక్స్ మాత్రమే ఉంచుతారు. ఎటువంటి వంటలు ఉండవు. కేవలం నిల్చొని తాగేందుకు బళ్లలు మాత్రమే ఉంటాయి. అయితే మద్యం షాపుల వద్ద పర్మిట్ రూమ్‌లు లేక బహిరంగ ప్రదేశాల్లో తాగేవారు. పోలీసులు వెంటాడే వారు. ఇక నుంచి ఆ ఇబ్బందులు ఉండవు.
నిబంధనలు ఏవీ?
మద్యం షాపుల వద్ద కూడా నిబంధనలు పాటించడం లేదు. ఒక వ్యక్తికి రెండుకు మించి సీసాలను అమ్మకూడదు. 21 సంవత్సరాల్లోపు వారికి మద్యం విక్రయించకూడదు. కానీ వయసుతో సంబంధం లేకుండా ఎవరికి ఎన్ని సీసాలు అమ్ముతున్నారో లెక్కేలేదు. జనాభా ప్రాతిపదికన మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. మండలంలో కనిష్టంగా ఐదు వరకూ షాపులను ఏర్పాటుచేశారు. పట్టణ ప్రాంతాల్లో అయితే 7 నుంచి 10 వరకూ షాపులు ఏర్పాటయ్యాయి. కొన్ని షాపుల్లో రోజువారీ విక్రయాలు అధికంగా ఉన్నాయి. మరికొన్ని వాటిలో ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగడం లేదు. అయితే ఇలా విక్రయాలు తక్కువగా ఉన్నచోట ‘బెల్ట్’ను ప్రోత్సహిస్తునట్టు ఆరోపణలున్నాయి.
అనుమతులు వచ్చాయి
ప్రభుత్వం పర్మిట్ రూమ్‌లకు అనుమతిచ్చింది. ప్రతి షాపుదారులు విధిగా పర్మిట్ రూములు తీసుకోవాలి. అయితే అక్కడ ఎటువంటి వంటకాలు చేయకూడదు. వాటర్ బాటిళ్లతో పాటు స్నాక్స్ మాత్రమే విక్రయించాలి. నిబంధనలు పక్కాగా పాటించాలి.
- త్రినాథరావు, జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్, విజయనగరం
----------------------