మహిళల అభ్యున్నతే ధ్యేయం
ABN , Publish Date - Aug 15 , 2025 | 11:49 PM
మహిళల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని, వారి కోసమే స్త్రీశక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- స్త్రీశకి ్త పథకం ప్రారంభం
విజయనగరం రింగురోడ్డు/గజపతినగరం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): మహిళల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని, వారి కోసమే స్త్రీశక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మహిళల ఉచిత బస్సు సర్వీసులను మంత్రి శ్రీనివాస్ ప్రారంభించారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఉచిత టికెట్లను కండక్టర్ వద్ద తీసుకున్నారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు బస్సులో ప్రయాణించి మహిళలతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ.. మహిళల చదువు, ఉద్యోగం, స్వయం ఉపాధికి ఈ పథకం ఎంతగానో దోహదం చేస్తుందన్నారు. జిల్లాకు త్వరలో ఎలక్ట్రికల్ బస్సులు రానున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే అదితి మాట్లాడుతూ, మహిళల సంక్షేమం టీడీపీతోనే మొదలైందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే నాగమాధవి మాట్లాడుతూ.. చట్ట సభల్లో మహిళలకు ప్రాధాన్యత పెంచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కలెక్టర్ బీఅర్ అంబేడ్కర్ మాట్లాడుతూ.. స్త్రీ శక్తి పథకం ద్వారా జిల్లాలో రోజుకి సుమారు 12 వేల మంది మహిళలకు ప్రయోజనం కలగనుందని తెలిపారు. విజయనగరం, ఎస్.కోట డిపోల పరిధిలో 131 బస్సులను స్త్రీశక్తి పథకానికి కేటాయించినట్లు చెప్పారు. దీనివల్ల నెలకు సుమారు కోటి రూపాయల పైనే ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని అన్నారు. కార్యక్రమంలో తూర్పుకాపు కార్పొరేషన్ చైర్‌పర్సన్ పాలవలస యశస్వి, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, డీసీఎంఎస్ చైర్మన్ గొంపా కృష్ణ, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసరావు, కూటమి నాయకులు పడాల అరుణ, రెడ్డి పావనీ, జిల్లా ప్రజారవాణాధికారి జి.వరలక్ష్మి, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.