The masters are coming. మాస్టార్లు వచ్చేస్తున్నారు
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:41 PM
The masters are coming. మెగా డీఎస్సీలో భాగంగా ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను సోమవారం విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు.
మాస్టార్లు వచ్చేస్తున్నారు
ఉపాధ్యాయుల ఎంపిక తుది జాబితా విడుదల
మొత్తం పోస్టులు 578
ఐదు పోస్టులకు లేని అభ్యర్థులు
డీఈవో కార్యాలయం వద్ద జాబితా
19న నియామక పత్రాలు అందజేత... 22 నుంచి శిక్షణ
విజయనగరం కలెక్టరేట్, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీలో భాగంగా ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను సోమవారం విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఆ వివరాలు డీఈవో కార్యాలయం వద్ద అందుబాటులో ఉన్నాయి. అలాగే వెబ్‌సైట్‌లోనూ జాబితా పెట్టారు. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 19న సీఎం చంద్రబాబు నియామక పత్రాలు అందజేస్తారు. 22 నుంచి వారికి శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లాలో 583 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. 578 పోస్టులను భర్తీ చేశారు. ఐదు పోస్టులకు సంబంధించి ఆ కేటగిరికి చెందిన అభ్యర్థులు లేక భర్తీ చేయలేదు. స్కూల్ అసిస్టెంట్లలో ఇంగ్లీష్ 19, హిందీ 14, తెలుగు 12, జీవ శాస్త్రం19, గణితం 8, ఫిజికల్ ఎడ్యుకేషన్ 62, ఫిజికల్ సైన్సు 32, సోషల్ 58, ఎస్‌జీటీలు 149 పోస్టులు భర్తీ చేశారు. అయితే ఫిజికల్ ఎడ్యూకేషన్‌లో ఒక పోస్టుకు సంబంధించి బీసీ-సీ కేటగిరికి చెందిన అభ్యర్థి లేక ఆ పోస్టును భర్తీ చేయలేదు. ఇక మునిసిపల్ పరిధిలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 4, తెలుగు 2, సోషల్ 2, ఎస్‌జీటీలు 47 పోస్టులు చొప్పున భర్తీ చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ పరిఽధిలో జీవశాస్త్రం, ఫిజికల్ ఎడ్యూకేషన్ ఒక్కొక్కటి, సోషల్ రెండు, ఎస్‌జీటీ 10 భర్తీ చేశారు. ఎస్‌జీటీ ఉర్దూ మీడియం పోస్టుల విషయానికి వచ్చేసరికి నాలుగు పోస్టులకు అభ్యర్థులు లేక వాటిని భర్తీ చేయలేదు. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ 7, జీవ శాస్త్రం 16, గణితం 25, ఫిజిక్స్ 24, సోషల్ 5, ఎస్‌జీటీలు 60 పోస్టులు భర్తీ చేశారు. ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు తమకు ముందే దసరా పండగ వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
22 నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ
జిల్లాలో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు దసరా సెలవుల సమయంలో ఈనెల 22 నుంచి 29 వరకూ 8 రోజులు పాటు శిక్షణ ఉంటుంది. తద్వారా వారి బోధనా నైపుణ్యాలను అభివృద్ధి చేసి సమాజ అభివృద్ధి కోసం నిజాయితీ, నిబద్ధత, అంకితభావంతో పనిచేసేలా దిశానిర్దేశం చేస్తారు. ట్రైనింగ్ సమయంలోనే కౌన్సెలింగ్ ద్వారా ప్లేస్‌మెంట్ ఆర్డర్లు జారీ చేస్తారు. శిక్షణ పూర్తయిన వెంటనే నూతన ఉపాధ్యాయులు తమకు కేటాయించిన పాఠశాలల్లో చేరతారు.