Share News

కలెక్టర్‌ వ్యాఖ్యలు బాధ కలిగించాయి

ABN , Publish Date - Jun 28 , 2025 | 12:34 AM

జిందాల్‌ భూ నిర్వాసితుల విషయంపై కలెక్టర్‌ అంబేడ్కర్‌ చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అన్నారు.

 కలెక్టర్‌ వ్యాఖ్యలు బాధ కలిగించాయి

-ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు

శృంగవరపుకోట రూరల్‌, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): జిందాల్‌ భూ నిర్వాసితుల విషయంపై కలెక్టర్‌ అంబేడ్కర్‌ చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీ నుంచి ఫోన్‌లో మాట్లాడారు. ‘జిందాల్‌ భూ నిర్వాసితులకు అన్ని చెల్లింపులు చేశామని కలెక్టర్‌ ప్రకటించడం ఆవేదన కలిగించింది. జిందాల్‌ సంస్థ రైతులకు ఇచ్చిన హామీల్లో చాలా లోపాలు ఉన్నాయన్న విషయం కలెక్టర్‌కు తెలిసి ఉండకపోవచ్చు. ఎస్సీ, ఎస్టీ రైతులను జిందాల్‌ మోసం చేసింది. ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు నిర్వాసితులు వ్యతిరేకం కాదు. వారు పరిశ్రమలను స్వాగతిస్తున్నారన్న విషయాన్ని కలెక్టర్‌ గ్రహించాలి. వారితో కనీసం ఒక మాట అయినా మాట్లాడకుండా, వారికి అన్ని ఇచ్చేశాం.. ఇంకా ఏమీ ఇవ్వనవసరం లేదని కలెక్టర్‌ చెప్పడం సరికాదు. ఆయన వ్యాఖ్యలు నిర్వాసితుల మనసులను గాయపరిచాయి. పరిశ్రమలకు తాటిపూడి నీరు ఇస్తామని చెబుతున్నారు. దీనిపై ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. వారికి ఏం సమాధానం చెబుతారు. కలెక్టర్‌ ప్రకటనపై నిర్వాసితులతో మాట్లాడి కార్యాచరణ చేపడతాం’ అని ఎమ్మెల్సీ రఘురాజు తెలిపారు.

Updated Date - Jun 28 , 2025 | 12:34 AM