The lorry that ran over దూసుకెళ్లిన లారీ
ABN , Publish Date - Aug 04 , 2025 | 12:14 AM
The lorry that ran over ఆరికతోట వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం భారీ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీ ఉన్నఫలంగా ముందుకు కదిలి పలు వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మూడు బైకులు, రెండు ఆటోలు, ఒక వ్యాను ధ్వంసమైంది.
దూసుకెళ్లిన లారీ
జాతీయ రహదారిపై భారీ ప్రమాదం
మూడు బైకులు, రెండు ఆటోలు, ఒక వ్యాను ధ్వంసం
ఆగి ఉన్న లారీ ముందుకు కదలడంతో ప్రమాదం
రామభద్రపురం, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): ఆరికతోట వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం భారీ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీ ఉన్నఫలంగా ముందుకు కదిలి పలు వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మూడు బైకులు, రెండు ఆటోలు, ఒక వ్యాను ధ్వంసమైంది. ఆ సమయంలో జనం అధికంగా చేరడంతో భయపడిన లారీ డ్రైవర్ పరారయ్యాడు. వివరాల్లోకి వెళితే..
విజయనగరం నుంచి ఒడిశా వైపు వెళ్తున్న లారీని ఆరికతోట వద్దకు వచ్చాక ఓ పక్కన నిలిపి డ్రైవర్ టిఫిన్‌కు వెళ్లాడు. కొద్ది నిమిషాల తర్వాత లారీ ఒక్కసారిగా ముందుకు కదిలింది. వ్యాన్‌ను ఢీకొనడంతో ఆ పక్కనే ఉన్న గోతిలో పడింది. అనంతరం లారీ కొబ్బరి బొండాల ఆటోను ఢీకొంది. మరికొంత దూరం వెళ్లిన లారీ ఆగి ఉన్న మూడు బైకులను కూడా ఢీకొట్టి ఎదురుగా ఉన్న మరో ఆటోను ఢీకొని నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో రెండు బైకులు లారీ కింద ఉండిపోయాయి. ఒక బైకు నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆరికతోటకు చెందిన యజ్జల భాస్కరరావుకు చెందిన ఆటోతోపాటు టికొట్టులో ఉన్న సామాన్లు ధ్వంసమయ్యాయి. మొక్కజొన్న లోడుకోసం వచ్చిన వ్యాన్ కూడా బోల్తాపడింది. దుప్పలపూడి గ్రామానికి చెందిన చిప్పాడ రవితోపాటు మరో వ్యక్తి బైకు కూడా ఈ ప్రమాదంలో నుజ్జునుజ్జయ్యాయి. లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ వివరాలు తెలియరాలేదు.