The goal is value-based education. విలువలతో కూడిన విద్యే లక్ష్యం
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:50 PM
The goal is value-based education. తమ పూర్వీకుల నుంచి విలువలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా మాన్సాస్ విద్యా సంస్థలు పనిచేస్తున్నాయని మాన్సాస్ ట్రస్టు చైర్మన్, గోవా గవర్నర్ అశోక్‌గజపతిరాజు చెప్పారు. మహారాజా కోటలో మాన్సాస్ ఆధ్వర్యంలో రూ.12 కోట్ల 75 లక్షలతో పునఃనిర్మించిన మోతీమహల్‌ను ఆయన మంగళవారం ప్రారంభించారు.
విలువలతో కూడిన విద్యే లక్ష్యం
మోతీమహల్ ప్రారంభోత్సవంలో మాన్సాస్ చైర్మన్, గోవా గవర్నర్ అశోక్‌గజపతిరాజు
విజయనగరం/ రూరల్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): తమ పూర్వీకుల నుంచి విలువలతో కూడిన విద్యను అందించడమే లక్ష్యంగా మాన్సాస్ విద్యా సంస్థలు పనిచేస్తున్నాయని మాన్సాస్ ట్రస్టు చైర్మన్, గోవా గవర్నర్ అశోక్‌గజపతిరాజు చెప్పారు. మహారాజా కోటలో మాన్సాస్ ఆధ్వర్యంలో రూ.12 కోట్ల 75 లక్షలతో పునఃనిర్మించిన మోతీమహల్‌ను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఇందులో నూతనంగా కంప్యూటర్ ల్యాబ్స్, 30 వరకూ అదనపు తరగతి గదులను నిర్మించారు. ఈ సందర్భంగా అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో విద్యా వ్యాప్తి కోసం తమ పూర్వీకులు మాన్సాస్ విద్యా సంస్థలను స్థాపించారని గుర్తుచేశారు. ఇందులో చదువుకున్నవారు దేశంలోని ప్రముఖ స్థానాల్లో స్థిరపడి విద్యా సంస్థల ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్నారన్నారు. కొత్త భవనాల్లోకి ఎంఆర్ కళాశాలను తరలిస్తున్నామన్నారు. అలాగే లా విద్యలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఎంఆర్ లా కళాశాలను ఎక్సలెన్సీగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. ఏ ప్రభుత్వమైతే విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తుందో? ఆయా రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో పాలన సాగించిన ప్రభుత్వం సంస్కరణల పేరిట ప్రభుత్వ విద్యా సంస్థలను ఎత్తివేసిందన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారన్నారు. నీతి ఆయోగ్ నివేదిక ద్వారా 14లక్షలు మంది విద్యకు దూరమైనట్లు స్పష్టమైందన్నారు. తమ పూర్వీకులు ఏ లక్ష్యంతో మాన్సాస్ సంస్థలను స్థాపించారో ఆ లక్ష్యసాధనకు నిరంతరం కృషి జరుగుతుందని చెప్పారు.
పీవీజీ రాజుకు నివాళి
మోతీమహల్ ముందు ఉన్న పీవీజీ రాజు విగ్రహానికి మాన్సాస్ చైర్మన్, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, ఆయన సతీమణి సునీలాగజపతిరాజు, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, విజయనగరం ఎమ్మెల్యే అదితిగజపతిరాజు, అశోక్‌గజపతిరాజు సోదరి సునీతా ప్రసాద్, తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కోటలోని మోతీమహల్‌లోనే తన విధ్యాభ్యాసం సాగిందని సంధ్యారాణి గుర్తుచేశారు.