మొంథా తుఫాన్ మిగిల్చిన నష్టం
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:12 AM
మొంథా తుఫాన్ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మూడురోజులపాటు కురిసిన భారీ వర్షాలకు వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.
- తుఫాన్‌తో దెబ్బతిన్న పంటలు
- వెయ్యి ఎకరాల్లో వరి, 130 ఎకరాల్లో పత్తి..
- ఇంకా ముంపులోనే పొలాలు
- కన్నీరుపెడుతున్న రైతులు
- పంట నష్టం అంచనా వేస్తున్న అధికారులు
పార్వతీపురం, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మూడురోజులపాటు కురిసిన భారీ వర్షాలకు వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఈదురుగాలుల ప్రభావానికి ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి. వరి పంట నేలకొరిగింది. జిల్లాలో వెయ్యి ఎకరాల్లో వరి పంటకు, 130 ఎకరాల్లో పత్తికి నష్టం కలిగినట్టు ప్రాథమిక అంచనా. చేతికొచ్చిన పంటలు నీటమునగడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కళ్లాలు, రోడ్లపై ఆరబెట్టిన మొక్కజొన్న, ధాన్యం తడిసి మొలకలెత్తడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం భరోసా ఇచ్చినప్పటికీ, నేలకొరిగిన వరి చేలుతో దిగుబడి ఎలా ఉంటుందో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి రైతు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొమరాడ, సాలూరు, కురుపాం, పాచిపెంట తదితర మండలాల్లో పత్తి పూర్తిగా తడిసిముద్దయింది. ఇదే అదునుగా దళారులు దోపిడీకి పాల్పడుతున్నారు. తక్కువ ధరకు ఇస్తేనే పత్తిని కొనుగోలు చేస్తామని వారు చెబుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారు అడిగిన రేటుకు పత్తిని రైతులు విక్రయిస్తున్నారు.
ముంపులోనే పంటలు..
గరుగుబిల్లి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని రావుపల్లిలో పంట పొలాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. భారీ వర్షాలకు దేసూరిగెడ్డకు వరద ముంచెత్తింది. దీంతో దాని పరిధిలో ఉన్న సుమారు 100 ఎకరాలకు పైగా వరి పంట ముంపునకు గురైంది. చేతికి అందిన పంటకు నష్టం వాటిల్లిందని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
నాగావళికి వరద
తోటపల్లి సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదిలో గురువారం వరద ప్రవాహం నెలకొంది. తుఫాన్ కారణంగా ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నదిలోకి భారీగా వరద వచ్చి చేరుతుంది. నదిలోకి 17,500 క్యూసెక్కులు రాగా, దిగువ ప్రాంతాలకు స్పిల్‌వే గేట్ల నుంచి 11,200 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ప్రాజెక్టు పరిధిలో 105 మీటర్లకు గాను 104.03 మీటర్ల నిల్వ సామర్థ్యం ఉంది. ఒడిశాలో అధికంగా వర్షాలు కురిస్తే వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని ప్రాజెక్టు జేఈ బి.కిషోర్‌కుమార్, ఆపరేటర్ కె.రామకృష్ణ తెలిపారు. ప్రాజెక్టు ప్రాంతంలో అధికారులు అప్రమ త్తంగా ఉన్నారు. నదీ తీర ప్రాంతవాసులకు అవసరమైన హెచ్చరికలు జారీ చేశారు.
ఐదు మేక పిల్లలు మృతి
కురుపాం రూరల్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): తుఫాన్‌తో కురిసిన వర్షాలు, ఈదురుగాలుల కారణంగా ఉదయపురం పంచాయతీ అధ్వాన్నంగూడలో గురువారం ఐదు మేక పిల్లలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన బిడ్డిక వెంకన్న తన ఐదు మేక పిల్లలను ఇంటి గడపలో కట్టాడు. వర్షానికి అవి తడిసిపోయి, గాలులకు తట్టుకోలేక మృతి చెందాయని వెంకన్న రోదిస్తున్నాడు. వాటి విలువ రూ. 50 వేలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
కోతకు గురైన రోడ్డు..
వర్షాలకు వలసబల్లేరు పంచాయతీ ఆగంగూడ రోడ్డు పూర్తిగా కోతకు గురైంది. దీంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడంతో వర్షాలకు కోసుకుపోయిందంటూ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
రైతులు భయపడొద్దు: జేసీ
సాలూరు రూరల్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): తుఫాన్‌తో నష్టాలకు గురైన రైతులు భయపడొద్దని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్ రెడ్డి అన్నారు. పెదపథంలో గురువారం ఆయన పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. అధికారుల నుంచి నివేదిక వచ్చిన తదుపరి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందన్నారు. ఏపీఎయిమ్స్ యాప్‌లో పంట నష్టం నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సాలూరు వ్యవసాయాధికారి కె.శిరీష, అధికారులు, టీడీపీ నేత మత్స శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.