బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయం
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:14 AM
బడుగుల బలహీన వర్గాల అభ్యున్నతే భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుజ్జల ఈశ్వరయ్య అన్నారు.
పాలకొండ, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): బడుగుల బలహీన వర్గాల అభ్యున్నతే భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. పాలకొండలో శుక్రవారం నిర్వహించిన సీపీఐ పార్వతీపురం మన్యం జిల్లా ద్వితీయ మహాసభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 2025 డిసెంబరు నాటికి సీపీఐ వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని చెప్పారు. భూమి కోసం, భుక్తి కోసం ఉద్యమాలు చేపట్టిన ఘనత సీపీఐకి దక్కుతుందన్నారు. కొత్తగా ఏర్పడిన మన్యం జిల్లా అభివృద్ధి శూన్యమన్నారు. తోటపల్లి పూర్వపు ఎడమ, కుడి కాలువల ఆధునికీరణలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఆరోపించారు. జంఝావతి ప్రాజెక్టుకు అర్ధ శతాబ్ధం కావస్తున్నా నేటికీ శివారు ప్రాంతాలకు సాగునీరు అందడం లేదన్నారు. వెంగలరాయసాగర్, పెద్దగెడ్డ, జంపరకోట రిజర్వాయర్, కారిగెడ్డ, అడారిగెడ్డ, గుమ్మడిగెడ్డ తదితర రిజర్వాయర్ పనులు తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు, దళితులకు భూములు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయన్నారు. ఆగస్టు 23, 24, 25 తేదీల్లో ఒంగోలులో రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని తెలిపారు. అంతకుముందు స్థానిక కోటదుర్గమ్మ ఆలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా గాయత్రీ కల్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో పాలకొండ పట్టణం ఎర్ర జెండాలతో ఎరుపెక్కింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామేశ్వరరావు, ఆహ్వాన సంఘ ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు, కూరంగి మన్మధరావు, కె.రామకృష్ణ, జేవీ సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.