The district ranks second in house construction గృహ నిర్మాణంలో జిల్లాకు రెండో స్థానం
ABN , Publish Date - Dec 18 , 2025 | 12:10 AM
The district ranks second in house construction ఇళ్ల నిర్మాణంలో జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉందని కలెక్టర్ రామసుందర్ రెడ్డి సీఎంకు వివరించారు. ఈ ఉగాది నాటికి ఇంకా 13 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాల్సి ఉందని, ఈ ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు.
గృహ నిర్మాణంలో జిల్లాకు రెండో స్థానం
ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామన్న కలెక్టర్
అమరావతి కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబుకు నివేదించిన రామసుందర్‌రెడ్డి
ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి
విజయనగరం, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి):
ఇళ్ల నిర్మాణంలో జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉందని కలెక్టర్ రామసుందర్ రెడ్డి సీఎంకు వివరించారు. ఈ ఉగాది నాటికి ఇంకా 13 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయాల్సి ఉందని, ఈ ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో బుధవారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు సూచనలు పాటిస్తూ జిల్లా అవసరాలను వివరించారు. జిల్లా వ్యాప్తంగా 568 కాలనీల్లో ఉగాది నాటికి సీసీ రోడ్లు, తాగునీటి సదుపాయం కల్పించాలని కలెక్టర్ కోరగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. గ్రామాల్లో పాడి పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే ఊరూరా పశుగ్రాసం పథకం అమలు చేయాలని కలెక్టర్ కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ ప్రతిపాదనను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. పింఛన్లు పొందుతున్న వారిలో అసంతృప్తి ఉందని సీఎం ప్రస్తావించగా దీనికి కలెక్టర్ స్పందిస్తూ సరిచేస్తామని సమాధానమిచ్చారు. అలాగే జిల్లాలోని మామిడి పంట ఎకరాకు 17 మెట్రిక్ టన్నుల దిగుబడి రావాలని ప్రస్తుతం 14 మెట్రిక్ టన్నులే వస్తోందని, దీనిని 17కు పెంచాలని సూచించారు. భూగర్భ జలాలు జిల్లాలో ప్రస్తుతం 2.6 మీటర్ల వద్ద ఉన్నాయని, దీనిని కొనసాగించాలని సూచించారు. భూగర్భ జలాలను సద్వినియోగం చేయాలని, రానున్న వర్షాకాలంలో నీటి లభ్యత అధికంగా ఉండేలా చూసుకోవాలని, ఇప్పటినుంచే ప్రణాళికతో పనులు కొనసాగించాలన్నారు. సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వెయ్యాలని సీఎం సూచించగా దీనికి కలెక్టర్ స్పందిస్తూ కొంతమంది సర్వేయర్లు గ్రామాల్లో సర్వేలకు వెళ్తున్నారని, దీనివల్ల బయోమెట్రిక్ వేయలేకపోతున్నారని చెప్పారు. దీనికి సీఎం స్పందిస్తూ అలాంటి పరిస్థితుల్లో ఫేసియల్ హాజరు వేయాలని ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న పాఠశాలల భవనాలను, తరగతి గదులను పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన పారిశ్రామిక సదస్సులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన వారికి 45 రోజుల్లో భూమిని చూపించాలని సీఎం ఆదేశించారు. జిల్లాలోని రాజాం, చీపురుపల్లి, విజయనగరం నియోజకవర్గాల్లో ఇంకా ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేయలేదని, వెంటనే ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తే వారికి అన్ని విధాలా సహకరించాలని, భూ సమస్యలుంటే పరిష్కరించాలని సీఎం ఆదేశించారు.