Share News

కొండలపై అక్రమార్కుల కన్ను

ABN , Publish Date - Sep 14 , 2025 | 11:51 PM

జిల్లాలో పచ్చని కొండలపై అక్రమార్కుల కన్నుపడింది. ప్ర

కొండలపై అక్రమార్కుల కన్ను
వెలుగుల మెట్ట ఇదే

- ఇప్పటికే బడిదేవరకొండపై గ్రానైట్‌ తవ్వకాలు

- రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతంలో ఉన్నా వెనక్కి తగ్గని వైనం

-తాజాగా వెలుగుల మెట్టపై దృష్టి

- క్వారీ వద్దంటున్న రెండు గ్రామాల ప్రజలు

- ప్రజాభిప్రాయ సేకరణలో నిరసన

- అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారో?

పార్వతీపురం, సెప్టెంబరు14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పచ్చని కొండలపై అక్రమార్కుల కన్నుపడింది. ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతం బడిదేవర కొండపై యథేచ్ఛగా గ్రానైట్‌ తవ్వకాలు చేపడుతున్న విషయం తెలిసిందే. పార్వతీపురం మండలం డీకేపట్నం తదితర పంచాయతీల పరిధిలో ఉన్న పచ్చని కొండలను పిండి చేస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. మరోవైపు పంటలు దెబ్బ తింటున్నా, చెరువులు కలుషితమవుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. దీనిపై ఆయా ప్రాంత గిరిజనులు, రైతులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా.. తవ్వకాలు ఆగడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం కాలంలో అనుమతులు పొందిన వారు ఇప్పుడు బడిదేవరకొండ వద్ద తవ్వకాలు జరిపి విలువైన గ్రానైట్‌ను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కాగా ఇప్పడు గ్రానైట్‌ వ్యాపారులు పార్వతీపురం మండలం హెచ్‌.కారాడవలస, పెద్దబొండపల్లి గ్రామాల రెవెన్యూ పరిధిలో ఉన్న వెలుగుల మెట్టపై దృష్టి కేంద్రీకరించారు. ఆ ప్రాంతంలో గ్రానైట్‌ తవ్వకాలకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలోనే వారు అనుమతులకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. వాస్తవంగా ఈ ప్రాంతంలో తవ్వకాలు చేపడితే ఆ రెండు గ్రామాలతో నరిసిపురం తదితర ప్రాంతాల్లో పంటలు దెబ్బతినే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో ఆ ప్రాంతవాసులు నిరసన తెలిపారు. తమ ప్రాంతంలో క్వారీ వద్దని ముక్తకంఠంతో నినదించారు. గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతులు ఇస్తే సహించేది లేదని తెలిపారు. కాగా దీనిపై అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చూడాల్సి ఉంది.

అనుమతులు ఇవ్వొద్దు

‘మా ప్రాంతంలో గ్రానైట్‌ తవ్వకాలు చేపట్టవద్దు. రైతుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి అనుమతుల మంజూరు చేయొద్దని అధికారులకు తెలియజేశాం. ప్రజాభిప్రాయాలను గౌరవిస్తారని ఆశిస్తున్నాం. కారాడవలసకు చెందిన సత్యరానాయణ, మండల ఫకీరునాయుడు తదితరులు తెలిపారు. దీనిపై డీఆర్వో హేమలతను వివరణ కోరగా.. ప్రజాభిప్రాయాలను పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుకు తెలియజేశామన్నారు. సంబంధిత అధికారుల నుంచి నివేదిక రావల్సి ఉందని తెలిపారు.

బడిదేవరకొండపై కలెక్టర్‌ ఆరా...

పార్వతీపురం మండలం కోరి పంచాయతీ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఉన్న బడిదేవరకొండపై చేపడుతున్న గ్రానైట్‌ తవ్వకాలపై నూతన కలెక్టర్‌ ప్రభాకర్‌రెడి ఆరా తీశారు. ఈనెల 13న ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన సమస్యలు ఇవిగో కథనంపై ఆయన స్పందించారు. ఈ మేరకు బడిదేవరకొండపై జరుగుతున్న గ్రానైట్‌ తవ్వకాలపై పూర్తి నివేదిక అందించాలని గనులశాఖకు కలెక్టర్‌ ఆదేశించారు. ఇక్కడి పరిస్థితిపై పూర్తిస్థాయిలో కలెక్టర్‌ సమీక్ష నిర్వహిస్తే అసలు గుట్టు బయటపడనుంది.

అసలు గుట్టు ఇది..

రిజర్వ్‌ ఫారెస్ట్‌లో గ్రానైట్‌ తవ్వకాలు చేపడుతున్నట్లు గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి జిల్లా అటవీ శాఖ అధికారి లక్ష్మణ్‌ పూర్తి ఆధారాలతో హైకోర్టుకు సమర్పించారు. దీంతో ఆ ప్రాం తంలో వెంటనే తవ్వకాలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించి రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఆఫ్‌ ఇండియా సర్వే బృందంతో ఆ ప్రాంతాన్ని సర్వే చేయాలని కోరారు. కోర్టు ఆదేశాల మేరకు సర్వే చేపట్టిన బృందం ఆ ప్రాంతం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో లేదని కోర్టుకు నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా చేసుకొని, స్థానిక అటవీశాఖాధికారులను సం ప్రదించిన అనంతరం వారి ఆమోదంతోనే గ్రానైట్‌ తవ్వవాలు చేపట్టాలని కాంట్రాక్టర్లను హైకోర్టు ఆదేశించింది. కానీ, కాంట్రాక్టర్లు మాత్రం అటవీశాఖ అనుమతులు లేకుండానే ఆ ప్రాంతంలో గ్రానైట్‌ తవ్వకాలు ప్రారంభించారు. నూటికి నూరు శాతం ఆ ప్రాంతం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఉన్నట్టు ఒకప్పుడు అటవీశాఖ నిరూపించింది. ఇప్పుడు మరోసారి కోర్టును ఆశ్రయించి గ్రానైట్‌ తవ్వకాలను అడ్డుకోవాల్సి ఉన్నా ఎందుకనో అటవీశాఖ వెనుకడుగు వేస్తుంది. ఈ అంశంపై కలెక్టర్‌ పూర్తిస్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Updated Date - Sep 14 , 2025 | 11:51 PM