The festive spirit should be reflected. పండగ శోభ ప్రతిబింబించాలి
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:00 AM
The festive spirit should be reflected. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రతిఒక్కరి మదిలో నిలిచిపోయేలా అధికారులంతా సమన్వయంతో విధులు నిర్వహించి పండగ శోభను ప్రతిబింబించాలని కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి సూచించారు. ప్రతిదశలోనూ సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు.
పండగ శోభ ప్రతిబింబించాలి
అధికారులంతా సమన్వయంతో పనిచేయాలి
సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా వీఐపీ దర్శనాలు
పండగ ఏర్పాట్లపై సమీక్షించిన కలెక్టర్ రామసుందర్ రెడ్డి
విజయనగరం, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి):
పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రతిఒక్కరి మదిలో నిలిచిపోయేలా అధికారులంతా సమన్వయంతో విధులు నిర్వహించి పండగ శోభను ప్రతిబింబించాలని కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి సూచించారు. ప్రతిదశలోనూ సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. అమ్మవారి పండగ ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశమందిరంలో అధికారులతో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు కేటాయించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని, సిరిమాను పవిత్రతను కాపాడుతూ భక్తుల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. వీఐపీ దర్శనాల వల్ల సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. సిరిమాను తిరిగే ప్రదేశంలో ఎక్కడా రోడ్డుపై గుంతలు లేకుండా చూడాలని, అలాగే పారిశుధ్యం, రక్షిత తాగునీటి సరఫరా, బయో టాయిలెట్స్ ఏర్పాటు, నగరమంతా సందరీకరణ, విద్యుత్ అలంకరణ తదితర పనులను మున్సిపల్ శాఖ వారు చూడాలని సూచించారు. పండగలో ప్లాస్టిక్‌ను వినియోగించకుండా చూడాలని, క్యూలైన్ల వద్ద ఏర్పాటు చేసిన తాగునీరు పేపర్ గ్లాస్‌ల ద్వారా అందించాలని చెప్పారు. ప్రసాదాలను ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తనిఖీ చేయాలని, అన్ని ఆర్వో ప్లాంట్లను ఆర్‌డీవో ఆధ్వర్యంలో తనిఖీ చేయాలని సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి, అత్యవసర చికిత్సకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రధానంగా 6, 7 తేదీల్లో తొలేళ్లు, సిరిమాను ఉత్సవం సందర్భంగా ఎక్కువ మంది భక్తులు వస్తారని, శాంతి భద్రతలకు సమస్య రాకుండా చూడాలని సూచించారు. వాహనాల పార్కింగ్‌కు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. బార్‌కేడ్ల ఎత్తు పెంచాలని, లేదంటే పైనుండి దూకి వస్తున్నారని పోలీస్ వారు చేసిన విజ్ఞప్తి మేరకు 4 అడుగుల నుండి 5 అడుగులకు పెంచాలని ఆర్ అండ్‌బీ అధికారులకు సూచించారు. తెప్పోత్సవం రోజున గజ ఈతగాళ్లు ఉండాలని మత్స్యశాఖ వారికి, తెప్పలను తనిఖీ చేసి సర్టిఫికెట్ ఇవ్వాలని ఆర్‌అండ్‌బీ వారికి సూచించారు. జేసీ ఎస్.సేతుమాధవన్ మాట్లాడుతూ అక్టోబరు 1 నుండి 7 వరకు నగరమంతా సందరీకరణ చేయాలని ఎంఎస్‌ఎంఈ మంత్రి సూచించారని, సోషల్ మీడియా, సందరీకరణ, ఎల్‌ఈడి స్ర్కీన్ల ఏర్పాట్లు చూడాలని సమాచార శాఖ అధికారులకు ఆదేశించారు. సమవేశంలో అదనపు ఎస్‌పి సౌమ్యలత, డీఆర్‌వో శ్రీనివాస్ మూర్తి, ఆర్‌డీవో కీర్తి, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శిరీష, పూజారి బంటుపల్లి వెంకటరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.