Share News

పీజీఆర్‌ఎస్‌ వినతుల పరిష్కారంలో జిల్లా ముందంజ

ABN , Publish Date - Dec 18 , 2025 | 11:34 PM

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు వచ్చిన వినతులను పరిష్కరించడంలో రాష్ట్రంలో జిల్లా ముందజలో నిలిచింది.

 పీజీఆర్‌ఎస్‌ వినతుల పరిష్కారంలో జిల్లా ముందంజ
కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి, ఎస్పీ దామోదర్‌

-పీఎంఈజీపీ రుణాల మంజూరులో కూడా..

-జీడీడీపీ పనితీరులో 7వ స్థానం

- కలెక్టర్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు

విజయనగరం, కలెక్టరేట్‌ డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు వచ్చిన వినతులను పరిష్కరించడంలో రాష్ట్రంలో జిల్లా ముందజలో నిలిచింది. రాష్ట్ర రాజధాని అమరావతిలో రెండో రోజు గురువారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి, ఎస్పీ దామోదర్‌ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతి ఒక్క విషయాన్ని సమీక్షించారు. సమీక్ష నివేదిక ప్రకారం వివిధ విభాగాల్లో జిల్లా ముందంజలో నిలిచింది. సెప్టెంబరు 15 నుంచి డిసెంబరు 15 వరకూ పీజీఆర్‌ఎస్‌ వినతులను పరిష్కరించడంలో జిల్లా అధికార యంత్రాంగం మంచి పనితీరును కనబరిచింది. స్వీకరించిన 4,400 వినతుల్లో 605 ఆర్థిక పరమైన వినతులను పరిష్కరించారు. 97 శాతం సానుకూల ఆడిట్‌ ఫలితం వచ్చింది. పీఎంఎప్‌ఎంఈ వ్యక్తిగత రుణాల మంజూరులో రెండో స్థానం, పీఎంఈజీపీ రుణాల మంజూరులో అగ్రస్థానం, 2025-26 ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్‌ - సెప్టెంబరు) స్థూల జిల్లా దేశీయోత్పత్తి(జీడీడీపీ) పనితీరులో 7వ స్థానంలో జిల్లా నిలిచింది. 2025-26 సంవత్సరానికి రూ.47,209 కోట్ల జీడీడీపీ లక్ష్యం ఉండగా మొదటి అర్ధ భాగంలో రూ.19,836 కోట్లు సాధించింది. మ్యుటేషన్‌ కోసం రైతులు ఆన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తులను తిరస్కరించే సంఖ్య చాలా తక్కువగా ఉంది. భూ రీసర్వే జరిగిన గ్రామాల్లో జాయింట్‌ ఎల్‌పీఎంలను సబ్‌ డివిజన్‌ చేయడంలో జిల్లా అఽధికారులు ప్రత్యేక చొర చూపించారు. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకంలో జిల్లా అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. పలు విభాగాల్లో జిల్లా మంచి ప్రగతి సాధించడంతో సీఎం చంద్రబాబునాయుడు కలెక్టర్‌ను అభినందించారు.

Updated Date - Dec 18 , 2025 | 11:34 PM