The path is difficult all the way. ‘దారి’ పొడవునా కష్టమే
ABN , Publish Date - Sep 10 , 2025 | 12:06 AM
The path is difficult all the way. రాజాం మండలం కంచరాం జగనన్న కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి ఇది. ఇలా బురదమయంగా మారి కనీసం నడిచి వెళ్లేందుకు కూడా వీలుపడడం లేదు. ఇళ్ల నిర్మాణానికి మెటీరియల్ తీసుకొని వెళ్లేందుకు వేరే మార్గం లేదు. అధికారులేమో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లబ్ధిదారులపై ఒత్తిడి పెంచుతున్నారు. వైసీపీ హయాంలో పట్టాలు ఇచ్చాం మీరే పడండి అన్నట్లు వదిలేశారు. లేఅవుట్‌లో వసతులు మెరుగుపడక లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదు.
‘దారి’ పొడవునా కష్టమే
నిర్మాణ సామగ్రి తీసుకెళ్లేదెలా?
దారుణంగా కంచరాం జగనన్న లేఅవుట్
మౌలిక వసతులు కల్పించని వైనం
1700 ఇళ్లలో పూర్తయినవి 181 మాత్రమే
నిరాశలో రాజాం మునిసిపాలిటీ లబ్ధిదారులు
- రాజాం మండలం కంచరాం జగనన్న కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి ఇది. ఇలా బురదమయంగా మారి కనీసం నడిచి వెళ్లేందుకు కూడా వీలుపడడం లేదు. ఇళ్ల నిర్మాణానికి మెటీరియల్ తీసుకొని వెళ్లేందుకు వేరే మార్గం లేదు. అధికారులేమో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లబ్ధిదారులపై ఒత్తిడి పెంచుతున్నారు. వైసీపీ హయాంలో పట్టాలు ఇచ్చాం మీరే పడండి అన్నట్లు వదిలేశారు. లేఅవుట్‌లో వసతులు మెరుగుపడక లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదు.
రాజాం, (ఆంధ్రజ్యోతి):
వైసీపీ హయాంలో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పేదల కాలనీల్లో నేటికీ అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి. స్థలాలు కేటాయించిన అప్పటి ప్రభుత్వం మౌలిక సౌకర్యాలను విస్మరించింది. కనీసం రోడ్లు కూడా వేయలేదు. దీంతో ఇటీవల కురిసిన వర్షాలకు బురదలో నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. రాజాం మునిసిపాలిటీ ప్రజల కోసం కేటాయించిన కంచరాం జగనన్న లే అవుట్ ఇందుకో ఉదాహరణ. అప్పట్లో జీఎంఆర్‌కు చెందిన భూములు పట్టణ పేదల కోసం కేటాయించారు. 1700 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అయితే రోడ్డు కూడా వేయలేదు. దీంతో కనీసం ఇంటి నిర్మాణానికి సంబంధించి మెటీరియల్ తీసుకు వెళ్లేందుకు కూడా వీలులేకుండా పోయింది. లబ్ధిదారులు నిర్మాణానికి విముఖత చూపుతున్నారు. వైసీపీ హయాంలో కలెక్టర్‌తో పాటు ఉన్నతాధికారులు చూడడం, హామీలు ఇవ్వడం, తరువాత మరిచిపోవడం పరిపాటిగా మారింది.
రాజాం పట్టణంలోని నిరుపేద ప్రజలకు కంచరాంలో 1700 పట్టాలు అందించారు. ఇందులో కేవలం 867 ఇళ్లకు సంబంధించి అప్పట్లో పనులు ప్రారంభించారు. వీటిలో కేవలం 181 మాత్రమే పూర్తయ్యాయి. 79 రూఫ్ లెవల్, 8 శ్లాబ్ లెవల్‌లో ఉన్నాయి. 136 ఇళ్లు ఇంకా పునాదుల దశలో ఉన్నాయి. 463 ఇళ్ల స్థలాలను పూర్తిగా వదిలేశారు. అయితే దీనికి కారణం ముమ్మాటికీ అప్పటి జగన్ సర్కారే. ఎవరైనా లేఅవుట్ వేస్తే ముందుగా రహదారులు, కాలువలు నిర్మిస్తారు. మౌలిక వసతులు కల్పిస్తారు. అటు తరువాతే ఇళ్ల నిర్మాణ పనులు చేపడతారు. ఇక్కడ మాత్రం లేఅవుట్‌కు వెళ్లే ప్రధాన రహదారిని సైతం నిర్మించలేదు. లోపల సైతం రహదారుల ఊసులేదు. కనీసం వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు మార్గం లేదు. దీంతో ఆ బురద రహదారుల్లోనే చాలామంది రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో అధికారులు ఒత్తిడి పెంచుతున్నా ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాని దుస్థితి.
ప్రభుత్వానికి నివేదించాం
కంచరాం లేఅవుట్‌లో మౌలిక వసతుల కల్పన జరుగుతోంది. అక్కడి పరిస్థితిని ప్రభుత్వానికి నివేదించాం. రహదారులతో పాటు కాలువల నిర్మాణం చేపడతాం.
- పి.దుర్గారావు, హౌసింగ్ ఏఈ, రాజాం