Share News

సచివాలయ సిబ్బంది పనితీరు అస్తవ్యస్తం

ABN , Publish Date - Dec 18 , 2025 | 11:40 PM

నగరంలోని 60 డివిజన్లలో ఉన్న వార్డు సచివాలయాల్లో కొందరి సిబ్బంది పనితీరు అస్తవ్యస్తంగా ఉందని పలువురు కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సచివాలయ సిబ్బంది పనితీరు అస్తవ్యస్తం
మాట్లాడుతున్న కార్పొరేటర్‌ ఆశపు వేణు

- ఎప్పుడు వెళ్లినా ఉండడం లేదు

- మేయరు ఎదుట కార్పొరేటర్లు గగ్గోలు

విజయనగరం టౌన్‌, డిసెంబరు18 (ఆంధ్రజ్యోతి): నగరంలోని 60 డివిజన్లలో ఉన్న వార్డు సచివాలయాల్లో కొందరి సిబ్బంది పనితీరు అస్తవ్యస్తంగా ఉందని పలువురు కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్‌ సాధారణ సమావేశం గందరగోళంగా మారింది. ఒకవైపు సచివాలయాల సిబ్బంది పనితీరుపై ఫిర్యాదుల పర్వం, మరోవైపు వార్డుల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు జరగడం లేదంటూ అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. ఈ సమావేశంలో 17 అంశాలను పొందుపర్చగా అందులో నాలుగు అనుబంధ అంశాలపై చర్చ జరిగింది. పలువురు కార్పొరేటర్లు మాట్లాడుతూ.. తమ డివిజన్‌లోని సచివాలయాలకు ఎప్పుడు వెళ్లినా కొందరు సిబ్బంది అందుబాటులో ఉండడం లేదన్నారు. అక్కడున్న వారిని అడిగితే ఇప్పుడే వేరే పనిమీద బయటకు వెళ్లారంటూ సమాధానం చెబుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పూర్తిస్ధాయిలో సచివాలయ సిబ్బంది కానరావడం లేదని కార్పొరేటర్లు ఆశపు వేణు, రాజేష్‌, అల్లు చాణక్య, శ్రీనివాసరావు వాపోయారు. దీనిపై కమిషనర్‌ నల్లనయ్య స్పందిస్తూ.. ఇటీవల పలువురు సచివాలయ సిబ్బంది డీఎస్సీ, పోలీస్‌, తదితర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై సచివాలయ పోస్టులకు రాజీనామా చేశారని, మరికొంతమంది సిబ్బంది నగరంలో పని ఒత్తిడిని తట్టుకోలేక పని తక్కువగా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు బదిలీలపై వెళ్లిపోయారని తెలిపారు. నూతన నియామకాలు లేక సిబ్బంది కొరత ఉందని అన్నారు. కొన్నిచోట్ల ఇన్‌చార్జిలను నియమించినట్లు తెలిపారు. అనంతరం నగరంలోని అక్రమ కట్టడాలతో పాటు వీధి కుక్కలు, పందులతో నగరవాసులు పడుతున్న ఇబ్బందులను మేయర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై సంబంధిత ప్రజారోగ్యశాఖాధికారి సాంబమూర్తి మాట్లాడుతూ.. పందులుగతంతో పోల్చిచూస్తే తగ్గుముఖం పట్టాయన్నారు. వీధి కుక్కలకు సంబంధించి సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం త్వరలో ప్రణాళిక రూపొందిస్తామని స్పష్టం చేశారు. మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి మాట్లాడుతూ.. నగరంలో పలుచోట్ల అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయన్నారు. ఇప్పటివరకూ 70శాతం పూర్తవ్వగా, మిగిలిఉన్న 30శాతం పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తిచేస్తామన్నారు. సచివాలయాల్లో పౌరసేవలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. నగరంలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు పోలీసులు, కార్పొరేషన్‌ అధికారులు సంయుక్తంగా పనిచేయాలన్నారు. నగరంలో ఆధునిక కబేళా నిర్మాణానికి పూర్తిస్థాయి నివేదిక తయారు చేసేందుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ప్రతీఒక్కరి సహకారంతో నగరాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సహాయ కమిషనర్‌ కిల్లాన అప్పలరాజు, డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి, టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ, ప్రజారోగ్యశాఖలకు చెందిన అధికారులతో పాటు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Updated Date - Dec 18 , 2025 | 11:40 PM