జాబితా ప్రకటించారు..పదోన్నతులు మరిచారు
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:22 AM
పదోన్నతులు కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న గ్రేడ్-3 ఏఎన్‌ఎంలు (హెల్త్ సెక్రటరీ) ఏడాదిగా ఎదురు చూస్తున్నారు.
- ఏడాదిగా ఎదురుచూస్తున్న గ్రేడ్-3 ఏఎన్‌ఎంలు
- వైద్యఆరోగ్య శాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు
శృంగవరపుకోట ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): పదోన్నతులు కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న గ్రేడ్-3 ఏఎన్‌ఎంలు (హెల్త్ సెక్రటరీ) ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. తుది జాబితా ప్రకటించి మూడు నెలలు పూర్తయినా, ఇంకా పదోన్నతుల ప్రక్రియ మొదలుకాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. దీంతో వైద్యఆరోగ్య శాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శాఖల వారీగా పదోన్నతుల కల్పనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గ్రేడ్-3 ఏఎన్‌ఎంలకు కూడా పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు గతేడాది సెప్టెంబరు 26న ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి గ్రేడ్-3 ఏఎన్‌ఎంలకు ఎదురు చూపులే మిగిలాయి. ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఈ ఏడాది జనవరి వరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోలేదు. దీంతో ఏఎన్‌ఎంలు ఉన్నతాధికారులను కలసి సమస్యను విన్నవించడంతో ఈ ఏడాది మార్చి 26న ప్రాథమిక (ప్రోవిజినల్) జాబితాను విడుదల చేశారు. ఏప్రిల్ 15 వరకు అభ్యంతరాలు స్వీకరించేందుకు సమయం ఇచ్చారు. ఆ తరువాత దీన్ని మే 12 వరకు పొడిగించారు. తుది జాబితాను మాత్రం ప్రకటించకుండా కాలయాపన చేయడంతో ఏఎన్‌ఎంలు ఉద్యమించారు. దీంతో ఈ ఏడాది మే 16న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ 591 మంది పేర్లతో తుదిజాబితాను ప్రకటించింది. అయితే, ఖాళీలు ఎన్ని ఉన్నాయో మాత్రం చెప్పలేదు. అయినప్పటికీ, జాబితాలో ముందు వరుసలో ఉన్న వందమంది గ్రేడ్-3 ఏఎన్‌ఎంలు ఈ పదోన్నతులపై ఆశలు పెట్టుకున్నారు. వీరితో పాటు రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న దివ్యాంగ ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఉద్యోగులు కూడా పదోన్నతులు వస్తాయని నమ్మకంగా ఉన్నారు. కానీ, వారి ఆశలు ఇంకా నెరవేరడం లేదు. పదోన్నతులపై ఇప్పటికీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి స్పష్టమైన సమాధానం రావడం లేదు. మరోపక్క 591 మందితో విడుదల చేసిన తుది జాబితాపై ఏఎన్‌ఎంలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఎన్ని ఖాళీలు ఉన్నాయో అధికారులు బయటకు చెప్పకపోవడమే దీనికి కారణం. రిజర్వేషన్ ప్రకారం పదోన్నతులు చేపడతారా? జిల్లా అర్హత పరీక్షల్లో పొందిన మార్కుల మెరిట్ ప్రకారం ఉంటాయా?, ఈ రెండు కాకుండా రాజకీయ జోక్యంతో పదోన్నతుల్లో అవకతవకలకు పాల్పడతారా? అనే భయం ఏఎన్‌ఎంల్లో నెలకొంది. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించి తమకు పదోన్నతులు కల్పించాలని గ్రేడ్-3ఏఎన్‌ఎంలు కోరుతున్నారు.