సమ్మెకు దిగిన మైనింగ్ కార్మికులు
ABN , Publish Date - Oct 19 , 2025 | 11:59 PM
మండలంలోని దువ్వాం పంచాయతీ పరిధిలో గల డీఎఫ్‌ఎన్‌లో మైనింగ్ కార్మికులు ఆదివారం మెరుపు సమ్మెకు దిగారు.
గరివిడి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): మండలంలోని దువ్వాం పంచాయతీ పరిధిలో గల డీఎఫ్‌ఎన్‌లో మైనింగ్ కార్మికులు ఆదివారం మెరుపు సమ్మెకు దిగారు. డీఎఫ్‌ఎంకు చెందిన ఆర్పీఎస్ దాస్ కంపెనీకి చెందిన దేవాడ, సదానందపురం, దువ్వాము తదితర మైనింగ్ కంపెనీలలో సుమారు గత 50 సంవత్సరాల నుంచి 261 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఇటీవల సదరు పరిశ్రమకు మైనింగ్‌కు సంబంధించిన లీజులు కాలపరిమితి అయిపోయింది. దీంతో మైనింగ్‌లో పనిచేసిన 261 మంది కార్మికులను సెటిల్‌మెంట్ చేసి తొలగిస్తామని పరిశ్రమ యాజమాన్యం వారు అంటున్నారు. దీనికి కార్మికులు ససేమిరా అంటున్నారు. తిరిగి పరిశ్రమకు మైనింగ్ లీజులు వచ్చేంతవరకు వేచి ఉంటామని, లీజు అనుమతులు పొందిన తర్వాత పనిలోకి వస్తామని కార్మికులు తమ యూనియన్ అయిన సీఐటీయూ నాయకుల ద్వారా యాజమాన్యా నికి విన్నవించుకున్నారు. ఈ సమస్యపై గత కొంతకాలంగా యాజ మాన్య వర్గాలకు, సీఐటీయూ నాయకులకు పలు దఫాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా యాజమాన్యం వారు కార్మికుల అనుమతు లు లేకుండా వారి బ్యాంకు అకౌంట్లలో సెటిల్‌మెంట్‌కు సంబంధించిన డబ్బులను జమచేశారు. విషయం తెలుసుకున్న మైనింగ్ కార్మికులు సీఐటీయూ నాయకుల ఆధ్వర్యంలో ఆదివారం పరిశ్రమకు చెందిన డీఎఫ్‌ఎన్‌లో ఉన్న పరిశ్రమ ప్రధాన కార్యాలయం వద్ద మెరుపు సమ్మెకు దిగారు. ఎట్టి పరిస్థితిలోనూ తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే తమ పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమానికి సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.గౌరినాయుడు, మైన్స్ నాయకులు అప్పలనానాయుడు, పాపినాయుడు, రమణ, సన్యాసినాయుడు, వీరభద్రం తదితరులు నాయకత్వం వహించారు.