Share News

The illusion of offers ఆఫర్ల మాయ

ABN , Publish Date - Dec 24 , 2025 | 12:11 AM

The illusion of offers పండగ ఆఫర్‌.. సగం ధరలకే నాణ్యమైన దుస్తులు.. పిల్లలకే కాదండోయ్‌ పెద్దలకూ 60 పర్సంట్‌ డిస్కౌంట్‌.. వారం రోజులే అవకాశం.. రండి త్వరపడండి అంటూ వ్యాపారులు ఊదరగొడుతున్నారు. ఏటా మాదిరి ఈ ఏడాదీ దంచికొడుతున్నారు. క్రిస్మస్‌ నుంచి సంక్రాంతి వరకూ ఈ ప్రచారం ఏటా చూస్తున్నదే.

 The illusion of offers ఆఫర్ల మాయ

ఆఫర్ల మాయ

పండగ డిస్కౌంట్లు అంటూ ప్రకటనలు

తీరా వెళ్లాక మోసమే

నాణ్యత లేనివి కట్టబెట్టే యత్నం

కొద్ది స్టాకే అంటూ నమ్మబలుకుతున్న వ్యాపారులు

పండగ ఆఫర్‌.. సగం ధరలకే నాణ్యమైన దుస్తులు.. పిల్లలకే కాదండోయ్‌ పెద్దలకూ 60 పర్సంట్‌ డిస్కౌంట్‌.. వారం రోజులే అవకాశం.. రండి త్వరపడండి అంటూ వ్యాపారులు ఊదరగొడుతున్నారు. ఏటా మాదిరి ఈ ఏడాదీ దంచికొడుతున్నారు. క్రిస్మస్‌ నుంచి సంక్రాంతి వరకూ ఈ ప్రచారం ఏటా చూస్తున్నదే. వారి ప్రకటనలు చూసి ఎంతో ఆశతో బయలుదేరుతారు. తీరా వెళ్లాక అసలు విషయం బోధపడుతుంది. ఆఫర్‌ సరుకు ప్రత్యేకంగా పెట్టడం చూసి సగం ఆశ వదలుకుంటారు. నాణ్యత చూసి పూర్తిగా ఖంగుతింటారు. ప్రస్తుతం చాలా దుకాణాల్లో ఇదే జరుగుతోంది. వస్త్ర ప్రపంచానికి పెట్టింది పేరుగా ఉన్న విజయనగరంలో కొందరు దుకాణదారులు వినియోగదారులను దారుణంగా మోసగిస్తున్నారు. నాణ్యత సరిచూసుకోకపోతే మోసపోతారు.

విజయనగరం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి):

వస్త్ర మార్కెట్‌కు ఉత్తరాంధ్రలో విజయనగరానికి పెట్టింది పేరు. ఒడిశాతో పాటు చత్తీస్‌గఢ్‌ నుంచి కూడా కొనుగోలు చేయడానికి వస్తుంటారు. విజయనగరంలో ఏ మూల చూసినా ఆఫర్‌ ప్రకటనలు మిన్నంటాయి. క్రిస్మస్‌ వచ్చేయడంతో ఆటోలు, నాలుగు చక్రాల వాహనాల్లో విరామం లేకుండా ప్రచారం చేస్తున్నారు. పూర్తిగా నమ్మారో అంతే సంగతులు. గమ్మత్తయిన మాటలతో, వినసొంపైన ధరలతో ఇట్టే దుస్తులను అంటగడతారు. ఉల్లివీధి నుంచి మార్కెట్‌ అంతా వందలాది వ్యాపార సంస్థల సమాహారం. వివాహాలకైనా, శుభకార్యాలకైనా వస్త్రాల కొనుగోలుకు ఈ ప్రాంతానికే వస్తారు. అయితే పండగ రోజులను కొందరు వ్యాపారులు క్యాష్‌ చేసుకుంటున్నారు. ఆఫర్లు, తక్కువ ధరలు అంటూ నాసిరకం దుస్తులను అంటగడుతున్నారు. డిసెంబరు మొదటి వారం నుంచే డిస్కౌట్‌ సేల్‌ బోర్డులు పెట్టేశారు. సంక్రాంతి వరకూ ఇదే తీరు కొనసాగుతుంది. ఈ రెండు నెలల్లోనే విజయనగరం మార్కెట్‌లో రూ.800 కోట్ల నుంచి రూ.1000 కోట్ల వరకూ విక్రయాలు జరుగుతాయని అంచనా. హోల్‌సేల్‌ దుకాణాలు 1000 వరకూ ఉండగా రిటైల్‌ షాపులు మరో 600 వరకూ ఉంటాయి. జ్యూయలరీ షాపులు మరో 500 వరకూ ఉంటాయి. దీంతో కోట్లాది రూపాయల టర్నోవర్‌ జరుగుతుంటుంది.

అటు శ్రీకాకుళం నుంచి ఇటు విశాఖపట్నం వరకూ విజయనగరం మార్కెట్‌ అంటే ప్రత్యేక గుర్తింపు ఉంది. సామాన్యుడికి సైతం ధరలు అందుబాటులో ఉంటాయన్నది ఒక నమ్మకం. కొన్ని సంవత్సరాలుగా ఇదే విశ్వాసంతో వ్యాపారాలు కొనసాగేవి. ఇప్పుడు ప్రజలు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వ్యాపారాలు సాగుతున్నాయి. ఆఫర్లు, డిస్కౌంట్ల రూపంలో సామాన్యులను మోసగిస్తున్నారు. ఈ విషయంలో వ్యాపార సంస్థలు పోటీ పడుతున్నాయి. రూ.2000 విలువైన వస్త్రాలు రూ.999కే అందిస్తున్నట్టు ప్రకటిస్తున్నారు. నాణ్యత కలిగిన బ్రాండెడ్‌ టీషర్టులు రూ.200, రూ.3 వేలు విలువ చేసే పట్టుచీర రూ.1000కి..రూ.10 వేలు కొనుగోలుపై 30 శాతం డిస్కౌంట్‌, కొన్నిరకాల వస్త్రాలపై 70 శాతం తగ్గింపు ..ఎంతకొంటే అంత ఫ్రీ..బంగారు ఆభరణాలపై తరుగు మజూరీ రాయితీ...వెండి, బంగారు కాయిన్‌ గిఫ్టులు, ఎలక్ర్టానిక్‌ వస్తువులపై 50 శాతం డిస్కౌంట్లు అంటూ భారీ ప్రకటనలు చేస్తున్నారు. కొన్నాక మోసపోయామని కొనుగోలుదారులు గుర్తిస్తున్నారు. క్రిస్మస్‌, సంక్రాంతి సీజన్లలో విజయనగరంలో నడిచే వ్యాపారాలతో ఏడాదంతా సర్దుబాటు చేసుకుంటామని ఇక్కడి వ్యాపారులు చెబుతారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

------------------------

Updated Date - Dec 24 , 2025 | 12:11 AM