Share News

శిథిలావస్థలో తురకనాయుడువలస వంతెన

ABN , Publish Date - Mar 14 , 2025 | 12:54 AM

ఇది తురకనాయుడువలసలో పురాతన వంతెన దుస్థితి. మండల కేంద్రం నుంచి 25 గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ఇదే షార్ట్‌ కట్‌ రహదారి.

శిథిలావస్థలో తురకనాయుడువలస వంతెన

  • బిక్కుబిక్కుమంటూ రాకపోకలు

  • భయాందోళనలో రెండు మండలాల ప్రజలు

జియ్యమ్మవలస, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ఇది తురకనాయుడువలసలో పురాతన వంతెన దుస్థితి. మండల కేంద్రం నుంచి 25 గ్రామాల ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ఇదే షార్ట్‌ కట్‌ రహదారి. కీలకమైన ఈ మార్గంలో ఉన్న వంతెన శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. వాస్తవంగా 1902లో బ్రిటీష్‌ హయాంలో దీనిని నిర్మించారు. ప్రస్తుతం ఇది పూర్తి శిథిలావస్థకు చేరుకుంది. వంతెన పిల్లర్లు, శ్లాబు గజాలు బయటకు కనిపిస్తున్నాయి. రక్షణ గోడ కూడా లేదు. దీనిపై నుంచే రోజూ పెదబుడ్డిడి, ఇటిక - నాగూరు బస్సులు, ప్రైవేట్‌ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. వంతెన ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో గరుగుబిల్లి-జియ్యమ్మవలస మండలాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇంకో విషయం ఏమిటంటే ఈ వంతెనకు సమీపంలోనే తోటపల్లి ఎడమ కాలువ డిస్ట్రిబ్యూటరీ ఉంది. దీంతో ప్రాజెక్టు ఆధునికీకరణలో భాగంగా ఈ వంతెన పనులు చేపట్టేందుకు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్‌ అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీనిపై దృష్టిసారించ లేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం స్పందించాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు.

Updated Date - Mar 14 , 2025 | 12:54 AM