Share News

The choice is hard! ఎంపిక కష్టమే!

ABN , Publish Date - Jul 31 , 2025 | 12:13 AM

The choice is hard! పేదరికం లేని సమాజం కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘బంగారు కుటుంబాలు- మార్గదర్శులు’ పథకంపై పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది. అయితే ఎంపికలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బంగారు కుటుంబాల జాబితాలోనూ లోపాలు ఉన్నాయి.

The choice is hard! ఎంపిక కష్టమే!

ఎంపిక కష్టమే!

ప్రహసనంగా మార్గదర్శుల గుర్తింపు

బంగారు కుటుంబాల జాబితాలోనూ లోపాలు

జిల్లాలో 60,067 ఉన్నట్లు ప్రకటన

తలలు పట్టుకుంటున్న అధికారులు

దత్తత బలవంతం కాదు: కలెక్టర్‌

విజయనగరం, జూలై 30 (ఆంధ్రజ్యోతి):

పేదరికం లేని సమాజం కోసం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘బంగారు కుటుంబాలు- మార్గదర్శులు’ పథకంపై పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది. అయితే ఎంపికలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బంగారు కుటుంబాల జాబితాలోనూ లోపాలు ఉన్నాయి. ఆర్థికంగా ఉన్నత వర్గాల వారు నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకోవాలన్నది ఈ పథకం ఉద్దేశం. కొన్నిచోట్ల ఐదు ఎకరాల వరకూ భూములు ఉన్నవారిని, ఉపాధి అవకాశాలు బాగున్న వారిని సైతం గుర్తించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పథకం అమలులో కాస్త గందరగోళం నెలకొంది.

జిల్లావ్యాప్తంగా సర్వే ద్వారా 67,067 బంగారు కుటుంబాలను ఎంపిక చేశారు. నియోజకవర్గాల వారీగా జాబితాలను రూపొందించారు కానీ ఆ స్థాయిలో మార్గదర్శులు ముందుకు రావడం లేదు. పేద కుటుంబాల రూపంలో బంగారు కుటుంబాలు ఉన్నా.. మార్గదర్శలుగా నిలిచే ఉన్నతవర్గాల వారి నుంచి సహకారం అంతగా లేదు. ఈ విధానాన్ని అనేక మంది వ్యతిరేకిస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారినే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. మరోవైపు మార్గదర్శులుగా మారాలని ఉద్యోగులను బలవంతం పెడుతున్నారంటూ కొన్ని శాఖల్లో ప్రచారం జరుగుతోంది. ఇది అంతిమంగా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కొనసాగుతున్న సర్వే..

బంగారు కుటుంబాలపై జిల్లా వ్యాప్తంగా సర్వే జరుగుతోంది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వరకూ గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఈ గ్రామసభలు హడావుడిగా జరుగుతున్నాయన్న విమర్శలున్నాయి. విద్యుత్‌, వంట గ్యాస్‌ కనెక్షన్‌, బ్యాంకు ఖాతా లేనివారు, రక్షిత నీరు అందని వారిని మాత్రమే బంగారు కుటుంబాలుగా ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించింది కానీ అదరాబాదరాగా గ్రామసభలు నిర్వహిస్తున్నారు. నచ్చిన కుటుంబాలను ఎంపిక చేస్తున్నారు. చివరకు జిల్లాలో 67,067 బంగారు కుటుంబాలు ఉన్నట్టు తేల్చారు. ఇంత మొత్తంలో కుటుంబాలు ఉండడంతో భారీగా మార్గదర్శుల అవసరం పడింది.

మార్గదర్శులు అంతంతే..

జిల్లాలో మార్గదర్శులు కేవలం 2,479 మంది మాత్రమే నమోదయ్యారు. వాస్తవానికి ఇదో స్వచ్ఛంద ప్రక్రియ. సీఎం చంద్రబాబు కూడా స్వచ్ఛందంగా మాత్రమే మార్గదర్శులను ఎంపిక చేయాలని సూచించారు. దీనిపై యంత్రాంగంలో అవగాహన పెరిగితేనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. లేకుంటే ఇబ్బందికరమే. వాస్తవానికి రూ.500 నుంచి రూ.5000ల వరకూ ఇవ్వొచ్చు. పేద పిల్లలకు ఉచిత విద్య, వైద్యం అందించవచ్చు. వారి చదువులకు సాయం చేయవచ్చు. బ్యాంకు రుణాలు ఇప్పించి వారి జీవనోపాధిని మెరుగుపరచవచ్చు. చిన్నచిన్న దుకాణాలు పెట్టేలా ఆర్థిక ప్రోత్సాహం అందించవచ్చు. ఇలా ఏ విధంగానైనా మార్గదర్శలుగా నిలవొచ్చు. అయితే మార్గదర్శులు అంటే లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టాలని.. ప్రభుత్వానికి భారీ విరాళాలు అందించాలన్న అపోహ ఉంది. ప్రభుత్వం మాత్రం చిన్నమొత్తంలో సైతం సాయం చేయవచ్చని చెబుతోంది. దీనిపై అవగాహన కల్పించడంలో యంత్రాంగం విఫలమవుతోంది. ఫలితంగా మార్గదర్శులు ముందుకురాని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా జిల్లాలో ఎమ్మెల్యేలు సైతం బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవడానికి ముందుకు రాకపోవడం గమనార్హం.

ప్రభుత్వ ఆదేశాలు పాటించాలి

ఇదో స్వచ్ఛంద కార్యక్రమం. ఎవరిపై ఒత్తిడి లేదు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలి. ఏ శాఖ అధికారులు, ఉద్యోగులపైనా బలవంతం లేదు. ప్రభుత్వ ఆశయాన్ని వివరించి ఒప్పించాలే తప్ప బలవంతం పెట్టకూడదు. తక్కువ మొత్తంలో కూడా మార్గదర్శులుగా మారవచ్చునన్న విషయాన్ని చెప్పాలి.

- డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, కలెక్టర్‌, విజయనగరం

Updated Date - Jul 31 , 2025 | 12:13 AM