Employment Guarantee Scheme: మస్తర్ల మాయ
ABN , Publish Date - May 26 , 2025 | 12:05 AM
Employment Guarantee Scheme: జిల్లాలో ఉపాధి హామీ పథకంలో వేతనదారుల సంఖ్య పెంచాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడంతో దీనిని ఆసరాగా చేసుకుని కొందరు మేట్లు అక్రమాలకు పాల్పడుతున్నారు.
- జిల్లాలో ఉపాధి హామీ పథకంలో అక్రమాలు
-పనిచేయకపోయినా బినామీ మస్తర్లతో వేతనం
- ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు కుమ్మక్కు
- సహకరిస్తున్న మండలస్థాయి అధికారులు
- చర్యలు తప్పవంటున్న డ్వామా పీడీ
- గంట్యాడ మండలం నరవ గ్రామంలో కొందరు ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారు. వీరు ఉపాధి హామీ పనికి వెళ్లకపోయినా వారి పేరిట బినామీ మస్తర్లు వేశారు. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ పతివాడ భాస్కరరావు రెండు రోజుల కిందట జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. మేట్లు ఈ పని చేస్తున్నారంటూ అధికారులకు వివరించారు. దీనిపై వెంటనే విచారణ చేసి అందుకు కారణమైనవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- ఎస్.కోట మండలం శివారు గ్రామంలోని ఓ వ్యకి ఉపాధి హామీ పనికి వెళ్లపోయినా ఆయన పేరున బినామీ మస్తర్లు వేశారు. దీంతో ఆ వ్యక్తికి చెందిన బ్యాంకు ఖాతాలో వేతన డబ్బులు జమయ్యాయి. ఈ విషయాన్ని గ్రామ యువత గుర్తించారు. సంబంధిత వ్యక్తిపై మండల అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
విజయనగరం కలెక్టరేట్, మే 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉపాధి హామీ పథకంలో వేతనదారుల సంఖ్య పెంచాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడంతో దీనిని ఆసరాగా చేసుకుని కొందరు మేట్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. బినామీ మస్తర్లను ఇష్టానుసారంగా వేసి వేతనాలను మింగేస్తున్నారు. కొన్నిచోట్ల ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు ఒక్కటై ఈ వ్యవహారం సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
వారికి మండల స్థాయి అధికారులు సహకారం అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకూ ఉపాధి హామీ పనులకు అధిక సంఖ్యలో వేతనదారులు వెళ్తుంటారు. మిగిలిన సమయంలో వ్యవసాయ, ఇతర పనులు చేసుకుంటుంటారు. అయితే, ఎక్కువమంది పనికి వెళ్తున్న సమయంలో బినామీ మస్తర్ల వ్యవహారం చోటు చేసుకుంటుంది. జిల్లా వ్యాప్తంగా 3.45లక్షల మందికి జాబ్ కార్డులు ఉన్నాయి. వీరిలో ప్రస్తుతం రోజుకు 1,89,920 మంది పనికి వెళ్తున్నట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. ప్రతి గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు మేట్లు కూడా ఉన్నారు. 30 నుంచి 50 మంది వేతనదారులకు ఒక మేటు చొప్పున ఉన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో చెరువులు, కాలువుల్లో పూడిక తీయడం, ఫాంపాండ్, కందకాలు తవ్వడం వంటి పనులు జరుగుతున్నాయి.
పనులకు వచ్చే వేతనదారులకు మేట్లు ఉపాధి యాప్‌లో మస్తర్లు వేస్తారు. మేట్ల సెల్‌ఫోన్‌లు పనిచేయకపోతే ఆ పరిస్థితిలో ఫీల్డ్‌అసిస్టెంట్లు తమ ఫోన్ల ద్వారా మస్తర్లు వేస్తుంటారు. అయితే, పనికి హాజరుకాని కూలీలకు కూడా మస్తర్లు వేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఆ వచ్చే వేతనాన్ని మేట్లు, బినామీ కూలీలు పంచుకుంటున్నట్లు మిగిలిన వేతనదారులు ఆరోపిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో వేతనదారులు పని ప్రదేశానికి వెళ్లినా వారు పని చేయడం లేదు. అయినా వారి ఖాతాలకు పూర్తి స్థాయిలో వేతనాలు జమవుతున్నాయి.
ఇటువంటి వ్యవహారాల కోసం కొందరు మేట్లు వేతనదారుల నుంచి కొంత మొత్తంలో వసూలు చేస్తున్నారు. కొంత వాటాను మండల స్థాయి అధికారులకు ముట్టచెబుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. దీనికి టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీవోల సహకారం కూడా పూర్తి స్థాయిలో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని జిల్లా డ్వామా పీడీ శారదాదేవి వద్ద ప్రస్తావించగా.. ‘బినామీ మస్తర్లు వేసినట్లు ఎక్కడైనా ఫిర్యాదు అందితే వెంటనే ఏపీవోల ద్వారా విచారణ చేయిస్తాం. అక్రమాలు రుజువైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.’అని తెలిపారు.